దీపావళి గురించి
కదిరె కృష్ణ గారి వ్యాసం
శ్రీ కృష్ణునిచే హత్య చేయబడిన నరకా సురుడు ఎవరు? ఆయన పాలకుడా, దురాక్రమణదారుడా? శ్రీకృష్ణుణ్ణి విష్ణువు అవతారంగా ఆర్య బ్రాహ్మణులు ఎందుకు భావిస్తున్నారు? విష్ణువు అవతారంలోని ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నలను చేధించే ప్రయత్నం చేద్దాం.నరకాసురుడు ప్రాగ్జోత్యిష పురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగిస్తున్న స్థానిక చక్రవర్తి (మూలవాసి). ఆయన సేనాధిపతి మురాసురుడు ఆయన 16వేల రాజ్యాలకు చక్రవర్తి అతని రాజ్యం, రాజధాని శత్రుదుర్భేద్యం. చూడండి అతని రాజ్యాన్ని గురించి భాగవతం ఏమంటుందో?

”గిరిదుర్గై: శస్త్ర దుర్గైర్జ లాగ్యనిల దుర్గమమ్‌/ మురపాశాయుతై ర్ఘోరైర్ధృఢై: సర్వత ఆవృతమ్‌”
(దశమస్కంధం ఉత్తరార్ధం 59వ అద్యాయం 3వ శ్లోకం)

అంటే పగడ్బందీగా తన రాజ్యాన్ని దుర్గాలు, ప్రాకారాలతో నిర్మించుకున్నాడని అర్ధం. ఆయన మూలవాసి చక్రవర్తి అని నిరూపించే శ్లోకం ఇదే అద్యాయంలో ఉంది. ”తథా నిరస్తాన్‌ నరకోధరాసుత” అంటే నరకుడు భూమి పుత్రుడు. భూమి పుత్రుడంటే స్థానిక జాతులకు చెందినవాడని అర్ధం. ఎటువంటి పాలకుడు వైదికమతాన్ని, యజ్ఞయాగాలను తిరస్కరించడమే ఆయన చేసిన నేరం. సకల సంపదలకు నెలవైన (భౌమగృహం ప్రావిశత్‌ సకలర్ధిమత్‌-32వ శ్లోకం) ఆ రాజ్యంలో బ్రాహ్మణాధిక్యత కొరవడడమే ఆయన ప్రాణాలను తీసింది. కుట్రతో అతన్ని మట్టు పెట్టారు. నరకుడు జైనమతస్థుడు. 22వ తీర్ధాంకరుడైన నేమినాధుడే నరకుడని అతడు చాలా అందగాడని జైన మత గ్రంధాలు వివరిస్తున్నాయి. జినసేనుడు రచించిన హరి వంశంలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. ఇతను గొప్ప స్కాలర్‌, భౌతికవాది, నేటి భాషలో కమ్యూనిస్టు, ఒక చక్రవర్తి జైనుడుగా ఉండడం అన్ని కులాలలను సమానంగా చూడడం వైధికార్యులకు నచ్చే విషయం కాదు. అందుకు నరకునిపై యుద్ధానికి పక్కా ప్రణాళిక వేశారు. మొదట సత్యభామను ఇందుకోసం యెంచుకుని ఆమెని రెచ్చగొట్టి స్త్రోత్రాలు పఠించి పొగిడి మొత్తానికి ఒప్పించారు. నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవివని, భూదేవివని, శ్రీ మహావిష్ణువు భార్యవని రకరకాలుగా ఆమెతో మైండ్‌గేమ్‌ ఆడుకున్నారు. కాగలకార్యం తీర్చేది సత్యభామ వంతైంది. అలకపానుపు, శృంగార మందిరం శ్రీకృష్ణున్ని ఇందుకు అంగీకరింపజేశాయి. ప్రశాంతంగా ఉన్న నరకుని రాజ్యాలపై కయ్యానికి కాలు దువ్వాడు ఈ యదువంశ పుంగవుడు. చివరికి నరకుని రాజధానిపై దండెత్తి పురప్రాకారాలను బద్దలుకొట్టించాడు.

