హైదరాబాద్‌:  అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో 75 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఈ విషయాన్ని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) కి అదానీ పోర్ట్స్‌ శుక్రవారం వెల్లడించింది. ఈ లావాదేవీలో భాగంగా కృష్ణపట్నం పోర్ట్‌కు రూ.13,572 కోట్ల సంస్థాగత విలువ కట్టారు. 2025 నాటికి 400 ఎంఎంటీ (మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల) సరకు రవాణా సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని అదానీ పోర్ట్స్‌ నిర్దేశించుకుంది. కృష్ణపట్నం పోర్ట్‌లో వాటా కొనుగోలు చేయటం ద్వారా ఈ లక్ష్యానికి దగ్గరయ్యే అవకాశం ఉన్నట్లు అదానీ పోర్ట్స్‌ వెల్లడించింది. ప్రస్తుత వాటాదార్ల నుంచి ఈ సంస్థలో వాటా తీసుకున్నట్లు వివరించింది.

‘తూర్పు తీరంలోని కృష్ణపట్నం పోర్టు మౌలిక సదుపాయాల పరంగా ఎంతో మెరుగైన ప్రాజెక్టు. దీన్ని కొనుగోలు చేయడం వల్ల నౌకాశ్రయాల విభాగంలో మా మార్కెట్‌ వాటా 27 శాతానికి పెరుగుతుంది. దేశం మొత్తం మేం విస్తరించినట్లు అవుతుంది’ అని అదానీ పోర్ట్స్‌ సీఈఓ, పూర్తికాలపు డైరెక్టర్‌ అయిన కరణ్‌ అదానీ పేర్కొన్నారు.

కృష్ణపట్నం పోర్టు 2018-19లో 54 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు రవాణాపై, రూ.2,394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ పోర్టు నుంచి ఇంకా అధికంగా సరకు రవాణా నమోదుకు ప్రయత్నిస్తామని కరణ్‌ అదానీ వివరించారు. ధమ్రా, కట్టుపల్లి పోర్టులు తమ చేతికి వచ్చాక, వాటి సామర్థ్యాన్ని బాగా పెంచినట్లు గుర్తు చేశారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే ఏడేళ్లలో 100 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా సాధించాలనేది తమ ఆలోచనగా ఆయన తెలిపారు. అదేవిధంగా నాలుగేళ్లలో లాభాలు రెట్టింపు చేయాలనుకుంటున్నామన్నారు. వాటా కొనుగోలు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందని అదానీ పోర్ట్స్‌ అంచనా వేస్తోంది. దీనికి అవసరమైన నిధులను తాము అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించింది.

(Couresy Eenadu)