– యూపీలో చిన్నారుల మిడ్‌ డే మీల్‌లో విస్తుగొలిపే దారుణం
లక్నో : చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంలోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానమని కేంద్ర సర్కారే ఇటీవల ప్రకటించింది కూడా. మీర్జాపూర్‌ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో చపాతీతోపాటు పిల్లలకు ఉప్పు వేసి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన ఉత్తరప్రదేశ్‌లోనే.. తాజాగా విస్తుగొలిపే మరో దారుణం బయటపడింది. సోన్‌భద్ర జిల్లా కోటా గ్రామంలోని గిరిజన ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాల మధ్యాహ్నం భోజనం కింద ఒక లీటరు పాలను.. ఒక బక్కెట్‌ నీళ్లలో కలిపి.. వాటిని 81 మంది పిల్లలకు తాగేందుకు ఇస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయంపై ఆరా తీయగా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా పాల పంపిణీ జరగటంలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే నీటిని కలపాల్సి వచ్చిందన్నారు. నిజానికి ఈ పాఠశాలలో చదువుతున్నది 171 మంది పిల్లలు. నవంబరు 27న పాఠశాలకు హాజరైంది 81 మందే.
మిగిలిన పిల్లలు కూడా పాఠశాలకు వచ్చివుంటే… ఆ లీటరుపాలను.. ఒక బక్కెట్‌ కాదు.. రెండు బక్కెట్ల నీళ్లలో కలపాల్సి వచ్చేదని పాఠశాల అధికారులు చెప్పటం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు వచ్చినట్టు ఆ ప్రాంతంలోని బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి అంగీకరించారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు.

Courtesy NavaTelangana..