జి. తిరుపతయ్య

1991 నుంచి నూతన ఆర్థిక విధానాల ఆసరాగా ప్రభుత్వరంగం ఏర్పరిచిన పటిష్ఠ పునాదుల మీద నిలబడి ప్రైవేటు పెట్టుబడిదారులు తమ భవిష్యత్తును వెదుక్కుంటున్నారు. ప్రైవేటు రంగంలో ఎదగలేనివారు, పటిష్ఠంగా ఉన్న ఎల్ఐసిని ఆధారం చేసుకుని లాభాలను ఆర్జించాలనుకునే దురుద్దేశంతో, పాలకుల రాజకీయ లబ్ధికి ఉపకరిస్తూ, వాటాల ఉపసంహరణ వంటి తప్పుడు నిర్ణయాలకు వాళ్లను ప్రేరేపిస్తున్నారు.

ఒకవైపు రామమందిర నిర్మాణం చేపడుతున్నారు. మరోవైపు, దేశ సంక్షేమానికి శక్తిని సమకూర్చగల ఆధునిక దేవాలయాలను కూల్చేస్తున్నారు! స్వతంత్ర భారత దేశాన్ని నిర్మించిన ఆధునిక దేవాలయాలు ప్రభుత్వరంగ సంస్థలే. ఇది ఋజువులతో కూడిన సత్యం. 1950వ దశకంలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, చమురు సంస్థలు, ఉక్కు, సిమెంటు కర్మాగారాల వంటి ప్రధాన రంగాలన్నీ ప్రభుత్వాధీనంలోనే పురుడు పోసుకున్నవి. ప్రభుత్వ ఖజానాపై ఆధారపడకుండా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆర్థికంగా ఊతమందిస్తూ వచ్చాయి. ఇట్లాంటి కామధేనువులను మార్కెట్టులో అమ్మి తమ పాలనావసరాలను తీర్చుకోవాలనుకోవడం సరైంది కాదు. దీని వల్ల ప్రభుత్వానికి ప్రస్తుతావసరాలు తీరవచ్చునేమో గానీ ప్రజలకు జవాబుదారీతనం కరువవుతుంది. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా ప్రజలకు బాకీ పడి, ఆ బాకీని తీర్చే బాధ్యతను ప్రభుత్వానికి బదలాయించలేదు. కానీ ‘మేము జవాబుదారులం’ అంటూ ముందుకొచ్చిన ఎన్నో ప్రైవేటు సంస్థలు దుకాణం ఎత్తేశాయి, వాటికి అనుమతులిచ్చిన ప్రభుత్వాలు ముఖం చాటేశాయి. ఈ గడ్డు పరిస్థితుల్లో ఆదుకుంటున్నవి ప్రభుత్వరంగ సంస్థలే. తమ ఖజానా లోటును పూడ్చుకోవటానికి ప్రతి ఏటా వాటిని అమ్మేస్తూ పోతే కొన్నాళ్ళ తరువాత అమ్మటానికి ఏవీ మిగలవు.

ప్రభుత్వరంగ సంస్ధల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.2.11లక్షల కోట్లను సమకూర్చుకోవాలని, అందుకోసం జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి)లో 10శాతం వాటాలను అమ్మి లక్ష కోట్లు రాబట్టాలని గత బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పుడు ఏకంగా 25శాతం వాటాల ఉపసంహరణ ద్వారా దాదాపు 3 లక్షల కోట్లు సమీకరించుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇందుకోసం దేశీయ మార్కెట్లే కాకుండా అంతర్జాతీయ స్టాక్ ఎక్సేంజీలలో కూడా ఎల్ఐసి వాటాలను లిస్టింగ్ చేయాలని  తలపెట్టింది. కరోనా సృష్టించిన విలయానికి అన్ని రంగాలు అతలాకుతలమయినా ప్రభుత్వ రంగాలు నిలదొక్కుకున్నాయి. వీటి ప్రాముఖ్యతకు ఇది నిదర్శనం. అయినప్పటికీ ఒక్క ఉదుటన 26 ప్రభుత్వరంగ సంస్ధల్లో వాటాలు ఉపసంహరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆర్టిఐ కింద అడిగిన ఒక ప్రశకు సమాధానంగా ప్రభుత్వమే స్వయంగా బయటపెట్టింది. పార్లమెంటులో చర్చించకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా ఇంతగా తొందరపడడంలో ఆంతర్యమేమిటి? ఎల్ఐసి ఉద్యోగులకు, ఏజెంట్లకు సంఘాలున్నాయి కానీ, ఈ సంస్థను తమ పొదుపుతో నిర్మించిన పాలసీదారులకు ఏ సంఘాలూ లేవు. వారి తరఫున నిలవాల్సిన ప్రభుత్వం అసంబద్ధ వాదనలు చేస్తోంది.