”శంఖానేన యంత్రాణి హృదయాని మనస్వినామ్‌ ప్రాకారం గదయా గుర్వ్యా నిర్బిభేద గదాధర:”

అంటూ శ్రీకృష్ణుడు నరకుడు రాజ్యాన్ని ఎలా నాశనం చేశాడో వివరిస్తుంది పై శ్లోకం. శ్రీకృష్ణుడి వాహనం గరుత్మంతుడు అంటే పాములను తినే పెద్ద రాబందు. పాములు అంటే నాగులు. నాగవంశం స్థానిక జాతి ప్రజలది. నరకుని వాహనం ఏనుగు. మాతంగం అంటే ఏనుగు. స్థానిక మాతాంగ చక్రవర్తుల రాజ చిహ్నం ఏనుగు. పాండవులది కపి అంటే కోతి. కాకతీయులది పంది. స్థానిక జాతికి చెందిన జంతువు పంది. ఎరుకల కులస్థులు కాకతీయులు. కాకతీయులు ఒంటరి కులస్థులు. అంటే నేటి ఎరకలి కులస్థులు. ఏరంకా చూసినా నరకుడు స్థానిక మూలవాసి చక్రవర్తి.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేటి శూద్ర, అతిశూద్ర కులాల పితామహుడు. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు మూర్చపోవడంతో సత్యభామ యుద్దం చేసిందని భూదేవి శాపంవల్లే అలా జరిగిందని ఒక కట్టుకథ అల్లిపెట్టి కర్మ సిద్దాంతాన్ని ప్రచారం చేసేందుకు నరకుని హత్యతో తలెత్తే ప్రశ్నలను తెరమీదకి రాకుండా చేసే కుట్రలో భాగంగానే ఇది జరిగింది. నరకున్ని హత్య చేసింది సత్యభామేనా? లేక శ్రీకృష్ణుడా? వ్యాస మహాభాగవతం (మూలం) ఇలా సెలవిస్తోంది. నరకుని సైన్యాన్ని శ్రీకృష్ణుడు అనేకరకాలుగా మట్టుపెట్టగా నరకుడు సింహం వలె గర్జించాడు.

”పురమేవా విశన్నార్తా నరకో యుధ్య యుధ్యత/దృష్ట్యా విద్రావితం సైన్యం గరుడేనార్ధితం స్వకమ్‌”

అనగా యుద్దంలో చివరికి నరకుడు ఒంటరిగా పోరాడసాగినారు అని. ”శూలం భౌమో2 చ్యుతం హంతుమ్‌ అదదే వితథ్యోద్యమ” (21వ శ్లోకం) అంటే శ్రీకృష్ణుని మీదకి నరకుడు శూలాన్ని బలంగా విసిరినాడని భావం. ఆ శూలం ప్రయోగింపకముందే శ్రీకృష్ణుడు నరకుని శిరస్సును పదివేల అంచులు గల తన చక్రాయుధంతో ఖండించాడు. (అపాహరద్గజ స్థస్య చక్రేణ క్షురనేమినా) కర్ణ కుండలములతో, మనోహరమైన కిరీటంతో కాంతులీనుతున్న నరకుని శిరస్సు నేలపాలైంది. (సకుండలం చారుకిరీట భూషణం/బభౌపృథివ్యాం పతితం సముజ్జ్వలత్‌). ఇంకేముంది రాజ్యదురాక్రమణ జరిగిపోయింది. ఋషులు, ఇంద్రాది ఆర్యగణ దేవతలు, బ్రాహ్మణ సమూహాలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంతకీ ఈ మొత్తం తతంగంలో సత్యభామ ఎక్కడా యుద్దంలో పాల్గొన్నట్టు కనిపించదు. నరకున్ని చం పింది నూటికి నూరుపాళ్ళు శ్రీకృష్ణుడే. ఓ స్త్రీ చేత హత్య చేయబడ్డాడనే ప్రచారం చేయడం అతని హత్యలోని నిరుహేతుకతను పక్కదారి పట్టించడానికే. నరకస ంహారం ఆర్యజాతి సామ్రాజ్యవాద దాహర్తి మాత్రమేనని జైన రాజ్యాలకు ఆర్యబ్రాహ్మణ (హిందూ) రాజ్యాలకు మధ్య జరిగిన ఘర్షణ మాత్రమేనని కూడా ఈ ఘటన ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

ఉదా: 16వేల రాచకన్యలను నరకుడు బంధించి హింసించాడని దరిమిలా శ్రీకృష్ణుడు నరకున్ని హత్య చేసి వారిని విడిపించాడని భోగట్ట. అయితే 16వేల మందిని చెర నుండి విడిపించి ఒరగబెట్టిన ఘనకార్యం ఏమంటే స్వయంగా శ్రీకృష్ణుడే వారిని పెళ్లి చేసుకున్నాడు ఇది ఎంత చోద్యమో చూడండి. భాగవతం స్థానిక శూద్రాతి శూద్రుల (బహుజనులు) వ్యతిరేక కావ్యమని చెప్పడానికి ఆ కావ్యంలోని ఈ ఘటనతో పాటు అనేకచోట్ల శూద్రుల గురించి ఎంత అవమానకరంగా చెప్పబడిందో గొడ్డు చాకిరి ఎలా అంటగట్టబడిందో గమనిద్దాం.

