ఆసిఫాబాద్‌: కుమురం భీం జిల్లా జోడేఘాట్‌ గ్రామం వద్ద ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మ్యూజియం మూత పడింది. ఆదివాసీ హక్కుల కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన కుమురం భీం త్యాగాలకు గుర్తుగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. స్మృతివనం, యుద్ధభూమి, కుమురం భీం వాడిన ఆయుధాలు, గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు కళ్లకు కట్టేలా అనేక రకాల వస్తువులను ఇందులో ఉంచారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మ్యూజియంలో పనిచేసే క్యూరేటర్‌ వ్యక్తిగత కారణాలతో మానేశారు. వెంటనే ఐటీడీఏ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నేటికి క్యూరేటర్‌, గైడ్‌ల నియామకం జరగకపోవడంతో మ్యూజియం తలుపులు తెరచుకోలేదు. లాక్‌డౌన్‌ సడలింపులతో పర్యాటకులు వస్తున్నా, బయట నుంచి చూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు ఈ నెల 30న కుమురం భీం వర్ధంతిని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

Courtesy Eenadu