భారతీయ జీవితబీమాలోకి ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడం బీమా జాతీయీకరణ మౌలికసూత్రాలకు వ్యతిరేకం. స్వాతంత్ర్యం సాధించినప్పుడు భారత ప్రభుత్వ ఖజానా శూన్యం. ప్రైవేటు పెట్టుబడి అసలే లేని సందర్భమది. ఈ పరిస్థితుల్లో ప్రజల దగ్గర నుంచి చిన్న మొత్తాల రూపంలో పొదుపును సేకరించగలిగినటువంటి సంస్థ ఆవశ్యకతను నాటి పాలకులు గుర్తించారు. అంతే కాకుండా పట్టణాలకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని గ్రామగ్రామానికి చేరవేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ ఖజానాకు ఉపయోగపడేలా, సేకరించిన పొదుపులో, బీమా చట్టం- సెక్షన్ 27A ప్రకారం అత్యధిక శాతం ప్రభుత్వం దగ్గర లేదా ప్రభుత్వ గ్యారంటీ ఉన్న చోట మాత్రమే పెట్టుబడులు పెట్టాలనే నిబంధన విధించారు. ఒకవేళ సంస్థకు నష్టాలొచ్చినా పాలసీదారుల సొమ్ముకు ప్రభుత్వమే గ్యారంటీగా నిలుస్తుందని సెక్షన్ 37 ద్వారా హామీఇచ్చారు. అయితే  అలాంటి హామీ ఏనాడూ ఎల్ఐసికి అవసరం కాలేదు. మరణానంతరం చెల్లింపుల్లో జాప్యం ఉండకూడదు కాబట్టి ఆ సంస్ధ ప్రభుత్వాధీనంలో ఉంటేనే సబబని భావించారు. దీర్ఘ కాలిక చిన్నమొత్తాలను సమీకరించగల శక్తి సాధారణ బీమా సంస్ధల కన్నా ఎల్ఐసికి మాత్రమే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ ప్రధాన లక్ష్యాలతో, స్వలాభమే పరమావధిగా నడుస్తున్న 245 ప్రైవేటు కంపెనీలను కలిపి, భారతీయ జీవితబీమా సంస్థగా రూపొందించారు. కేవలం ఐదు కోట్లతో ప్రారంభమైన ఎల్.ఐ.సి. 2020 మార్చి నాటికి రూ.31,14,496 కోట్ల లైఫ్ ఫండ్‍ను, రూ.31,96,214 కోట్ల ఆస్తులను కలిగిఉంది. పాలసీలలో 75.90శాతం వాటా కలిగి ఉండటమే కాక ప్రభుత్వానికి 24,01,457 కోట్లు పెట్టుబడులుగా అందించింది. ‘ఎల్ఐసి లాభాల్లో 95శాతం పాలసీదారులకు, 5శాతం ప్రభుత్వానికి’ అన్న విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పుడు బీమా సంస్ధలోకి ప్రైవేటు పెట్టుబడులు చొరబడితే, ఇలాంటి వెసులుబాట్లు లేకపోటమే కాక పెట్టుబడి విధానాలు మారిపోయే అవకాశం ఉంది.

