* నూతన విధానం అమలైన మొదటి రోజే పలుచోట్ల ఆందోళనలు
* సెల్‌ టవరెక్కి యువకుల నిరసన 

మద్యాన్ని నియంత్రిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం జనావాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల మహిళలు, ప్రజలు మంగళవారం ఆందోళనలు చేపట్టారు. నూతన విధానం అమలైన మొదటి రోజే ఎక్కడికక్కడ షాపులను తెరవనీయకుండా అడ్డుకున్నారు. మహిళలు, యువకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకో, వంటా-వార్పు చేశారు. పశ్చిమలో యువకులు సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో, కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మద్యం షాపులను ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో జెడ్‌పి హైస్కూల్‌కు సమీపంలో సింగరాజుపాలెం ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ ఆ గ్రామస్తులు వంటావార్పు నిర్వహించారు. తొలుత చేబ్రోలు పోలీసులు, ఎక్సైజ్‌ సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌ గ్రామస్తులతో సాగించిన సంప్రదింపులు ఫలించలేదు. తాడేపల్లిగూడెం ఎక్సైజ్‌ ఎస్‌ఐ సుదర్శిని స్పందించి ఈ నెల 3న సరుకు వేరే ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇవ్వడంతో జనం ఆందోళన విరమించారు. ఎండవేడిమికి తాళలేక గృహిణి భలే నాగలక్ష్మి స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆటోలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పెనుమంట్ర మండలం ఆలమూరులోని కొయ్యేటిపాడు రోడ్డులో మద్యం దుకాణం వద్దంటూ అక్కడి మహిళలు ఐద్వా ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. దుకాణాన్ని త్వరలోనే మరోచోటకు మారుస్తామని, ఈలోపు మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో,మహిళలు ఆందోళన విరమించారు. ఆచంటలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించాలంటూ కెవిపిఎస్‌ జిల్లా నాయకులు ఉన్నమట్ల దుర్గాప్రసాద్‌, జనసేన నాయకులు మోకా సుధీర్‌బాబు, చైతన్య యువజన సంఘం నాయకులు పుల్లుల విజయబాబు, వడ్లపాటి రమేష్‌ టవర్‌ ఎక్కారు. పెనుగొండ మండలం చినమల్లం పంచాయతీ పరిధిలో మదనవారిపాలెం రోడ్డులో మద్యం దుకాణం వద్దంటూ మహిళలు అడ్డుకున్నారు.
నరసాపురం పట్టణంలోని లాకుపేట ఒకటో వార్డులో ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ ఐద్వా ఆధ్వర్యాన మహిళలు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు ఐదోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం మారేడుబాకలో మద్యం దుకాణం ఏర్పాటును నిలిపివేయాలంటూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. మండపేటలోని సత్యశ్రీరోడ్డులో మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు ధర్నా చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి సీనియర్‌ నాయకులు జ్యోతుల నెహ్రూ, ఎపి రైతుకూలీ సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మద్దతు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో ప్రధాన రహదారి కూడలిలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
15 రోజుల తర్వాత గ్రామం వెలుపల దుకాణం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం చాపురం పంచాయతీ సాయిలక్ష్మీనగర్‌ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. దుకాణం ఎదుట బైఠాయించిన విషయాన్ని తెలుసుకున్న ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కె.బలరామకృష్ణ ప్రస్తుతానికి దుకాణాన్ని ప్రారంభించడం లేదని చెప్పడంతో స్థానికులు వెనుదిరిగారు.
విశాఖ జిల్లా చోడవరం మండల కేంద్రం బోళ్ల వీధిలో పురాతన రామాలయం పక్కన, కశింకోట మండలం ఉగ్గినపాలెంలో నివాసాల మధ్యలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో మద్యం షాపు ఏర్పాటును జనసేన నాయకుల ఆధ్వర్యాన అడ్డగించారు.
విజయవాడలో సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యాన సీతారామపురం, కానూరు, పోరంకి ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. సీతారామపురంలో చేపట్టిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీదేవి, కె.సరోజ పాల్గొని మద్దతు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో జనావాసాల మధ్య మద్యం షాపును తొలగించాలంటూ స్థానిక పేరాల శృంగారపేటకు చెందిన మహిళలు, యువకులు ఆందోళనకు దిగారు. అనంతరం ఎక్సైజ్‌ అధికారులు మద్యం షాపును తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు..

Courtesy prajasakthi..