– విజయేష్‌ లాల్

లాక్‌డౌన్‌ వలన వ్యాపారాలు, మార్కెట్లు, పాఠశాలలు, కాలేజీలు మూసివేసిన సమయంలో… ఎవ్వరూ బయటకు వెళ్లని సమయంలో…క్రైస్తవులపై దాడులు నిలిచిపోతాయని భావించాం. అయితే లాక్‌డౌన్‌ సమయంలో దాడులు మరింతగా పెరిగాయి. మార్చిలో 33 దాడులు జరగ్గా, జూన్‌లో 21 దాడులు జరిగాయి. జులైలో మరింతగా పెరిగాయి.’

‘ఎవాంజెలికల్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ ఇండియా’ (ఈఎఫ్‌ఐ) విడుదల చేసిన మత నివేదిక ప్రకారం ఈ ఏడాది జున్‌ వరకూ క్రైస్తవులపై 135 దాడులు జరిగాయి. ఈఎఫ్‌ఐ తన నివేదిక విడుదల చేసిన కొద్ది రోజులకే ‘పెర్‌సెక్యూషన్‌ రిలీఫ్‌’ సంస్థ కూడా ఈ ఏడాది తొలి ఆరు నెలలకు నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ దేశంలో క్రైస్తవులపై దాడులు 40.87 శాతం పెరిగాయని ఆ సంస్థ ప్రతినిధి శిబు థామస్‌ తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును కాపాడ్డం కోసం ‘పెర్‌సెక్యూషన్‌’ పని చేస్తుంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌ నెల వరకూ క్రైస్తవులపై 293 దాడులు జరిగాయి. గత ఏడాది కన్నా దాడులు ఎక్కువయ్యాయి. 2019లో ఇదే సమయానికి 208 దాడులు జరిగాయి. శిబు థామస్‌ మాట్లాడుతూ ‘దేశంలో క్రైస్తవులపై శత్రు భావం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నివేదికలో పేర్కొన్న కేసులు వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరిగిన హింసలో కొంత భాగం మాత్రమే’ అని చెప్పారు. జరిగిన ఆరు హత్యలు మతపరమైన మూర్ఖత్వం కారణంగా జరిగాయన్నారు. ఈ హత్యలు గత మూడు నెలల్లో జార్ఘండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషాల్లో జరిగినట్లు చెప్పారు. 22 రాష్ట్రాల్లోనూ క్రైస్తవులపై దాడులు ఒకే రకంగా ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలోనూ ఇటీవల అంతర్వేదిలో, మండపేటలో క్రైస్తవ ప్రార్థనాస్థలాలపై దాడులు జరిగిన వార్తలు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లో అత్యధికం
ఈ రెండు సంస్థల నివేదికల ప్రకారం క్రైస్తవులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్‌ ముందుంది. ‘పెర్‌సెక్యూషన్‌ రిలీఫ్‌’ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి భాగంలో ఉత్తరప్రదేశ్‌లో 63 దాడులు జరిగాయి. అంటే దేశంలో జరిగిన ప్రతీ ఐదు దాడుల్లో ఒకటి ఇక్కడే జరిగింది. గో గూండాల దాడులు, ముస్లింలపై దాడులు, శిశుహత్యలు వంటి విషయాలోనూ ఉత్తరప్రదేశ్‌ ముందున్న సంగతి తెలిసిందే. క్రైస్తవులపై దాడుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 28 దాడులు జరగ్గా, రెండు మరణాలకు దారితీసాయి. ఈ రాష్ట్రంలో ఒక చర్చిని కూడా అగ్నికి ఆహుతి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 22 దాడులు జరగ్గా, ఒక ఘటనలో ఓ వితంతువుపై అత్యాచారం, హత్య చేశారు. జార్ఘంఢ్‌ లోనూ 21 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక హత్య కూడా ఉంది. కర్ణాటకలో 20 దాడులు జరిగాయి. ఈఎఫ్‌ఐ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాదిలో 32 దాడులు జరిగాయి. కాగా, ‘పెర్‌సెక్యూషన్‌ రిలీఫ్‌’ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఈ దాడుల్లో 51 మంది మహిళలు, చిన్నారులపై జరిగాయి. వీటిలో ఐదు అత్యాచారాలు ఉన్నాయి. 37 కేసులు సామాజిక బహిష్కరణకు చెందినవి. దీని వలన అనేక క్రైస్తవ కుటుంబాలు నిరాశ్రయం చెందడమో లేక బలవంతంగా అడవుల్లోనో, తాత్కాలిక షెల్టర్ల లోనో తల దాచుకోవాల్సి వచ్చింది. వేధింపులు, బెదిరింపులకు చెందినవి 130 కేసులు కాగా, మిగిలిన 80 కేసులు భౌతిక దాడులకు చెందినవి. థామస్‌ వ్యాఖ్యల ప్రకారం ‘దాడుల విషయంలో గత ఏడేళ్ల నుంచి ‘ఓపెన్‌ డోర్స్‌’ అనే వరల్డ్‌ వాచ్‌ సంస్థ జాబితాలో భారత్‌ స్థానం 31 నుంచి 10 కి ఎగబాకింది. హింస తీవ్రతలో ఇరాన్‌కు సమీపంలో ఉన్నాం’.

