శ్రీకర్‌

అసలే భయంతో చస్తున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు చదివి ఇంకా భయం పెంచు కోవటం అవసరమా అనిపించవచ్చు. కానీ మహమ్మారులు విలయ నృత్యం చేస్తున్న తరుణంలో వైద్యం మన శరీరాల్ని కాపాడే   ప్రయత్నం చేస్తే, ఇలాంటి సాహిత్యం మన మనసులకు దన్నుగా నిలుస్తుంది. గందరగోళంలో కొంత అర్థాన్నిస్తుంది. విపత్తులప్పుడు బైటపడే మానవ స్వభావాల్ని గురించి అవగాహన కలిగిస్తుంది. కొద్దోగొప్పో సన్నద్ధం చేస్తుంది. 

మానవ మనుగడపైనే యుద్ధం ప్రకటించిన మహమ్మారుల్లో కరోనా మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. కరోనా అంత విస్తృతి లేక పోయినా, కరోనాకంటే తీవ్రతతో విరుచుకుపడిన ‘పాండెమిక్స్‌’ చరిత్రలో ఉన్నాయి. 1347-1351 మధ్య ఏడుకోట్ల మందిని తుడిచిపెట్టేసిన ‘బ్లాక్‌ డెత్‌’ అని పిలిచే ప్లేగు నుంచి, వందేళ్ళ క్రితం 1918-1920 మధ్యలో రెండు కోట్లమందికి పైగా ప్రజ లని హతమార్చిన స్పానిష్‌ఫ్లూ వరకు మహమ్మారులు ఎన్నో! ప్రతి మహమ్మారీ వైద్యశాస్త్రానికి కొత్త సవాలు విసురుతూనే ఉంటుంది. వైద్యశాస్త్రం దాన్ని అణచేశాక, ఎప్పటికో మరో మహమ్మారి అంతకుమించిన మరో సవాలుతో మళ్ళీ ఎదుర వుతుంది. భూమ్మీద మనిషి ఆధిపత్యానికి అతిపెద్ద పోటీ ఈ కంటికి ఆనని బాక్టీరియాలూ వైరస్‌లే! వీటిపై ఎంతో సాహిత్యం వచ్చింది. అసలే భయంతో చస్తున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు చదివి ఇంకా భయం పెంచుకోవటం అవసరమా అనిపించవచ్చు. కానీ మహమ్మారులు విలయ నృత్యం చేస్తున్నప్పుడు వైద్యం మన శరీరాల్ని కాపాడే ప్రయత్నం చేస్తే, ఇలాంటి సాహిత్యం మన మనసులకు దన్నుగా నిలుస్తుంది. గందరగోళంలో కొంత అర్థాన్నిస్తుంది. విపత్తు లప్పుడే బైటపడే మానవ స్వభావాల్ని గురించి అవగాహన కలిగిస్తుంది. కొద్దోగొప్పో సన్నద్ధం చేస్తుంది. ధైర్యం మప్పుతుంది.

తెలుగు సాహిత్యంలో ఈ మహమ్మారులపై పెద్దగా రచనలు ఏమీ రాలేదు. బహుశా మన తెలుగు సాహిత్యంలో ఆధునిక దశ మొదలయ్యాక మన ప్రజల్ని ఇంతగా భయ పెట్టిన మహమ్మారి ఏదీలేకపోవటం ఒక కారణం కావచ్చు (ఎయిడ్స్‌ను మినహాయిస్తే). ప్రపంచ సాహిత్యంలో మాత్రం కాల్పనిక, కాల్పనికేతర రచనలు చాలా వచ్చాయి.

ద రోడ్‌ (2006), కోర్మెక్‌ మెకార్తీ:
(The Road, Cormac McCarthy) విపత్తుల్లో మన పరిధి మరీ చిన్నదైపోతుంది. అందులోంచి అందరూపోయి అమ్మా, నాన్నా, కొడుకూ, కూతురూ… ఇలా అత్యంత ఆప్తులే ఏ కొద్ది మందో మిగులుతారు. వీళ్ళే పూర్తి జీవితానికి అర్థంగా చివరికి తేలతారు. ఈ నవల మొదలయ్యే సరికే- రచ యిత మనకు చెప్పని ఏదో విపత్తు భూమి మీద చాలా వాటిని నాశనం చేస్తుంది. జీవరాశి ఉండదు. సము ద్రాలు నల్లబడతాయి. కొంతమంది మనుషులు మాత్రం మిగులుతారు.   కానీ తిండికి కరువు. కథానాయకుడు తన కొడుకుతో కలిసి చల్లటి ఉత్తర ప్రాంతం నుంచి వెచ్చటి దక్షిణ ప్రాంతానికి వెళ్తూంటాడు. దారిలో నరమాంస భక్షకులుగా మారిన మనుషుల్ని తప్పించుకుంటూ, తిండికి వెతుక్కుంటూ, ఇద్దరూ కాలినడకన ప్రయాణిస్తారు. దీన్ని తండ్రీకొడుకుల ప్రేమకథగా చెప్పుకోవచ్చు. రచయిత ఒక ఇంటర్వ్యూలో ఇది తన కొడుకు కోసమే రాశానన్నాడు. పుస్తకం కూడా కొడుకుకే అంకితమి చ్చాడు. ఏమీ మిగిలిలేని చోట కూడా మనుషుల మధ్య మిగిలే అనుబంధం గురించి చెప్పే ఈ నవల మన ప్రాధా న్యతల్ని గుర్తుచేస్తుంది. దీన్ని 2009లో సినిమాగా తీశారు.

