•  కరోనా విజృంభణ వల్లే!
  • అప్పటి వరకు కోడ్‌ అమల్లోనే.. ప్రలోభపెట్టే పథకాలపై నిషేధం
  • ప్రభుత్వ దైనందిన విధులకు ఇబ్బంది ఉండదు
  • ఇది వాయిదానే.. రద్దు కాదు.. ఆరు వారాల తర్వాత సమీక్షిస్తాం
  • అనంతరం ప్రక్రియ కొనసాగింపు.. జాతీయ విపత్తుగా కరోనా
  • కేంద్రం ప్రకటించింది.. ప్రజల భద్రతను పణంగా పెట్టలేం
  • ఏకగ్రీవంగా ఎన్నికైనవారు ఎన్నికైనట్లే.. పంచాయతీలకు
  • కొత్త షెడ్యూల్‌.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం

అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదివారమిక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశాం. నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఈనెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 23న మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్‌ ఈ రోజునే విడుదల చేయాల్సి ఉన్నా.. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, విజ్ఞుల సూచనలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. కరోనా గురించి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలతో సంప్రదించినప్పుడు కరోనా ప్రస్తావన వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఆ తర్వాత పునఃసమీక్షించుకుంటామని అప్పుడు చెప్పాం’ అని గుర్తుచేశారు.

వేగంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకోవాల్సి వచ్చిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ను, కర్ణాటకలోనూ స్కూళ్లు, సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాలను నియంత్రించారని.. కేంద్ర ప్రభుత్వం ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైర్‌సపై హెచ్చరిక చేసిందని తెలిపారు. ‘ఇప్పుడు కేంద్రం కరోనా వైర్‌సను జాతీయ విపత్తుగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ వినియోగిస్తున్నందున కరోనా వ్యాప్తి చెందేందుకు అవకాశముంటుంది. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా, ప్రజాభద్రతను పణంగా పెట్టకూడదనే వాదనతో ఎన్నికల సంఘం ఏకీభవిస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగానో, పాక్షికంగానో పూర్తయ్యాయి. అనేక వ్యయ ప్రయాసలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు చేశాం’ అని చెప్పారు. కిషన్‌సింగ్‌ తోమర్‌ వర్సెస్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మేరకు అనివార్య కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవచ్చన్న విషయాన్ని ఉటంకించారు. విపత్తులు, తుఫాన్లు, భూకంపాలు, గొడవలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలు సంభవించినప్పుడు ఎన్నికలు వాయిదా వేయవచ్చని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 కే, 243 జెడ్‌(ఏ) ప్రకారం పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా సంక్రమించిన విస్తృత, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ రద్దు కాదు..
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దుకాదని, ఇది వాయిదా మాత్రమేనని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు.. మిగతావారు ఎన్నికైన తర్వాత వారితోపాటు బాధ్యతలు చేపడతారని వివరణ ఇచ్చారు. ఆరు వారాల అనంతరం సమీక్ష తర్వాత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేష్లను అవసరమైన మేరకు సవరణలు చేస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు 6వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఓటర్లను పలోభపెట్టే వ్యక్తిగత పథకాలకు నిషేధం వరిస్తుందని తేల్చిచెప్పారు. అయితే ప్రభుత్వ దైనందిన కార్యక్రమాలకు ఈ  నిషేధం వర్తించదన్నారు. కావలసిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత కూడా ఇస్తుందని చెప్పారు.

Courtesy Andhrajyothi