జయశంకర్ భూపాలపల్లి : ఇద్దరు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేకపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో కన్నుమూసింది. తన ప్రాణంలాంటి ప్రియురాలే లేని ఈ లోకంలో ఇక తాను భూమి మీద బతకడం ఎందుకని భావించిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఇరువురి మరణంతో ఆ రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

మొదట ప్రియురాలు గీతాంజలి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు మహేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం నాడు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లిన మహేష్ ఉరేసుకున్నాడు. ఈ ఘటనలతో ఇరు కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Courtesy Andhrajyothi