• బాచారంలో 7 ఎకరాల వివాదాస్పద భూమి
  • అనుభవదారు కాలమ్‌లో సురేశ్‌ కుటుంబం
  • పట్టాదారుల కాలమ్‌లో భూమి యజమానులు
  • కౌలు చట్టం కింద ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని అనుభవదారుల డిమాండ్‌
  • కుదరదని తేల్చిన జాయింట్‌ కలెక్టర్‌
  • కోర్టులోనూ అనుభవదారులకు చుక్కెదురు
  • పట్టాదారులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని జేసీ ఉత్తర్వులు
  • ఆ ఆదేశాలను అమలు చేయాల్సింది తహసీల్దార్‌
  • దానిని అడ్డుకునేందుకే విజయా రెడ్డి హత్య
  • తహసీల్దార్‌ విజయా రెడ్డి హత్యకు కౌలు భూముల వివాదమే కారణమని తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం 2016లో ఏర్పడింది. మొట్టమొదటి తహసీల్దార్‌గా విజయా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మండలంలోని బాచారం గ్రామంలో సర్వే నం.96, 92లలో 7 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం దాని విలువ దాదాపు రూ.20 కోట్లు ఉంటుంది. ఈ భూముల రికార్డుల్లో పట్టాదారు కాలమ్‌లో భూ యజమానులు ఉండగా.. అనుభవదారు కాలమ్‌లో వాటిని సాగు చేసుకుంటున్న నిందితుడు సురేశ్‌ కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతో, కౌలు రక్షిత చట్టం ప్రకారం ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌ (ఓఆర్‌సీ) ఇవ్వాలని కౌలు రైతులు (అనుభవదారులు) పట్టుబడుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు వినతులు ఇస్తున్నారు. అయితే, 2012లో ఆర్డీవో పట్టాదారులు (భూ యజమానులకు) అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు అప్పీల్‌కు వెళ్లగా.. ఆయన కూడా పట్టాదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దానిని సవాలు చేస్తూ అనుభవదారులు హైకోర్టులో కేసు వేశారు. విచారణ తర్వాత వివాదాన్ని పరిశీలించాలని న్యాయస్థానం జాయింట్‌ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పాత ఆదేశాలు (పట్టాదారులకు అనుకూలంగా ఇచ్చిన)నే పునరుద్ఘాటిస్తూ జాయింట్‌ కలెక్టర్‌ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో, తమకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని భూ యజమానులు తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఆదేశాలు జారీ చేసే అధికారం ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్లకు మాత్రమే ఉంటుంది. తహసీల్దార్‌ కేవలం వారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలంతే! ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినందున వాటికి అనుగుణంగా తహసీల్దార్‌ పాస్‌ పుస్తకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో, పట్టాదారులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా అడ్డుకోవడానికే విజయారెడ్డిని నిందితుడు హత్య చేసినట్లు తేలింది. ఈ భూములు వివాదంలో ఉండడంతో భూ రికార్డుల నవీకరణలో ప్రభుత్వం వాటిని పార్ట్‌-బీ (వివాదాస్పద జాబితా)లో చేర్చింది. వివాదం తేలకుండా ఏకపక్షంగా పాస్‌ పుస్తకాలు ఇవ్వరాదని నిర్ణయం తీసుకుంది. అయితే, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ పాస్‌ పుస్తకాలు పట్టాదారులకు ఇస్తారనే ఉద్దేశంతోనే సురేశ్‌ ఈ దాడి చేసినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కాగా, తహసీల్దార్‌ విజయా రెడ్డి హత్యపై రంగారెడ్డి కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

Courtesy Andhrajyothy..