మద్యం తయారీకి రేషన్‌ బియ్యం.. నెలకు 7 వేల టన్నులు పక్కదారి
ఉమ్మడి పాలమూరులో కోట్లలో దందా.. వనపర్తి కేంద్రంగా రేషన్‌ మాఫియా
ఓ రైస్‌మిల్లరే రేషన్‌ డాన్‌.. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అండ
లిక్కర్‌ కంపెనీలు, పౌలీ్ట్రలకు తరలింపు.. జగిత్యాల నుంచి రోజుకు 10 లారీలు
మహారాష్ట్రకు తరలుతున్నా చర్యల్లేవ్‌.. భూపాలపల్లిలోనూ ఇదే తంతు
కిలో 10కి కొనుగోలు.. 30కి విక్రయం.. పక్కదారిపడుతున్న పేదల బియ్యం

మహబూబ్‌నగర్‌/వనపర్తి/జగిత్యాల/భూపాలపల్లి: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు బొక్కేస్తున్నారు. రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ దందాను ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. చౌక బియ్యం బస్తాలు పౌలీ్ట్రలకు, బీరు కంపెనీలకు, సరిహద్దు రాష్ట్రాల్లోని మిల్లర్లకు చేరుతున్నాయి. ప్రధానంగా చౌక బియ్యాన్ని బీరు తయారీకి ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, జగిత్యాల జిల్లాల్లో రేషన్‌ బియ్యం మాఫియా గుప్పిట్లో చిక్కుకున్నాయి. నెలనెలా సరఫరా అయ్యే బియ్యంలో దాదాపు సగాన్ని ఈ మాఫియా మింగేస్తోంది. రేషన్‌ డీలర్లు, నల్లబజారు వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు, అధికారులతో కూడిన ఈ మాఫియా.. ముఖ్యనేతలు, ప్రధాన అధికారుల అండతో కార్యకలాపాలను యఽథేచ్ఛగా కొనసాగిస్తోంది. ఓ సాధారణ రైస్‌మిల్లు ఓనర్‌ వనపర్తి జిల్లాకేంద్రంగా కొనసాగుతున్న రేషన్‌ మాఫియాకు నాయకుడిగా వ్యవహరిస్తుండగా.. ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధుల సహకారం ఆయనకు మెండుగా ఉంది.

ఇటీవల దాదాపు మూడు ట్రక్కుల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరగనుందని అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం వెనుక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వనపర్తి పోలీసులకు ఫిర్యాదుల తాకిడి పెరగడంతో ఒక లారీ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే అవి రేషన్‌ బియ్యం అవునో కాదో తెలియదని పౌరసరఫరాల అధికారులు చెప్పడం గమనార్హం. ఇలా చాలా సందర్భాల్లో పోలీసులు రేషన్‌ బియ్యాన్ని పట్టుకుంటున్నా పంచనామా చేయడంలో పౌరసరఫరాల శాఖ ఆలస్యం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో, మండలాల్లో చాలామంది రేషన్‌ దుకాణాల నిర్వాహకులు లబ్ధిదారుల వేలిముద్రలు(తంబ్‌) వేయించుకొని, బియ్యాన్ని అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కిలోకు రూ.8-12 వరకు చెల్లిస్తున్నారు. వాటిని మిల్లులకు రూ.18-20 వరకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ప్రతినెలా 18,786 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం వస్తుండగా, ఇందులో 4,500 మెట్రిక్‌ టన్నులు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కోటాకు, 2,500 మెట్రిక్‌ టన్నులు బీరు తయారీ కంపెనీలకు.. మొత్తంగా 7 వేల మెట్రిక్‌ టన్నుల మేర పక్కదారి పడుతున్నాయి.

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, నారాయణపేట, మద్దూరు, మరికల్‌, వనపర్తి, పెబ్బేరు, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, గద్వాల, అయిజ, అలంపూర్‌ కేంద్రాలుగా విస్తరించిన ఈ మాఫియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్‌ బియ్యాన్ని డీలర్లు, లబ్ధిదారుల నుంచి సేకరిస్తోంది. చాలా గ్రామాల నుంచి ఇప్పటికీ పేదలు ముంబై, పుణే, హైదరాబాద్‌ వంటి నగరాలకు వలస వెళ్లడం, వారికి ఇక్కడే రేషన్‌ కార్డులుండడంతో అవి రద్దవకుండా వీఆర్వోలు నెలవారీగా కోటా బియ్యాన్ని వేలిముద్రలు వేసి తీసుకుంటున్నారు. మరోవైపు గ్రామాల్లోనే ఉన్న పేదలకు కిలో బియ్యానికి రూ.10 చెల్లిస్తుండటంతో వారు బియ్యాన్ని వదిలేసిపోతున్నారు.

నేతలు, ఉన్నతాధికారుల అండ..
వనపర్తి జిల్లాలోని ఓ మండలానికి చెందిన రేషన్‌ డాన్‌కు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం ఉండడంతో రాష్ట్రస్థాయిలో దందా నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్రాలకు రేషన్‌ బియ్యాన్ని రవాణా చేసే స్థాయికి ఎదిగాడు. గతంలో అతనికి సంబంధించిన మిల్లుల్లో, వాహనాల్లో వందలాది క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టుబడ్డాయి. మిల్లులు కూడా సీజ్‌ అయ్యాయి. అయినా ఓ మిల్లును అద్దెకు తీసుకొని అక్కడి నుంచి దందా నిర్వహిస్తున్నాడు. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం రేషన్‌ డాన్‌కు దాదాపు ఏడు మండలాల్లో బియ్యం లోడింగ్‌ పాయింట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్‌ పేరిట అనుమతులు పొందడం, రీసైక్లింగ్‌ చేసిన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించడం అతనికి పరిపాటిగా మారింది.