భాగవతం సప్తమస్కందం 15వ శ్లోకం ”శూద్రస్య ద్విజ శుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్‌” అంటూ బోధించింది. అంటే శూద్రులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులైన ద్విజులను శ్రద్దగా సేవించాలని అర్ధం. అలాగే ”

శుద్రస్య సన్నతి: శౌచం సేవా స్వామిన్య మాయయా/అమంత్రయజ్ఞో హ్యస్తేయం సత్యం గోవిప్రరక్షణమ్‌” అంటే ద్విజుల యెడ (బ్రాహ్మణులు) భయభక్తులతో మెలుగుతూ వారిమీదికి ఎవరు కన్నెత్తి కూడా చూడకుండా కంటికి రెప్పలా కాపాడలట. ఇలా శూద్రులను అధమజాతివారుగా కేవలం సేవకులుగా చిత్రీకరించిన కావ్యాలను ఎందుకు పూజించాలి. వీళ్ళ సంగతి ఇట్లుంటే అతిశూద్రుల సంగతి మరింత ఘోరం. ”వృత్తి: సంకరజాతీనాం తతత్కులకృతా భవేత్‌/అచౌరాణామపా పానా మంత్య జాంతేవ సాయినామ్‌” అనగా సంకర జాతులు, చండాలురు, అంత్యజులు వారి వారి కులం పరంపరను బట్టి వృత్తి చేపట్టాలట. ఎవరు సంకరజాతులు, వీరి దృష్టి ప్రకారం నరకుడు సంకరజాతి. ఇందుకు మహావిష్ణువు భూదేవికి పుట్టినవాడుగా ఆయనను చిత్రీకరించారు. ఆనాటి జైనమతంలో నేటి బహుజనుల పితామహులు ఎక్కువగా వుండేవారు.

అందువల్ల వారిని నీచులుగా, అంత్యజులుగా వర్ణించేవారు. స్త్రీలను గురించి భాగవతం మహాబాగా సెలవిచ్చింది చూడండి. సమయా నుసారంగా చిన్నా పెద్ద అవసరాలను భర్త వద్ద వినయంతో నెరవేర్చుకోవాలట. ”యా పతిం హరిభావేన భజేత్‌ శ్రీరివ తత్పరా/హర్యాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివమోదతే” అంటే భర్తను సాక్ష్యాత్తు భగవత్‌ స్వరూపుడిగా భావింపవలెను. లక్ష్మీదేవి వలె పతిసేవా పారాయణురాలు కావాలట. అంటే స్త్రీలకు జ్ఞానం, అస్తిత్వం, కీర్తి ప్రతిష్టలు ఏమీ ఉండవా? ఇంత భానిసత్వాన్ని నూరిపోసిన ఈ గ్రంధం స్త్రీ లోకానికి ఎలా పూజనీయమైందో అర్ధం కావడంలేదు. ఇప్పటికైనా స్త్రీలు ఈ బ్రాహ్మణ ఆర్య గ్రంధాల్లో తమను ఎంతగా అణచివేశారో గుర్తిస్తే బాగుంటుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల్లోని పురుషులు తప్ప ఈ లోకంమీద మనుషులెవ్వరు లేరా? ఉన్నా వాళ్ళు మనుషులుగా గుర్తింపబడరా? వీరి కావ్యాల్లో భూతద్దం పెట్టి వెతికినా ఒక్క చోటంటే ఒక్క చోట కూడా గురిగింజంత గౌరవం బహుజన స్త్రీ వర్గాలకు దక్కలేదు. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నా ఈ కావ్యాలు ఎలా పూజార్హత కలవో చెప్పాలి. అడుగడునా అవమానాలను బహుజనులకు అంటగట్టి సౌఖ్యాలను పొందుతూ ఇప్పటికీ ప్రశ్నిస్తే బెదిరిస్తూ, దబాయిస్తున్న ఆర్యబ్రాహ్మణుల తీరు ఎంత బాధాకరం. కనీసం మానవ గుర్తింపును నోచుకోని జాతులపై ఎందుకింత వివక్ష. శ్రామిక జీవులైన ప్రజలపై జాలికి బదులుగా పీడనను రుద్దిన వీళ్ళనేమనాలి?

డా- కదిరే కృష్ణన్న
బహుజన రచయిత ,సామాజిక శాస్త్ర వేత్త