నిస్సహాయురాలైన ఇష్రాత్‌ జహాన్‌ తల్లి
పదిహేనేండ్ల పాటు సుదీర్ఘ పోరాటం
గాంధీనగర్‌ : తన కూతురుకు న్యాయం జరుగుతుందని ఆశించి పదిహేనేండ్ల పాటు న్యాయస్థానాల చుట్టూ తిరిగిన ఇష్రాత్‌ జహాన్‌ తల్లి శమిమ కౌసర్‌ పోరాటాన్ని వదిలేసింది. ఈ కేసులో సుదీర్ఘకాలంగా విచారణకు హాజరవుతున్న ఆమె.. తాను విసిగిపోయాననీ, ఇకపై జరిగే విచారణలకు హాజరుకాబోనని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆమె లేఖ రాస్తూ.. ‘న్యాయం కోసం ఇంతకాలం పోరాటం చేశాను. కానీ ఇప్పుడు నిస్సహాయురాలిగా మారాను.
ఈ కేసులో నాకు న్యాయం దక్కుతుందన్న నమ్మకమూ కోల్పోయాను. నా కూతురు ఎన్‌కౌంటర్‌ జరిగి పదిహేనేండ్లు గడిచిపోయాయి. కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు.. విచారణ ఎదుర్కొంటున్నా బెయిలుపై విడుదలై తమ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇంతకాలమైనా ఇంకా విచారణ సాగుతూనే ఉన్నది. ఇక నేను విసిగిపోయాను. ఇంకా పోరాటం చేసే ఓపిక నాలో లేదు. ఈ కేసులో ఇకనుంచి జరిగే విచారణలకు నేను హాజరు కాలేను’ అని పేర్కొన్నారు. తన కూతురు అమాయకురాలనీ, కేవలం ముస్లిం అనే కారణంతోనే ఆమెను ఎన్‌కౌంటర్‌ చేశారని కౌసర్‌ ఆరోపించారు. నిందితులను శిక్ష నుంచి మినహాయించడమనే సంస్కృతితో తమలాంటి నిరుపేదల జీవితాలు మరింత దుర్భరం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను విచారించి వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత సీబీఐపై ఉన్నదని చెప్పారు. యూనిఫాంలలో ఉన్న నిందితులను విచారించి వారిపై శిక్ష పడేలా చూడాలని సీబీఐని ఆమె అభ్యర్థించారు. ముంబయికి చెందిన ఇష్రాత్‌ జహాన్‌ను.. ఉగ్రవాది అనే అనుమానంతో 2004లో అహ్మదాబాద్‌ పరిసర ప్రారతాల్లో గుజరాత్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం విదితమే.
ఈ కేసులో నలుగురు పోలీసు ఉన్నతాధికారులు జీఎల్‌ సింఘాల్‌, మాజీ డీఎస్పీ తరున్‌ బరోట్‌, మాజీ డిప్యూటీ ఎస్పీ జె.జి.పర్మర్‌, ఏఎస్‌పీ అనజు చౌదరిలపై అభియోగాలు నమోదయ్యాయి.

Courtesy Navatelangana