Image result for కార్మిక సంస్కరణలుకంపెనీ యాజమాన్యాలకు మేలు చేసేవిధంగా చట్టాల్లో మార్పులు
అత్యంత దుర్భరమైన పని పరిస్థితుల్లో వలస కార్మికులు
సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనానికి దూరంగా 10కోట్ల మంది
– ‘అజీవికా బ్యూరోతాజా అధ్యయనం

ఓ పద్దతి…శాస్త్రీయత లేకుండా మోడీ సర్కార్‌ నిర్ణయించిన కనీస వేతనం రూ.178…విమర్శలపాలైంది. రెండేండ్ల క్రితం నిర్ణయించిన ‘కనీస వేతనం’కు కేంద్రం పెంచిన మొత్తం కేవలం రూ.2. ఇది ఏరకంగా కార్మికుల జీవితాల్ని మెరుగుపరుస్తుంది? అని దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ‘వేతనాల కోడ్‌’ (కోడ్‌ వేజెస్‌ చట్టాలు) చట్టాన్ని..కంపెనీ యాజమాన్యాలకు, బడా కార్పొరేట్‌లకు అనుకూలంగా మార్చటమూ చర్చనీయాంశమైంది. ఈ విధానాలు, చట్టాల్లో మార్పులు…కార్మికుల కడుపు నింపుతాయా? అని అని సగటు కార్మికుడు ప్రశ్నిస్తున్నాడు. వలస కార్మికుల స్థితిగతులపై ‘అజీవికా బ్యూరో’ అనే ఎన్జీఓ సంస్థ సర్వే జరపగా, అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ : కార్మికరంగంలో మోడీ సర్కార్‌ చేసిన సంస్కరణలు ఈ దేశంలోని అణగారిన వర్గాలు, వివక్షకు గురైన సామాజిక వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కార్మికులకు అనుకూల మైన నిబంధనలు, నియమాలతో ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు చట్టాల్ని రూపొందిస్తే, నేడు మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ కంపెనీ లకు, బడా పెట్టుబడుదారులకు అనుకూలించే విధంగా చట్టాల్లో మార్పులు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగంలో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. దాదాపుగా 10 కోట్లమంది స్థిరమైన వేతనం, సామాజిక భద్రతకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నారు. వీరంతా స్వంతగ్రామాన్ని విడిచి ఉపాధి కోసం వేరే చోటకు వలస వెళ్తారనీ ‘అజీవికా బ్యూరో’ అనే ఎన్జీఓ సంస్థ అధ్యయనం తెలిపింది. కార్మికరంగంలో మోడీ సర్కార్‌ చేసిన చట్ట సవరణలు, చేసిన మార్పులు కోట్లాది మంది వలస కార్మికులను తీవ్రంగా దెబ్బకొట్టిందని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తేల్చారు. కనీసం వేతనంగా రూ.178గా నిర్ణయించటం, వేతనాల కోడ్‌లో కీలక మార్పులు చేయటమే అందుకు ఉదాహరణగా పరిశోధకులు చూపుతున్నారు. వలస కార్మికుల స్థితిగతులు తెలుసుకోవటంపై 2019లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ‘అజీవికా బ్యూరో’ సర్వే జరిపింది. రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌లలో జరిపిన సర్వే వివరాలు మీడియాకు విడుదల చేశారు. నిర్మాణరంగంలో, పరిశ్రమల్లో, హోటల్స్‌, రెస్టారెంట్స్‌లలో ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఉదాహరణకు అహ్మదాబాద్‌ నగరాన్నే తీసుకుంటే, ఇక్కడ పనిచేస్తునవారిలో ఎక్కువగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, దక్షిణ రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన ఆదివాసీలున్నారని తేలింది.

కనీస అవసరాలు తీరటం లేదు…
పండుగల సమయంలో, వ్యవసాయ పనులున్నప్పుడు ‘వలస కార్మికులు’ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అహ్మదాబాద్‌, ముంబాయి, ఢిల్లీ..పెద్ద పెద్ద నగరాల్లో ఇరుకైన గదుల్లో జీవనాన్ని సాగిస్తున్నారు. ఉపాధిద్వారా వచ్చినదాంట్లో ఎక్కువమొత్తం ఇంటికి పంపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీ నిర్మాణాలు జరిగే చోట గుడారాలు వేసుకొని పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలూ అందటం లేదు. తాగేందుకు, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు సరైన నీరుకూడా అందుబాటులో ఉండటం లేదు. పని ప్రదేశాల్లో మహిళా కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తీవ్రమైన ఎండ, భారీ వర్షాల కారణంగా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఈ చట్టాలు న్యాయం చేస్తాయా?
ముఖ్యంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రకాల ప్రమాదాల్లో ప్రతిరోజూ సగటున 38 మంది కార్మికులు చనిపోతున్నారు. కార్మికుల సంపాదనలో అత్యధిక భాగం వారి ఆహారం, వసతి కోసమే పోతుందని తేలింది. ఇలాంటి పరిస్థితిల్లో కనీస వేతనం రూ.178గా నిర్ణయించటం వారికి ఏ విధంగా న్యాయం చేస్తుంది? వారి జీవన ప్రమాణాల్ని ఎలా పెంచుతుంది? అని పరిశోధకులు ప్రశ్నించారు.

(Courtesy Nava Telangana)