1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‍మెంట్ అథారిటీ (ఐ.ఆర్.డి.ఏ)ని ఏర్పాటు చేసి 26శాతం విదేశీ పెట్టుబడితో ప్రైవేటు బీమా సంస్ధలకు అనుమతినిచ్చారు. 1999 తరువాత నమోదైన ప్రైవేటు కంపెనీల్లో కొన్ని మూతపడగా, నేడు 23 కంపెనీలు మనుగడ సాగిస్తున్నాయి. 2015లో ఎఫ్.డి.ఐ పరిమితిని 49శాతానికి పెంచినప్పటికీ కొత్తగా ఏ ప్రైవేటు సంస్ధ  ఏర్పాటు కాలేదు. ఈ కంపెనీలు ఏవీ పైన పేర్కొన్న లక్ష్యాల్లో భాగస్వాములు కాలేదు. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వానికి నిధులను సమకూర్చాలన్న నిబంధన కూడా పెట్టలేదు. తద్వారా తమకు అనుకూలమైన విధంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకుంటున్నాయి. అయినా ఎల్.ఐ.సి.ని మించిన బోనస్ రేట్లను ప్రకటించలేకపోతున్నాయి. ఈ రెండు దశాబ్దాల కాలంలో అన్ని కంపెనీలు కలిపి కనీసం 25శాతం మార్కెట్‌వాటాను కూడా చేజిక్కుంచుకోలేకపోయాయి. పైగా అవి అత్యధిక శాతం జిల్లా, మెట్రో నగరాలకు మాత్రమే పరిమిత మవుతున్నాయి. పాలసీల ప్రీమియం రేట్లలో కూడా ఆశించినంత తగ్గుదల లేదు. రిస్క్ కవరేజ్ కన్నా మార్కెట్ ఆధారిత (యూలిప్) పాలసీలను ప్రోత్సహించడం ద్వారా బీమా సిద్ధాంతానికి నష్టం కలిగిస్తున్నాయి. ఈ ప్రైవేటు కంపెనీల ఏర్పాటు వల్ల ఉద్యోగాలలో ఏ మాత్రం పెరగలేదు. అసంబద్ధ, అత్యాశాపూరిత నియామకాల వల్ల ఏజెంట్ల టెర్మినేషన్లు విపరీతంగా పెరిగిపోవడంతో నిరుద్యోగం వేధిస్తోంది. ఇలాంటి అనేక ప్రతికూల అనుభవాలు చవిచూసిన తరువాత కూడా బీమా రంగంలోకి ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించాలనుకోవటం బాధ్యతారాహిత్యం కాక మరేమి అవుతుంది?

ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో ఎల్.ఐ.సి లో వాటాలు అమ్మాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నాటి నుంచి ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తన తరఫు నుంచి నాలుగు వాదనలు ముందుకు తెచ్చింది: 1) లిస్టింగ్ వల్ల ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది, 2) కాపిటల్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించే వీలు ఉంటుంది 3) ఎల్.ఐ.సి నిజ విలువ ఆవిష్కృతమై, చిన్న మదుపుదారులకు ఉపయోగం కలుగుతుంది. 4) సంస్థ మరింత పారదర్శకంగా ఉంటుంది. కానీ లిస్టింగ్ వల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరగటం అటుంచితే, ఆ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఎల్ఐసి ముందుకొచ్చి వాటిని బతికిస్తోంది. ఉదా: నాటి గ్లోబల్ ట్రస్ట్ బాంకు నుంచి సత్యం కంప్యూటర్స్ సహా నేటి ఐడిబిఐ వరకు ఎల్ఐసి ద్వారా బయట పడినవే. క్యాపిటల్ అవసరాలు ఎవరికి? ఎల్ఐసికా, మార్కెట్టుకా? లిస్టెడ్ కంపెనీల పెట్టుబడుల అవసరాల కోసం షేర్ మార్కెట్లు ఉపయోగపడతాయి. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్థకులు ఆర్థిక వ్యవస్థ బాగుండడం అంటే షేర్ మార్కెట్లు పురోగమించడమే అని వాదిస్తూ ఉంటారు. కానీ, 2008 తర్వాత సంభవించిన పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం, ఈ వాదనల్ని పటాపంచలు చేసి, ఆర్థిక వ్యవస్థలో రాజ్యం (స్టేట్) నిర్వర్తించాల్సిన బాధ్యతను ముందుకు తెచ్చింది.

