వ్యాపార భాగస్వామి అయిన స్నేహితుడి దురాగతం
ఆనంద్‌ నుంచి 80 లక్షల అప్పు తీసుకున్న ప్రదీప్‌ రెడ్డి
హన్మకొండకు వస్తే డబ్బు తిరిగిస్తానంటూ ఫోన్‌
భూపాలపల్లి అడవుల్లోకి తీసుకెళ్లి గొంతు కోసి హత్య
సహకరించిన మరో నలుగురు.. అదుపులో డ్రైవర్‌ రమేశ్‌
4రోజులుగా కనిపించకుండాపోయిన ఆనంద్‌ రెడ్డి కథ విషాదాంతం
ఇసుక వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడి దురాగతం

వరంగల్‌ అర్బన్‌ క్రైం, ఖమ్మం క్రైం, కృష్ణాకాలనీ : నాలుగురోజులుగా కనిపించకుండా పోయిన ఖమ్మం జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మోకు ఆనంద్‌రెడ్డి(44) దారుణ హత్యకు గురయ్యారు. తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఆనంద్‌రెడ్డి చేస్తున్న ఇసుక వ్యాపారంలో భాగస్వామి, స్నేహితుడు అయిన ప్రదీప్‌ రెడ్డి ప్రణాళిక ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ప్రదీప్‌కు అతడి డ్రైవర్‌ నిగ్గుల రమేశ్‌, మరో ఇద్దరు సహకరించారు. భూపాలపల్లి రూరల్‌ మండలంలోని ఓ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఆనంద్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో ఆనంద్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. స్నేహితుడు ప్రదీ్‌పరెడ్డితో కలిసి రెండేళ్లుగా ఆయన ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆనంద్‌ నుంచి ప్రదీప్‌  రూ.80లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇసుక వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆనంద్‌, ప్రదీప్‌ మధ్య గొడవలు తలెత్తాయి.

అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కొన్నాళ్లుగా ప్రదీ్‌పను ఆనంద్‌ పదే పదే అడుగుతున్నాడు. దీంతో ఆనంద్‌ హత్యకు ప్రదీప్‌ ప్రణాళిక వేశాడు. ప్రదీప్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఈనెల 7న ఉదయం ఏడింటికి హన్మకొండలోని ఓ హోటల్‌కు ఆనంద్‌ చేరుకున్నాడు. కొద్దిసేపటికి కుటుంబసభ్యులకు, బందువులకు ఫోన్‌ చేసి తాను వరంగల్‌కు వచ్చానని.. డబ్బులు తిరిగివ్వమంటే ప్రదీప్‌ సతాయిస్తున్నాడని చెప్పాడు. ఆ తర్వాత ప్రదీ్‌పరెడ్డి.. డబ్బుకు ప్రతిగా భూపాలపల్లిలో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తానని ఆనంద్‌ను నమ్మించాడు. అనంతరం తన డ్రైవర్‌ రమేశ్‌తో కలిసి ఆయన్ను తన కారులోకి ఎక్కించుకొని వెళ్లాడు. ఈ క్రమంలో ఆనంద్‌కు సోదరుడు శివకుమార్‌ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. ఆనంద్‌ కనిపించడం లేదంటూ ఆయన 8న హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అడవిలో హత్య.. 
ఈ నెల 7న ఆనంద్‌ను ప్రదీప్‌ ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డ్రైవర్‌ రమేశ్‌తో కలిసి చిత్రహింసలు పెట్టినట్లు తెలిసింది. అనంతరం మరో ముగ్గురు వ్యక్తులకు ఫోన్‌చేసి.. ‘‘గొల్లబుద్దారం నుంచి ఏడుకిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో దావత్‌ చేసుకుందాం’’ అని సూచించాడు. కాళ్లూచేతులను తాళ్లతో బిగించి.. మూతికి ప్లాస్టర్‌ వేసిన స్థితిలో ఆనంద్‌ను అక్కడికి ప్రదీప్‌, రమేశ్‌ తీసుకెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఐదుగురు కలిసి కత్తులతో  ఆనంద్‌ను గొంతుకోసి హత్యచేశారు. అనుమానం ఉన్న వ్యక్తుల తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు విచారించడంతో డ్రైవర్‌ రమేశ్‌ లొంగిపోయాడు. మంగళవారం అతడు చెప్పినట్లుగా గొల్లబుద్దారం ప్రాంతానికి వెళ్లిన పోలీసు బృందాలు.. బాగా పొద్దుపోయిన తర్వాత ఆనంద్‌ మృతదేహాన్ని గుర్తించాయి. ప్రధాన నిందితుడు సహా పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.

Courtesy Andhrajyothi