బ్లైండ్‌నెస్‌ (1995), జోసె సరమాగొ:
(Blindness, Jose Saramago) అది ఒక పేరులేని దేశం, వాళ్ళంతా పేరులేని మనుషులు. ఒకరోజు ఒకచోట ట్రాఫిక్‌లో సిగ్నల్‌ మారుతుంది. కార్లన్నీ కదులుతాయి గానీ ఒక కారు కదలదు. దాంతో వెనక ట్రాఫిక్‌ ఆగిపోతుంది. కొందరు కార్లు దిగి ఆ ఆగిన కారువైపు ఏమైందో చూద్దామని వెళ్తారు. లోపల ఒక మనిషి అయోమయంగా ఏదో అంటుంటాడు. డోర్‌ తెరిచాక అతనంటున్న మాటలు వినపడ తాయి: ‘‘నాకు కళ్ళు కనిపించటం లేదు’’ అని. ఎవరో అతడిని ఇంటిదగ్గర దిగబెడతారు. భార్య డాక్టరు దగ్గరకు తీసుకెళ్తుంది. డాక్టరు జబ్బేంటో అర్థం కాక ఏవో మందులిచ్చి పంపేస్తాడు. తర్వాత ఆ ఇంటిదగ్గర దిగబెట్టినతను, ఆ భార్య, ఆ డాక్టరు కూడా గుడ్డివాళ్ళయి పోతారు. ఇలా గుడ్డితనం ఒక మహమ్మారిలా ఒకరినుంచి ఒకరికి పాకుతూ అందరికీ వ్యాపిస్తుంది. ఈ గుడ్డితనంలో వాళ్ళకు కనపడేది చీకటి కాదు, తెల్లటి తెలుపు. ఇలాంటి విపత్తులో చిక్కిన ఈ మనుషుల్లోంచి రచయిత మనకు చూపించేది మాత్రం.. నల్లటి నలుపు. వాళ్ళలోని పెనుచీకటి కోణాలు. నవల చివర్లో, ఈ శ్వేతాంధత్వమనే మహమ్మారి ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానే పోతుంది. కానీ పోయేలోగా మనిషిలోని చీకటి కోణాలన్నింటినీ బైటపెట్టి పోతుంది. మనం కట్టుకున్న సామాజిక వ్యవస్థలు ఎంత సున్నితమైనవే తేల్చిచెప్పి మరీపోతుంది.

ద ప్లేగ్‌ (1947), ఆల్బెర్ట్‌ కామూ:
(The Plague, Albert Camus) ఇది ప్లేగు గురించిన నవల అనేకంటే కూడా, అలాంటి మహమ్మారిపై మనిషి స్పంద నను గురించిన నవల అనుకో వచ్చు. అవి ఎలాంటి స్పందన లైనా, ఎన్ని రకాల స్పందన లైనా రచయిత మాత్రం చివరికి మనిషి పక్షాన్నే నిలబడతాడు. ఒరాన్‌ అనే నగరంలో ప్లేగు వ్యాధి మొదలవటం, పెరగటం, చివరకు అదుపులోకి రావటం ఈ నేపథ్యంలో నవల సాగుతుంది. బెర్నార్డ్‌ రియూ అనే డాక్టర్‌ ఇందులో ప్రధాన పాత్ర. ఇప్పటి మన పరిస్థితికి అద్దం పట్టేలా, ఈ నవలలో కూడా లాక్‌డౌన్లూ, కర్ఫ్యూలూ, క్వారంటైన్‌లూ, క్వారంటైన్‌ నుంచి పారిపోజూసేవాళ్ళూ, ఈ పరిస్థితిని అవకాశానికి వాడుకోజూసేవాళ్ళూ, కొత్తబలం పుంజుకునే మతప్రచారకులూ, ప్రాణాలకు తెగించి పని చేసే వైద్యులూ… అందరూ ఉంటారు. ఈ భయంమధ్య కొందరు తోటి మనుషులకు అండగా నిలబడతారు, కొందరు తోటి మనుషుల్ని దోచుకుంటారు కూడా. అయితే చివర్లో మాత్రం నవల ఆశావాదంతో ముగుస్తుంది: ‘‘రియో ఈ సంఘటన లన్నిటినీ గుర్తుగా రాసిపెట్టాలనుకున్నాడు… తద్వారా ప్లేగు బారినపడ్డ తన ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలూ, దారు ణాలు గుర్తుండేలా చేయాలనుకున్నాడు. ఇలాంటి మహ మ్మారులు వచ్చిపడ్డప్పుడు మనిషి గురించి వెల్లడయ్యే సత్యమేమిటో తేల్చిచెప్పాలనుకున్నాడు: మనుషుల్లో ద్వేషిం చాల్సినవాటికంటే, ప్రేమించాల్సినవే ఎక్కువుంటాయన్నదే ఆ సత్యం.’’ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో మానవ స్వభావానికి అంజలి ఘటించిన నవలగా దీని గురించి చెప్పుకోవచ్చు. నీతివంతమైన నడత, సౌభ్రాతృత్వం… విపత్కర సమయాల్లో ఎంత అవసరమో ఈ నవల చెప్తుంది.

