• కారులో వెంబడించి ఢీ కొట్టి చితకబాదిన యువతి కుటుంబీకులు
  • నిర్మల్‌ జిల్లా భైంసాలో ఘటన 

భైంసా రూరల్‌ : బైక్‌పై వెళ్తున్న యువతీయువకుల జంటను యువతి కుటుంబీకులు కారులో వెంబడించి ఢీ కొట్టారు. అనంతరం యువకుడిపై దాడి చేసి, అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో మూడు రోజుల క్రితం సినీఫక్కీలో చోటు చేసుకున్న ఈ ఘటన, ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక అంబేడ్కర్‌ కాలనీకి చెందిన నాగజ్యోతి డిగ్రీ చదువుతోంది. అదే కాలనీకి చెందిన అక్షయ్‌ ఇంటర్‌తో చదువు ఆపేసి ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే.. ఇద్దరి కుటుంబసభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో.. గత ఏడాది మే 28వ తేదీన భైంసాలోని బుద్ధవిహార్‌లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భైంసాలోనే గదిని అద్దెకు గదిని తీసుకొని ఉంటున్నారు.

ప్రేమ వివాహాన్ని సహించలేకపోయిన అమ్మాయి కుటుంబీకులు, అమ్మమ్మకు గుండెపోటు నెపంతో నెల క్రితం నాగజ్యోతిని ఇంటికి రప్పించి నిర్బంధించారు. స్థానిక పెద్దలతో పంచాయితీ పెట్టించి ఆగస్టు 20న విడాకులు తీసుకునేలా చేశారు. తాజాగా నాగజ్యోతి డిగ్రీ పరీక్ష రాసేందుకు కల్లూర్‌కు వచ్చింది. సమాచారం అందుకున్న అక్షయ్‌, ఆమెను బైక్‌పై వెళ్తుండగా.. యువతి కుటుంబీకులు కారులో వెంబడించారు. బైక్‌ను కారుతో ఢీకొట్టి.. అబ్బాయిని చితకబాదారు. ఘటనలో యువతీయువకులిద్దరికీ గాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Courtesy Andhrajyothi