శిక్షలు లేకపోవడమే కారణం
క్రైస్తవులపై దాడులు చేసిన వారికి తక్షణమే శిక్షలు పడాలని ఈఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. దాడులు చేసినవారికి శిక్షలు లేకపోవడం వలనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. దాడులకు కారణం బలవంతపు మత మార్పిళ్లనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాడులు జరిగిన ప్రతిసారీ ఇదే కారణం చెబుతున్నారని విమర్శించింది. ‘సరైన శిక్షలు లేకపోవడంతోనే వీధులు నిర్మానుష్మంగా ఉన్న లాక్‌డౌన్‌ సమయంలో కూడా దాడులు జరిగాయి. ప్రధాన రాష్ట్రాలతో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం లోనూ తీవ్రమైన దాడులు కొనసాగాయి’ అని ఈఎఫ్‌ఐ నివేదిక పేర్కొంది.

కేసుల నమోదు ఏదీ!
క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా. వీటిలో ఎక్కువ శాతం నమోదు కావడం లేదు. మీడియాలో వార్తలు వస్తున్నా, సదరు ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు ఇష్టపడ్డం లేదు. కోర్టులు వర్చువల్‌గా పనిచేయడం, ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతో న్యాయం పొందడానికి అనేక పరిమితులు ఏర్పడ్డాయి. ఈఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి విజయేష్‌ లాల్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుత రోజుల్లో ఇలాంటి దాడులను నియంత్రించడం చాలా కష్టం. పరిస్థితి క్షేత్రస్థాయి నుంచి తీవ్రంగా ఉంది. గతంలో బజరంగ్‌దళ్‌ సభ్యులు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు అనేక కొత్త సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి’ అని అన్నారు. ప్రస్తుత దాడుల్లో అభినవ్‌ భారత్‌, మోడీ సేన, అమర్‌ సేన, ధర్మసేన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దాదాపు ప్రతీ గ్రామంలో, ప్రతీ వీధిలో ఉన్న వీటి సభ్యులు మత మార్పిడుల గురించి మాట్లాడుతూ మైనార్టీ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ దాడులు క్రైస్తవుల ఇళ్లు, చర్చిలపై మాత్రమే కాకుండా ప్రైవేటు ప్రార్థనాస్థలాల వరకూ వ్యాపించాయని తెలిపారు. ఈ దాడుల్లోకెల్లా దారుణమై దాడిగా ఒడిషా సంఘటనను ప్రస్తావించారు. జూన్‌ 4న మాల్కాజిగిరి జిల్లాలో కెందుగుడ అనే గ్రామంలో 14 ఏళ్ల బాలుడ్ని బండరాయితో మోది చంపేశారు. తరువాత మృతదేహాన్ని ముక్కలు చేసి వేరువేరు ప్రదేశాల్లో ఖననం చేశారు. ఈ బాలుడి కుటుంబం మూడేళ్ల క్రితం క్రైస్తవ మతం స్వీకరించింది. అప్పటి నుంచే వీరిపై వేధింపులు ప్రారంభమమ్యాయి.

