– మూడెకరాలను మర్చిన సర్కార్‌
– మిథ్యగా భూపంపిణీ

దళిత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం తన తొలి అడుగును భూ పంపిణీతో మొదలు పెట్టింది. నిరుపేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంపిక చేసిన ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమిని అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా 2014 ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల సందర్భంగా 52 మంది మహిళలకు ముఖ్యమంత్రి కె చంద్రేశఖర్‌రావు పట్టాలను పంపిణీ చేసారు. ఇక ఆ తర్వాత నుంచి భూ పంపిణీ మిథ్యగా తయారైంది. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది భూమి లేని నిరుపేద దళితులు ఉన్నట్టు ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. వారందరికీ భూ పంపిణీ చేసేందుకు గాను 2015 లో జిల్లాకు రూ.1000 కోట్ల చొప్పున పది జిల్లాలకు కలిపి రూ.10వేల కోట్లు కేటాయించింది. ఇక ఆ తర్వాత నుంచి బడ్జెట్‌లో భూ పంపిణీ కోసం నిధులు ఇవ్వలేదు. లబ్దిదారులను గుర్తించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని దళిత సంఘాలు ఆరోపించారు. భూముల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేద దళితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు వారిని విసుక్కుంటున్నారే తప్ప భూ పంపిణీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వారు అంటున్నారు.

ప్రత్యామ్నాయం మాటేదీ ..
భూముల్లేని చోట అందుకు ప్రత్యామ్నాయంగా నగదు అందిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ. 4 లక్షల ప్రకారం మూడెకరాలకు కలిపి అర్హులైన లబ్దిదారులకు రూ.12 లక్షలు ఇస్తామని సర్కారు హామీ ఇచ్చింది. ఒకవేళ లబ్దిదారులు కోరితే స్వయం ఉపాధి పథకం కింద కార్లు, ఆటోలు, కిరాణషాపుల కోసం రుణాలు ఇస్తామని చెప్పినా, ఆ హామీ కూడా అచరణకు నోచుకోలేదు. ప్రత్యామ్నాయ పథకాలైనా అమలు చేయమంటూ భూమి లేని నిరుపేద దళితులు సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష ఎకరాలు ఏమైనట్టు ?
తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని భూ పంపిణీకి ముందు ప్రభుత్వం గుర్తించింది. అందులో సుమారు 20వేల ఎకరాల భూమి సాగుకు అనుగుణంగా ఉందని పది జిల్లాలకు చెందిన కలెక్టర్లు అప్పట్లో ప్రభుత్వానికి నివేదించారు.
అందులో నుంచి తొలి విడతగా సాగుకు అనుకూలమైన 3వేల ఎకరాలను భూ పంపిణీ కోసం కేటాయించింది. 2014లోనే 2049 మంది లబ్దిదారులను గుర్తించి వారికి ఈ 3వేల ఎకరాలను పంచాలని నిర్ణయించింది. కానీ ఆ దిశగా అడుగులేయడంలేదు. స్థానికంగా ఎవరూ భూములను అమ్మడానికి ముందుకు రావడం లేదని సర్కారు కుంటి సాకులు చెబుతున్నదని నిరుపేద దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమలకు తరలింపు?
దళితుల భూ పంపిణీ కోసం గుర్తించిన లక్ష ఎకరాలను పరిశ్రమలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి లక్ష ఎకరాలతో భూ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ల్యాండ్‌ బ్యాంక్‌ ద్వారానే పరిశ్రమలకు భూములను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదు పాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కు దీని పర్యవేక్షణ బాధ్యతను అప్పగించేందుకు అవసరమైన విధి విధానాలను కూడా రూపొందించింది. భూ పంపిణీ కోసం గుర్తించిన భూములను పరిశ్రమలకు కేటాయించబోతున్నట్టు వార్తలు రావడంతో భూ బ్యాంక్‌ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకుంది. కానీ ఇప్పటికే ఆ భూములను బహుళజాతి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకే కేటాయించేందుకు నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు భూమి కొరత రాకూడదన్న ఆలోచనతోనే భూ పంపిణీకి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం సిద్ధ పడుతున్నదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

భూ పంపిణీ లేనట్టే
భూ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం స్వస్తి పలకనున్నట్టు తెలుస్తోంది. భూమి లేని నిరుపేద దళితులందరికీ భూ పంపిణీ చేయడం సాధ్యం కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల కొరత ఉన్నదనీ, ప్రయివేటు వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. భూముల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.11 లక్షల మంది భూమి లేని నిరుపేద దళితులు ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ భూ పంపిణీ చేయాలంటే ప్రయివేటు భూములను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఎస్సీ సంక్షేమ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయివేటు భూముల ధరలు లక్షల్లో ఉండటం వల్ల భూ పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.

(Courtesy Nava Telangana)