-అన్ని ఉత్పత్తులూ నిలిపివేత
– పెరుగుతున్న ధరలు
– ముంబయి తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలంటున్న పారిశ్రామికవేత్తలు

అత్యవసర ఉత్పత్తులపైనా ప్రభుత్వం కరోనా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల మెడికల్‌ షాపులు కూడా మూయిస్తున్నారు. మెడికల్‌ షాపు తెరవడానికి వెళ్తున్న యజమానులపైనా పోలీసు లాఠీలు నాట్యం చేస్తున్నాయి. దీంతో అపోలో, మెడిసిటీ వంటి కార్పొరేట్‌ మందుల దుకాణాలు మాత్రమే తమ ఉద్యోగులను రెండు రోజులకోసారి మారేలా షిఫ్టులు వారీగా పనిచేయిస్తున్నాయి. పాలు, కూరగాయలు వంటి వాటికి కూడా సమయాల్ని నిర్ణయించారు. కానీ అత్యవసరమైన ఫార్మా కంపెనీలు, దాన్ని అనుబంధ పరిశ్రమల్ని కూడా మూసివేశారు. దీనివల్ల ప్రజలకు అవసరమైన మందుల ఉత్పత్తి లేకపోవడంతో వారు అనేక అవస్థలు పడుతున్నారు. మెడికల్‌ షాపుల్లో ఉన్న మందుల్ని అమ్ముకోవడం మినహా, కొత్తగా ఎలాంటి మందుల్ని తెప్పించలేకపోతున్నారు. అలాగే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు, బియ్యం వంటి నిత్యవసర వస్తువుల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీనివల్ల మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరుగుతు న్నాయి.

ఈ పరిస్థితుల్ని ముందే అంచనా వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి ఫార్మా కంపెనీలు, నిత్యవసర వస్తూత్పత్తి పరిశ్రమలు, రవాణాకు షరతులతో కూడిన అనుమతుల్ని ఇస్తున్నది. అయితే రోజువారీ పరిమితంగా ఉత్పత్తి, పరిమిత సంఖ్యలో షిఫ్టుల వారీగా సిబ్బందికి అనుమతులు ఇస్తున్నారు. దానికోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మెయిల్‌ ఐడీని ప్రకటించింది. పరిశ్రమ వివరాలతో పాటు, అత్యవసర సర్వీసు క్రిందకు వస్తుందా…రాదా..అనే వివరణ ఇస్తూ, సంబంధిత ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సర్టిఫికెట్‌ స్కాన్‌ కాపీని కూడా జతపరచాలి. అవసరమైన సిబ్బంది వివరాల్ని కూడా దానిలో పొందుపర్చాలి. అన్ని వివరాలు పరిశీలించాక, మెయిల్‌ ద్వారానే అనుమతుల్ని కూడా ఇస్తున్నారు. ఆయా కంపెనీల్లో పనిచేసే సిబ్బందికి ముంబయి పోలీసులు ప్రత్యేకంగా కర్ఫ్యూ పాసుల్ని ఇస్తున్నారు. ఇలాంటి విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. దీనివల్ల కనీసం స్వరాష్ట్ర అవసరాల కోసమై నా ఉత్పత్తి ఉపయోగపడుతుందని ఫార్మా, దాని అనుబంధ పరిశ్రమల పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతు న్నారు. మన రాష్ట్రంలో పోలీసుశాఖ కేవలం నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడం కోసం వ్యక్తిగత పాసుల్ని మాత్రమే ఇస్తున్నది.

మహారాష్ట్ర విధానం భేష్‌
అత్యవసర సర్వీసులు, ఉత్పత్తుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వ విధానం బాగుంది. దాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలి. పరిశ్రమల్లో కార్మికులు ఒకేచోట గుమికూడకుండా అవసరమైతే సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా తెలుసుకోవచ్చు. కార్మికుల అనుమతి కూడా పరిమితంగానే ఉంటుంది కాబట్టి ఆ సమస్య కూడా రాదు. పోలీసులు పర్యవేక్షించొచ్చు. ఆంక్షల మధ్య ఉత్పత్తిని కొనసాగించవచ్చు.
– రమాకాంత్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ)

పప్పుధాన్యాలు నిండుకుంటున్నాయి
చక్కెర, పప్పుధాన్యాలు వంటి నిత్యవసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో చక్కెర రూ.38 ఉంది. ఇప్పుడు రూ.50కి పెరిగింది. రూ.80 వరకు పెరుగుతుందని చిల్లర వ్యాపారులు చెప్తున్నారు. అలాగే కందిపప్పు సహా అన్నింటి నిల్వలు తరుగుతున్నాయి. ఆయా మిల్లులకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలి.
– అనిల్‌రెడ్డి, ఎఫ్‌టీసీపీఐ మాజీ అధ్యక్షులు

Courtesy Nava Telangana