రాజకీయ చైతన్యం – కేసుల నమోదు
జార్ఘంఢ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో క్రైస్తవ వ్యతిరేక దాడుల కేసుల నమోదు సంఖ్య పెరగడానికి రాజకీయ చైతన్యం, మార్పు కారణమని ఈఎఫ్‌ఐ అభిప్రాయపడింది. కేసుల నమోదు ఎక్కువ కావడంతోనే ఈ విషయంలో గతంలో నేరాల జాబితాలో ఆరవ స్థానంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఈ ఏడాది మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాజకీయ మార్పుతో ఇక్కడి మైనార్టీలు గొప్ప ఆత్మస్థైర్యంతో కేసుల నమోదుకు ముందుకు వస్తున్నారని తెలిపింది. ఈ రాష్ట్రంలో బస్తర్‌ వంటి ప్రాంతాల్లో క్రైస్తవులు మతపరమైన ఆచారాల్లో పాల్గొనడానికి నిరాకరించడంతో వారిపై దాడులు తీవ్రమయ్యాయి. మత ఆచారాల్లో పాల్గొనకపోవడంతో క్రైస్తవులు మరణించిన తరువాత సమాధి చేయడానికీ కూడా నిరాకరించబడుతున్నారు.

సమీప రాష్ట్రమైన జార్ఘంఢ్‌లో పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ దాడుల్లో ఎవ్వరూ మృతి చెందకపోయినా, వేధింపులు, సామాజిక బహిష్కరణలు తీవ్రంగా ఉన్నాయి. పుండిగుట్టు గ్రామంలో క్రైస్తవులను ప్రభుత్వ రేషన్‌ కూడా తీసుకోకుండా నిషేధించారు. కొన్ని గ్రామాల్లో పూర్వ మతంలోకి తిరిగిరాకపోతే బావి నుంచి నీళ్ళు తీసుకోకుండా చేయడం, ఇతర శిక్షలు విధిస్తున్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయని రెండు సంస్థలు తెలిపాయి. గతంలో చర్చిలపై తరుచూ దాడులు జరిగితే, ఇప్పుడు ప్రైవేటు ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనల సమయంలో ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి. ముందుగా దాడులు జరుగుతాయి. తరువాత సామాజిక బహిష్కరణలు ప్రారంభమవుతాయి. అయితే ఈ దాడులను స్థానిక ప్రజలే చేయడం విశేషం. దాడులు చేసేవారంతా ఎక్కువగా ఓబిసి వర్గానికి చెందినవారు ఉంటారు. వీరంతా బజరంగ్‌దళ్‌, మోడీసేన వంటి సంస్థల భావజాలానికి గురై ఈ దాడులకు పాల్పడుతుంటారని ఈ సంస్థలు చెబుతున్నాయి.

ఉద్యమకారుడు, జర్నలిస్టు జాన్‌ దయాళ్‌ ప్రభుత్వం దుండగుల పక్షాన ఉందని విమర్శించారు. ఏ రాష్ట్రంలో దాడి జరిగినా అక్కడ అధికార పార్టీ దుండగులకు రక్షణగా ఉంటుందని అన్నారు. బిజెపీ యేతర పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ పార్టీలు దూకుడుగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని, అక్కడ కూడా ఈ సంస్థలు చట్టాన్ని ధిక్కరించినట్లు కనిపిస్తాయని ఆయన తెలిపారు. అలాగే కేంద్రంలో అధికార పార్టీ తన వాక్చాతుర్యాన్ని, సార్వభౌమాధికార వాదనను ఉపయోగించి ఐరాస తో సహా ఇతర అంతర్జాతీయ సంఘాల తనిఖీ, ఉపదేశాల నుంచి తప్పించుకుంటోందని అన్నారు.

ఈఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి.