దళితులు, గిరిజనులు, పేదలు అటవీ, కొండచరియలు, బంజరు భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అక్కడ దొరికే పండ్లు తింటూ అక్కడే నివాసిత ప్రాంతాలుగా మలుచుకుంటున్నారు. సాగుచేసుకుంటున్నవారికి భూములు అప్పగించాల్సిన సర్కారు వాటిని గుంజుకునే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. కేంద్రంలో మోడీ సర్కార్‌ వచ్చాక.. పేదల వద్ద ఉన్న భూములపై కార్పొరేట్ల కన్నుపడింది. మౌలిక వసతులనో.. మైనింగ్‌ అనో… ఇలా మరెన్నో పెద్దల అవసరాల కోసం పాలకప్రభుత్వాలు ఎడాపెడా గుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏకంగా జాతీయోత్పత్తి సవరించిన అంచనాల్లో 7.2 శాతం వరకు ఉంటుందని ల్యాండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ వాచ్‌ అనే సంస్థ జరిపిన సర్వేలో బహిర్గతమైంది.

సగటున 21,300 మందిపై ప్రభావం
– 335 కేసులు.. 13.7 లక్షల కోట్లకు చిక్కులు
– ల్యాండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ వాచ్‌ సంస్థ జరిపిన మూడేండ్ల పరిశోధనతో వెలుగులోకి..

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న ప్రతీ భూ వివాదంవల్ల సగటున కనీసం 10,600 మంది ప్రజలు ప్రభావితులవుతున్నారు. మైనింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన భూ వివాదాల్లో ఈ సంఖ్య సగటున 21,300 దాటినట్టు ఇటీవల విడుదలైన ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న దాదాపు 703లకుగాను 335 భూ వివాదాలకు సంబంధించి మొత్తం రూ.13.7 లక్షల కోట్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయి. ఇది 2018-19 సంవత్సర దేశ స్థూల జాతీయోత్పత్తి సవరించిన అంచనాలో 7.2శాతానికి సమానం. ల్యాండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ వాచ్‌ అనే స్వచ్ఛంద సంస్థ లొకేటింగ్‌ ద బ్రీచ్‌ పేరుతో ఈ అధ్యయన నివేదికను ఇటీవల విడుదలచేసింది. మూడేండ్ల పరిశోధనల ఆధారంగా దేశంలో ఎక్కడ, ఎందుకు భూ వివాదాలు జరుగుతున్నాయో ఈ సంస్థ వెల్లడించింది. సమాజంలోని వివిధ వర్గాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై ఈ వివాదాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో సర్వే స్పష్టం చేసింది.
మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, పరిరక్షణ, అటవీ, భూ వినియోగం, మైనింగ్‌, పరిశ్రమ అనే ఆరు విస్తత రంగాలుగా వర్గీకరించిన 2.1 మిలియన్‌ హెక్టార్ల భూమి వివాదాల్లో చిక్కుకొని ఉన్నది. ఇందులో మౌలిక సదుపాయాల సంబంధిత వివాదాల్లో ఎక్కువగా 1.56 మిలియన్ల హెక్టార్ల భూమి వున్నది. ఇది నాగాలాండ్‌ మొత్తం విస్తీర్ణానికి దాదాపు సమానం.

అధ్యయనం ప్రకారం… మొత్తం భూ వివాదాల్లో 50శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి, మైనింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించినవిగా పేర్కొంది. కాగా ఇది వరుసగా 43శాతం, 6శాతంగా తెలిపింది. పరిరక్షణ, అటవీ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించినవి 15శాతంగా తెలిపింది.

ప్రభావితులయ్యేది ఎంతమంది?
నివేదికలో విశ్లేషించిన 703 భూ వివాదాల కారణంగా దాదాపు 65 లక్షలమంది ప్రభావితులవుతున్నారని నివేదిక స్పష్టంచేసింది. వాటిలో, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల కలిగే భూ వివాదాలవల్ల 30 లక్షల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టు భూ వివాదాలకు సంబంధించి సగటున 12,354 మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నది. మైనింగ్‌ సంబంధిత భూ వివాదాలు రెండో స్థానంలో నిలవగా మొత్తం 8,52,488 మంది పౌరులను ప్రభావితం చేస్తున్నదని నివేదిక స్పష్టంచేసింది.

పెట్టుబడులు ఎంత?
వివాదాల్లో చిక్కుకుపోయిన మొత్తం రూ.13.7 లక్షల కోట్ల పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాల సంబంధిత వివాదాల్లో ఏడు ట్రిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను చిక్కుకుపోయాయనీ, ఆ తర్వాత స్థానాలను విద్యుత్‌, పరిశ్రమలకు సంబంధించినవి (రూ.2.8 ట్రిలియన్‌ డాలర్లు, రూ .2.7 ట్రిలియన్‌ డాలర్లు) ఆక్రమించాయి.

703 కేసుల్లో 667 లేదా 95శాతం కేసులు.. ‘వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండో పార్టీగా ఉన్నది. వీటన్నిటిల్లో ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రాజెక్ట్‌ ప్రమోటర్లుగా లేదా రెగ్యులేటర్లుగా వివాదాలకు మధ్యవర్తులుగా ఉన్నట్టు పేర్కొంది. 188 కేసుల్లో (27శాతం) ప్రయివేటు కంపెనీలు లేదా వ్యాపారులు వివాదాల్లో ఉన్నారు. అలాగే 23 (3శాతం) శాతం కేసుల్లో విభిన్న వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపింది. భూ సంస్కరణల చట్టాలు అమలులో వున్నప్పటికీ.. వాటి అమలు అంతంతమాత్రమేనని ల్యాండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ వాచ్‌ సహ వ్యవస్థాపకుడు, అధ్యయన సహ రచయితల్లో ఒకరైన కుమార్‌ సంభవ్‌ శ్రీవాస్తవ అన్నారు.

దేశవ్యాప్తంగా ఎక్కువ భాగం వివాదాలు సాధారణ భూముల్లోనే ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది. ప్రభుత్వం అనేక రకాల సాధారణ భూములను ‘బంజరు భూములు’ గా నిర్వచించినప్పటికీ, ఈ భూములను సాధారణ పౌరులే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలవారు సాంప్రదాయ హక్కులను కలిగి ఉంటారని నివేదిక తెలిపింది.

గిరిజన ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో…
గిరిజన ప్రాబల్యం కలిగిన ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో భూ వివాదాల స్వభావాన్ని కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది. భారత రాజ్యాంగం షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. ఈ ప్రాంతాలు 10రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్‌, తెలంగాణ. గిరిజన ప్రాంతాల్లో ఈ వివాదాలు 182 అనీ, మొత్తంతో పోల్చి చూస్తే ఇది 25శాతం. ఈ జిల్లాల్లో మైనింగ్‌కు సంబంధించినవి 60శాతంగా ఉన్నట్టు తెలిపింది. అటవీ భూములకు సంబంధించి 272 విభేదాలుండగా.. ఇందులో అటవీ హక్కుల చట్టం-2006 ఉల్లంఘన లేదా అమలు చేయకపోవటానికి సంబంధించి 131గా పేర్కొంది.

రాష్ట్రాల వైఫల్యం
‘రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల ప్రకారం.. 26.8 లక్షల హెక్టార్ల భూమి (మేఘాలయ రాష్ట్రం కంటే పెద్ద ప్రాంతం) ఎనిమిది రాష్ట్రాల్లోని భూ బ్యాంకుల కోసం కేటాయించారు. ఈ ఎనిమిది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌. అనేక రాష్ట్రాలు ఇప్పటికే భూ బ్యాంకులను కలిగి ఉండగా, మరికొన్ని వాటిని సృష్టించే పనిలో ఉన్నాయి. అయితే, పైన పేర్కొన్న ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే సెప్టెంబర్‌ 2017 నాటికి వాటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశాయి’ అని నివేదిక తెలిపింది. భూ బ్యాంకుల ఏర్పాటు వల్ల విభేదాలు సంభవించిన సందర్భాలూ లేకపోలేదు. ఆ సందర్భాల్లో మొదట భూమిని పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయించినట్టు నివేదిక పేర్కొంది. కాని స్థానిక వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టులను నిలిపివేసినప్పుడు.. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ఉన్నట్టు పేర్కొంది. వివాదాస్పద భూములను ప్రజలకు, ఈ ప్రాజెక్టులను వ్యతిరేకించిన వర్గాలకు తిరిగి ఇవ్వడానికి బదులుగా, ఈ భూములను రాష్ట్ర బ్యాంకుల్లో వేసుకున్నాయి. చాలా సందర్భాల్లో ఈ వివాదం ఎప్పుడూ పరిష్కారానికి నోచుకోలేదు.
అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ), భూ సేకరణ, పునరావాస చట్టం (ఎల్‌ఏఆర్‌ఆర్‌) వంటి ప్రతిష్టాత్మక చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయనీ, ప్రభుత్వాలు వాటిని చిత్తశుద్ధితో అమలు చేయటంలేదని శ్రీవాస్తవ స్పష్టంచేశారు. ‘మూడింట రెండొంతుల వివాదాలు సాధారణ భూముల వాడకానికి సంబంధించినవి. అటువంటి భూములపై వెనుకబడిన సాంప్రదాయ హక్కులను గుర్తించటంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని శ్రీవాస్తవ తెలిపారు. అటవీ నిర్మూలన కార్యక్రమాలు కూడా భూ వివాదాలకు దారితీస్తున్నాయని ఆరోపించారు.

దిక్కులేని వారు దళితు లేనా..?
దేశంలో అతిపెద్ద భూమిలేని సామాజిక వర్గం దళితులేనని నివేదిక స్పష్టంచేసింది. 2013 లో దాదాపు 60శాతం దళిత కుటుంబాలు ఏ వ్యవసాయ భూములనూ కలిగిలేవు. షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులతో పోలిస్తే వీరిలో భూ యాజమాన్య హక్కు చాలా తక్కువ. దేశంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ మూలాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది. 13 రాష్ట్రాల్లో దాదాపు 92,000 మంది దళితులతో సంబంధమున్న 31 భూ విభేదాలున్నట్టు సర్వే పేర్కొంది. వీటిలో మొత్తం 39,400 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఉన్నది. ఇది చెన్నై నగర ప్రాంతా నికి సమానం. ‘దళితుల జీవితం, జీవనోపాధిపై భూమి తీవ్ర ప్రభావం చూపుతుంది. అది దళితుల గౌరవం, గుర్తింపుకు ఆధారం. భారతదేశాన్ని ఇప్పటికీ వ్యవసాయ దేశంగా పిలుస్తారు, కానీ ఆ రంగంలో చెమటోర్చి పనిచేసే దళితులను మాత్రం విస్మరిస్తున్నారు’ అని దళిత భూ హక్కుల ఉద్యమాల నేషనల్‌ ఫెడరేషన్‌ చైర్‌పర్సన్‌ మనోహరన్‌ అభిప్రాయపడ్డారు.

Courtesy Nava Telangana