ఎ జర్నల్‌ ఆఫ్‌ ప్లేగ్‌ యియర్‌ (1722), డానియెల్‌ డెఫో:
(A Journal of the Plague Year, Daniel Defoe) ఆల్బెర్ట్‌ కామూ తన ‘ప్లేగ్‌’ నవలకు ఈ రచన నుంచి కొంత ప్రేరణ పొందాడంటారు. ఈ రచనను కాల్పనికమ నాలా, లేక చారిత్రకమనాలా అని చాన్నాళ్ళు వాదోపవాదాలు నడిచాయి. ఎందుకంటే, ఇందులో డానియెల్‌ డెఫో 1665లో ప్రబలిన ప్లేగు వ్యాధి గురించి తన కళ్ళతో చూస్తున్నట్టు రాశాడు, కానీ ఆ ప్లేగు వచ్చినప్పటికి డెఫోకు అయిదేళ్ళే. ఆ ప్లేగు కాలంలో తన మావయ్య ఒకరు రాసు కున్న నోట్సు ఆధారంగా ఆయన ఈ రచన చేశాడు. ఈ ప్లేగుని ‘గ్రేట్‌ ప్లేగ్‌ ఆఫ్‌ లండన్‌’ అని పిలుస్తారు. ఈ ఒక్క నగరం లోనే దాదాపు 70 వేల మంది చనిపోయారు. ఇలాంటి విపత్కర సమయాల్లో దేవుడి పాత్ర ఎలా మారేదీ, మోసగాళ్ళు ఎలా పెట్రేగిపోయేదీ, అసలు మనుషుల్ని ఇళ్ళల్లో బంధించటం మంచిదా కాదా అన్నదీ… ఇలాంటి అంశాలన్నిటిమీదా తన పరిశీలనలు రాస్తాడు డెఫో. రచనను ముగిస్తూ- కష్ట కాలంలో దేవుని కీర్తనలు తెగపాడిన ప్రజలు ఆ తర్వాత మటుకు దేవుడి సంగతే మర్చిపోయారంటాడు. మళ్ళీ పాత అలవాట్లలోకి మళ్ళిపోయారంటాడు.

(The Decameron, Giovanni Boccaccio) ఇది మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన మహమ్మారిగా పేర్కొనే ‘బ్లాక్‌ డెత్‌’ కాలంలో, ఆ మహమ్మారి ముగిసిన రెండు మూడేళ్ళకే రాసిన  రచనే ఐనా, ఇందులో ప్లేగు గురించి పెద్దగా ఏమీ ఉండదు. ‘బ్లాక్‌ డెత్‌’ చుట్టుముట్టినప్పుడు ఒక ఏడు గురు యువతులు, ముగ్గురు యువకులూ మాత్రం దాన్నుంచి తమను తాము కాపాడుకోవటానికి ఒక పెద్ద భవంతిలోకి చేరతారు. అక్కడ కాలక్షేపానికి చెప్పుకునే కథలతో కూర్చిన సంకలనమే ఈ డికామెరన్‌. డికామెరన్‌ అంటే పదిరోజులు జరిగే వేడుక అని. పదిమంది పదేసి కథల చొప్పున మొత్తం వంద కథలు చెప్పుకుంటారు. ఒకరకంగా ఇప్పుడు కరోనా సమయంలో మనమంతా ఇళ్ళల్లో బంధీలమై టీవీల మీద, టిక్‌టాక్‌లమీద పడ్డట్టే అనుకోవచ్చు. ఆపత్సమయాల్లో మను షులు కథలవైపు మొగ్గుచూపడం ఎంత సహజమో, ఆ సమ యాల్లో కథలు ఎంత అవసరమో ఈ పుస్తకం చెబుతుంది.

మహమ్మారులు, వాటి గురించిన సాహిత్యం మనకు కలిగించే ముఖ్యమైన స్పృహ ఏమిటంటే:- ఈ ప్రపంచానికి మనం అతిథుల్లాగ వచ్చామూ అని, ఈ ప్రపంచమేమీ మన సొత్తు కాదని, ఇక్కడ మనుషుల్ని కూడా డైనోసార్లలాగ ఒక శిలాజగతంగా మార్చేయటానికి యుగాంతాలూ ప్రళయాలూ గ్రహ శకలాల్లాంటివేమీ అవసరంలేదూ కంటికి ఆనని చిన్న ప్రాణి చాలూ అని. ఈ స్పృహ మనం నిలుపుకుంటే, మన పరిమితి తెలుసుకుంటే, మరికొన్నాళ్ళు మనగలుగుతాం.

Courtesy Andhrajyothi