– సడలింపులతో పెరుగుతున్న ఆందోళన
– తక్కువ టెస్టులతో ప్రజల్లో తొలగని భయం
– లక్షణాల్లేని వారితో ప్రమాదమంటున్న డాక్టర్లు
– అందరికీ చేయాలంటున్న వామపక్షాలు

హైదరాబాద్‌ : ఒక దాని తర్వాత ఒకటన్నట్టుగా సడలింపులు పెంచుకుంటూ పోతున్నా కరోనా టెస్టులు మాత్రం పరిమితంగానే చేస్తుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతున్నది. రాష్ట్రంలో టెస్టులు పెంచాలని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా సీపీఐ(ఎం) తదితర వామపక్షాలు, మేధావులు చేస్తున్న వాదనను పక్కన పెట్టి అవసరమైన మేరకే టెస్టులు చేస్తామని సర్కారు చెబుతున్నది. పాజిటివ్‌ కేసులతో కాంటాక్టు అయిన వారిలో వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తూ అవి లేని వారిని మాత్రం హౌం క్వారంటైన్‌కు పంపిస్తున్నది. దీంతో లక్షణాలు బయటపడని పాజిటివ్‌ కేసులు క్యారియర్లుగా మారితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని వైద్యనిపుణులే అభిప్రాయపడుతున్నారు. లక్షణాల్లేనివారిని నిర్లక్ష్యం చేసిన దేశాల అనుభవాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్రప్రభుత్వ అధీనంలోని ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాల మేరకే తక్కువ పరీక్షలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్నా, ఆ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదని పలువురు సూచిస్తున్నారు. ఐసీఎంఆర్‌ నిబంధనలనే పాటిస్తున్నామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం, అదే సంస్థ అనుమతించిన ప్రయివేటు ల్యాబ్‌ల్లో పరీక్షలకు అడ్డుకోవడం గమనార్హం. పైపెచ్చు ప్రభుత్వ అధీనంలోని ప్రస్తుతం చేస్తున్న తొమ్మిది ల్యాబ్‌లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్న కనిపించడం లేదు. ఒక్కో టెస్టుకు రూ.4500 వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో తక్కువ టెస్టులతో సరిపెట్టుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటిదాకా సర్కారు రూ.వెయ్యి కోట్లలోపు వ్యయం చేసినట్టు సమాచారం.

మార్చి ఒకటిన మొదటి కోవిడ్‌-19 కేసు వెలుగు చూసినది మొదలు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించేనాటికి 27 కేసులు, లాక్‌డౌన్‌ అమలు చేసిన మరుసటి రోజు 23 నాటికి 30 కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే 20 రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 30కి మాత్రమే చేరుకుంది. రాష్ట్రంలో టెస్టులు చేయడం తొలుత గాంధీ ఆస్పత్రికే పరిమితం చేయగా, అనంతరం సీసీఎంబీ తదితర చోట్లకు విస్తరించారు. అయితే పరీక్షల సంఖ్య పెంచకపోవడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా తక్కువగానే వస్తున్నాయనే అనుమానం బలపడుతూ వచ్చింది. తాజాగా రాష్ట్రంలో ప్రయివేటు ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతించకుండా తక్కువ టెస్టులు చేయడాన్ని ప్రశ్నించింది. విదేశాల నుంచి వచ్చిన వారు, మర్కజ్‌ నుంచి వచ్చిన వారిలో కరోనా రోగులు, వారిని కలిసిన ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తూ వచ్చారు. సూర్యాపేట లాంటి జిల్లాల్లో సెకెండరీ కాంటాక్టుల్లోనూ కేసులు వెలుగు చూడడంతో వారందరికీ పరీక్షలు చేయాలని భావించినా దాన్ని అమలు చేయలేదు. ఈ నెల 14వ తేదీ వరకున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2.1 లక్షల మందికి, తమిళనాడులో 2.9 లక్షల మందికి చేయగా మిగతా రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో చేస్తున్నారు.

రాష్ట్రంలో మాత్రం 22,842 టెస్టులతో సరిపెట్టారు. ఈ లెక్కన రోజుకు సరాసరిన 300 మాత్రమే పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ సమయాన్ని టెస్టులు ఎక్కువగా చేయడానికి ఉపయోగించుకోవాలని వచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలున్నాయి. పరీక్షలు తక్కువగా చేయడంతోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా వస్తున్నదన్న విమర్శలను పక్కన పెట్టి, కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తూ వచ్చింది. చివరకు కరోనా జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి తదితర ఒకట్రెండు ప్రాంతాల్లోనే ఉందంటూ కేంద్ర మార్గదర్శకాల మేరకంటూ భారీ స్థాయిలో సడలింపులిచ్చారు. మరోవైపు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు మద్యం దుకాణాలు తెరిచింది మొదలు క్రమక్రమంగా సడలింపులతో భౌతికదూరం (కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు విస్తరణ చైన్‌ను తెంచే ఏకైక మార్గం) అంటూ చెబుతూ వచ్చిన దానికి అర్థం లేకుండా పోయింది. లక్షలాది మంది వలసకార్మికుల్లో ఉపాధికి గాని, స్వస్థలాలకు గాని పంపించేందుకు అవసరమైన విశ్వాసాన్ని కల్పించలేకపోవడంతో వారంతా ఆందోళనలో భౌతికదూరం మరిచారు. షాపులు, ఇతర ప్రాంతాల్లో నిబంధనలు విధించినా అమలు పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో దాదాపు రెండు నెలల నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ప్రతి రోజూ సగటున 40 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తున్నది.

కరోనాతో సహజీవనం తప్పదా?
కరోనాతో సహజీవనం తప్పదనీ, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచనలు చేసి ప్రభుత్వం చేతులెత్తేస్తే సరిపోదనే డిమాండ్‌ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంస్థల నుంచి బలంగా వినిపిస్తున్నది. మొదట్నుంచి చెప్పినట్టు లక్షణాలున్నా, లేకున్నా పాజిటివ్‌ కేసులన్నింటిని గుర్తించి, వారి నుంచి మిగతా వారికి సోకకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు, పరీక్షలను పెంచాలని పలువురు సూచిస్తున్నారు.

Courtesy Nava Telangana