అపూర్వ ఘట్టానికి విశ్వమంతా సలామ్‌

2011 వన్డే వరల్డ్‌కప్‌.. ముంబై వాంఖడే స్టేడియం.. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచాక అక్కడ ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. రెండున్నర దశాబ్దాలపాటు వంద కోట్ల మంది భారతీయులు తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయని ఓ దిగ్గజ ఆటగాడిని తోటి ఆటగాళ్లు అపూర్వ రీతిలో సత్కరించారు.. అతడి జీవితకాల కోరిక తీరిన వేళ వారంతా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను తమ భుజాల మీద మోసుకెళుతూ స్టేడియం చుట్టూ తిప్పారు. సచిన్‌ జాతీయ పతాకాన్ని చేబూని ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న ఆ సన్నివేశాన్ని ఏ క్రీడాభిమానీ మర్చిపోలేనిది. ఇప్పుడా అపురూప ఘట్టం ప్రపంచ మన్ననలను అందుకోవడం మనందరికీ గర్వకారణం.

బెర్లిన్‌: దిగ్గజ ఆటగాడు, భారత ‘క్రికెట్‌ గాడ్‌’గా పిలుచుకునే సచిన్‌ టెండూల్కర్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 2000-2020 ‘లారెస్‌ ఉత్తమ స్పోర్టింగ్‌ మూమెంట్‌’ అవార్డు సచిన్‌ను వరించింది. గత 20 ఏళ్లలో క్రీడా ప్రపంచంలో నెలకొన్న అద్భుత ఘట్టాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ నిర్వహించారు. ఇందులో 2011 వన్డే ప్రపంచకప్‌లో సహచర ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన ఫొటో (క్యారీడ్‌ ఆన్‌ ది షోల్డర్స్‌ ఆఫ్‌ నేషన్‌)కే అత్యధిక ఓట్లు లభించాయి. పాతికేళ్ల క్రికెట్‌ కెరీర్‌లో సచిన్‌ సాధించిన ఏకైక ప్రపంచకప్‌ అది. సోమవారం ఈ ఫలితాన్ని టెన్నిస్‌ గ్రేట్‌ బోరిస్‌ బెకర్‌ ప్రకటించగా… ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా చేతుల మీదుగా సచిన్‌ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్‌ ఆహూతులతో పంచుకున్న విషయాలు అతని మాటల్లోనే..

ఏమని వర్ణించను
అద్భుతంగా అనిపిస్తోంది. ప్రపంచక్‌పను గెలవడమనేది మాటల్లో వర్ణించలేనిది. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ కోరుకునే అలాంటి దృశ్యం ఎన్నిసార్లు సాధ్యమవుతుంది? చాలా అరుదుగానే దేశమంతా అలాంటి సంబరాలు చేసుకుంటుంది. అలాగే క్రీడలనేవి ఎంత శక్తివంతమో.. అవి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఈ ఘటన గుర్తుచేస్తుంది. ఇప్పటికీ ఆ సన్నివేశం నా మదిలో తాజాగానే ఉంది.

విశ్వకప్‌ గెలిచాక ఏం ఆలోచించానంటే
నాకు పదేళ్ల వయస్సులో (1983లో) క్రికెట్‌ జీవితం ఆరంభమైంది. అప్పుడే భారత్‌ ప్రపంచకప్‌ గెలుచుకుంది. నాకు దాని గొప్పతనం ఏమీ అర్థం కాకపోయినా అందరితో పాటు నేనూ సంబరాల్లో పాల్గొన్నా. కానీ ఏదో పెద్ద ఘనతే దేశం సాధించిందని అర్థమైంది. ఏదో ఓ రోజు నేను కూడా అలాంటి అనుభూతి పొందాలనుకున్నా. అలా నా ప్రయాణం మొదలై చివరకు విశ్వవిజేతలం కాగలిగాం. ఇదంతా ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది.

కల నెరవేరింది
నా జీవితంలో అదో గర్వకారణమైన సందర్భం. 22 ఏళ్లుగా కలలు కన్న ప్రపంచక్‌పను తనివి తీరా పట్టుకోగలిగా. కానీ ఇన్నాళ్లలో ఏనాడూ ఆశ వదులుకోలేదు. చివరకు దేశ ప్రజలందరి తరఫున ఆ ట్రోఫీని సగర్వంగా పైకెత్తా.

ఈ ట్రోఫీ మనందరిదీ
19 ఏళ్ల వయస్సులోనే నాకు నెల్సన్‌ మండేలాను కలుసుకునే అదృష్టం దక్కింది. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. ఎన్ని కష్టాలు పడినా గొప్ప నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. అందరినీ ఏకతాటి పైకి తెచ్చే శక్తి క్రీడలకే ఉందని మండేలా చెప్పారు. ఈ సందేశమంటే నాకెంతో ఇష్టం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎంతోమంది అథ్లెట్లకు జన్మతః ఏమీ లేకపోవచ్చు. కానీ వారు అనుకున్నది సాధించగలిగారు. క్రీడలను ఎంపిక చేసుకుని యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చిన వారికి నా కృతజ్ఞతలు. అందుకే ఈ ట్రోఫీ నాది మాత్రమే కాదు. మనందరిదీ.
‘లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ అవార్డును దక్కించుకున్న సచిన్‌కు అభినందనలు. ఇది దేశానికే గర్వకారణం’  
– ట్విటర్‌లో కోహ్లీ

Courtesy Andhrajyothi