గతంలో అతని అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిపై కూడా రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఒత్తిళ్లు తీసుకురావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గడిచిన 3 నెలల్లో ఒక్క వనపర్తి జిల్లాలోనే 1520 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం, అందులో 1200 క్వింటాళ్ల వరకు ఈ డాన్‌కు సంబంధించిన బియ్యమే కావడం విశేషం. తాజాగా పట్టుకున్న ఒక లారీ కూడా అతనికి సంబంధించిందే కాగా.. మూడు లారీలు పెబ్బేరు మండలం నుంచి బయలుదేరగా ఒక లారీనే వనపర్తి పోలీసులు పట్టుకున్నారు.

జగిత్యాలలో ఇలా..
జగిత్యాల జిల్లా నుంచి మహారాష్ట్రకు రేషన్‌ బియ్యం తరలింపు దందా మళ్లీ మొదలైంది. ప్రభుత్వం పేదలకు రూపాయికేకిలోబియ్యం ఇస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వాటిని వినియోగించడం లేదు. బ్రోకర్లు కిలో రూ.8-9కి సేకరించి, మహారాష్ట్రలో కిలో రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని ఇద్దరు బ్రోకర్లు దాదాపు 50 మంది మనుషులను పెట్టుకుని.. గ్రామాల్లో దొడ్డు బియ్యం సేకరిస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల నుంచి కూడా కిలోకు రూ.8-9 వెచ్చిస్తూ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాటిని రైస్‌మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి, కొత్త సంచుల్లోకి మార్చి మహారాష్ట్రలోని గోండియాకు తరలిస్తున్నారు. రోజుకు 10 లారీల బియ్యాన్ని తరలిస్తున్నారు.

భూపాలపల్లి టు మహారాష్ట్ర
భూపాలపల్లి జిల్లాలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కొంటున్నారు. మహారాష్ట్రలో రూ.30కి విక్రయిస్తున్నారు. రోజూ 1000 క్వింటాళ్లకు పైగా రేషన్‌ బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. బియ్యాన్ని ఆటో ట్రాలీల్లో సరిహద్దుల వరకు తరలించాల్సిన బాధ్యత ఏజెంట్లది కాగా.. వీరికి కిలోకు రూ.5 చొప్పున కమీషన్‌ దక్కుతుంది. సరిహద్దుల నుంచి ఈ బియ్యం గడ్చిరోలి జిల్లాలోని ఓ మిల్లుకు చేరుతోంది. చింతలపల్లికి వెళ్లే మార్గంలో తెలంగాణ చెక్‌పోస్టు లేకపోవడం మాఫియాకు అనుకూలంగా మారింది. మహారాష్ట్ర వైపు చెక్‌పోస్టు ఉన్నా అది మామూళ్లకు అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. భూపాలపల్లి, ములుగు, వరంగల్‌రూరల్‌, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కొందరు వ్యాపారులు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందాను కొనసాగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి గత 4 నెలల్లో సుమారు 10వేల క్వింటాళ్లు, వరంగల్‌రూరల్‌, ములుగు జిల్లాల నుంచి 8వేల క్వింటాళ్లు, పెద్దపల్లి జిల్లా నుంచి 12వేల క్వింటాళ్లు, మంచిర్యాల నుంచి 20వేల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు తరలి ఉంటాయని అధికారుల అంచనా.

నూకలుగా మార్చి..
ఈ బియ్యాన్ని నూకలుగా మార్చి.. అనుమతులు తీసుకొని మరీ గుజరాత్‌, మహారాష్ట్రలోని పౌలీ్ట్ర వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆరు రైస్‌ మిల్లులను కేవలం రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చేందుకే ఈ మాఫియా వినియోగిస్తుండటం గమనార్హం. వనపర్తి జిల్లాలోని ఓ లిక్కర్‌ కంపెనీలో సోదాలు నిర్వహించగా 145 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం బస్తాలు దొరికాయి. తాజాగా పాన్‌గల్‌ మండలంలోని నిర్మాణంలో ఉన్న ఒక రైస్‌మిల్లు వద్ద 500 క్వింటాళ్లను అధికారులు సీజ్‌ చేశారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ వద్ద గుజరాత్‌కు వెళుతున్న ఒక లారీని పట్టుకుంటే, ఈ మాఫియా.. గంటల్లోనే అనుమతి పత్రాలను చేయించాయి.

బీరు తయారీ ఇలా..
బీరు తయారీలో బార్లీ, మొక్కజొన్నలు, నూకలను వినియోగిస్తారు. బార్లీ దొరక్కపోవడం.. సరిపడినంతగా మక్కల సరఫరా లేకపోవడం.. నూకలు తక్కువగా వస్తుండడంతో బీరు తయారీదారులు రేషన్‌ బియ్యాన్ని ఎంచుకుంటున్నారు. బియ్యాన్ని పిండి చేసి, బాయిలర్లలో 72 గంటలు ఉడికిస్తారు. అందులో కొన్ని ఎంజైమ్‌లు కలపడంతో 96 నుంచి 98% ఆల్కహాల్‌ వస్తుంది. దాన్ని డివైడ్‌ చేసి, ఆల్కహాల్‌ శాతాన్ని 48 శాతానికి తగ్గిస్తారు. ఇలా బీరు తయారు చేసి బాటిలింగ్‌ చేస్తారు.

Courtesy AndhraJyothy