ఎల్ఐసికి వ్యాపార నిర్వహణ నిమిత్తం ఎటువంటి పెట్టుబడులు అవసరం లేదు. అదే కేంద్ర ప్రభుత్వానికే నిధులు సమకూరుస్తోంది. ఎల్ఐసి లో వాటాల విక్రయం వల్ల చిన్న మదుపుదారులకు లాభం తక్కువే. దేశ జనాభాలో 2శాతంగా ఉండే వీరి ప్రయోజనం కోసం 135 కోట్ల మందికి ఉపయోగపడే సంస్థను లిస్టింగ్ చేసి, వాటాలు అమ్మడం సహేతుకం కాదు. పారదర్శకత అనే అంశంలో, ఎల్ఐసితో సహా అన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు ఐఆర్‌డిఎ పర్యవేక్షణలో ఉంటాయి. 2016 ఐఆర్‌డిఎ నిబంధనల మేరకు ప్రతి బీమా కంపెనీ తన కార్యకలాపాలపై క్రమం తప్పకుండా ఐఆర్‌డిఎకు నివేదికలు సమర్పించాలి. దీనితో పాటు, ఎల్ఐసి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండటం వల్ల కాబట్టి, తన వార్షిక అకౌంట్లను పార్లమెంటుకు  కూడా సమర్పిస్తుంది. అందువల్లే ఎల్ఐసిలో నిరర్థక ఆస్తుల విలువ కేవలం 0.4శాతమే నిజ విలువ (intrinsic value) బయటపడుతుంది అన్న ప్రభుత్వ వాదనలో మతలబేంటో తెలియదు కానీ వాటాల అమ్మకం కోసం ఎల్ఐసి విలువను తక్కువగా మదింపు చేసే ప్రమాదం ఉంది.

1991 నుంచి నూతన ఆర్థిక విధానాల ఆసరాగా ప్రభుత్వరంగం ఏర్పరిచిన పటిష్ఠ పునాదుల మీద నిలబడి ప్రైవేటు పెట్టుబడిదారులు తమ భవిష్యత్తును వెదుక్కుంటున్నారు. ప్రైవేటు రంగంలో ఎదగలేనివారు, పటిష్ఠంగా ఉన్న ఎల్ఐసిని ఆధారం చేసుకుని లాభాలను ఆర్జించాలనుకునే దురుద్దేశంతో, పాలకుల రాజకీయ లబ్ధికి ఉపకరిస్తూ, వాటాల ఉపసంహరణ వంటి తప్పుడు నిర్ణయాలకు వాళ్లను ప్రేరేపిస్తున్నారు. జీవిత బీమాలో వాటాలను అమ్మటానికి నిధుల కొరత మాత్రమే కారణం కాదు. నిధులు సమీకరించుకోవాలంటే అనేక మార్గాలున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే జిడిపిలో పన్ను ఆదాయం 85.8శాతం నుంచి 81.3శాతానికి పడిపోయి దాదాపు పన్నెండు లక్షల కోట్లు తగ్గిపోయింది. ఏ దేశంతో పోల్చినా ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు మన దేశంలో తక్కువే. అందువల్ల కామధేనువు లాంటి జీవితబీమా సంస్ధను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించుకు కోవడం పాలసీదారులకూ, ప్రజలకూ, దేశానికీ శ్రేయస్కరం.

ప్రెసిడెంట్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్
యూనియన్, హైదరాబాద్ డివిజన్

Courtesy Andhrajyothi