తరలిపోతోందంటూ రాయిటర్స్‌ కథనం
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కియా ఖండన
లోక్‌సభలో చర్చ
అనంతపురం జిల్లాలో ఏర్పాటైన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ కియా మోటార్స్‌ రాష్ట్రం నుండి తరలిపోయేందుకు సిద్ధమౌతోందంటూ ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్‌ ప్రచురించిన వార్తా కథనం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్లాంటును తమిళనాడుకు తరలించేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందన్నది ఈ కథనం సారాంశం. గురువారం ప్రచురితమైన ఈ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కియా సంస్థ కూడా ‘అత్యంత చెత్త ఊహాగానం’ అంటూ తరలింపు కథనాన్ని తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వార్తలపై స్పందించింది. అటువంటి సంప్రదింపులేవి జరగలేవని పేర్కొంది. మరోవైపు అధికారప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజంతా కొనసాగింది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో దీనిని ప్రస్తావించగా, వైసిపి సభ్యులు తోసిపుచ్చారు.

తక్షణమే జోక్యం చేసుకోండి : లోక్‌సభలో టిడిపి
లోక్‌సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన తెలుగుదేశం పార్టీ ఎంపి రామ్మోహన్‌ నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జీరోఅవర్‌లో ఆయన మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రయత్నిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. 1.1 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడితో ఏపిలో నెలకొల్పిన కార్ల తయారీ పరిశ్రమ కియా మోటార్స్‌ ఇప్పుడు ఏపి నుంచి తరలిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల వల్లే ఇదంతా జరుగుతోందని, వీటిని నిలువరించి, ప్రశ్నించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన పదేపదే కోరారు. రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతుండగా, వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ ఆయన వద్దకు దూసుకు వెళ్లి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఒక సమయంలో ఆయన పెద్దపెద్దగా కేకలు వేయడం వినిపించింది.

రికార్డుల నుండి తొలగించండి : వైసిపి
ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతోందంటూ టిడిపి సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుడి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ను వైసిపి డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ తరపున మాట్లాడిన వైసిపి లోక్‌సభ పక్ష నేత మిధున్‌రెడ్డి కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదని, తాను గురువారం ఉదయమే ఆ సంస్థ ఎండితో మాట్లాడానని అన్నారు. . ”చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌ టన్‌ పేరుతో డమ్మీ కంపెనీ రూ. 30 కోట్ల పెట్టుబడికి, రూ.1,000 కోట్ల విలువైన భూములు ఇచ్చింది. ఇది పెద్ద స్కామ్‌ అని, దీని గురించి తాము ప్రశ్నిస్తుంటే , కియా పరిశ్రమ తరలిపోతుందంటూ టిడిపి దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంట్‌ ఆవరణంలో మీడియాతో మాట్లాడిన వైసిపి పార్లమెటరీ పక్షనేత విజయసాయిరెడ్డి కియా మోటార్స్‌ విషయంలో చంద్రబాబు నాయుడు కృషి ఏమాత్రం లేదని పేర్కొన్నారు. ఆ సంస్థ అడిగిన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అలాగే కియా సంస్థ మరింత విస్తరిస్తుందని తెలిపారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు.

పరిశ్రమలు తరలిపోతే ఉపాధి ఎలా? : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయేలా చేస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపడతాయని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కియా సంస్థ బహుముఖంగా తన ప్లాంట్‌ విస్తరిస్తుంది అనుకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. విశాఖలోని మిలీనియం టవర్స్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ సంస్థలను ఖాళీ చేయించడం ఆ రంగం ఇకపై ఎపి వైపు చూడకుండా చేయడమేనన్నారు. ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకుండా, నిరుత్సాహ పరిస్థితులు సృష్టిస్తే ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో పేపరు పరిశ్రమ స్థాపనకు ఒప్పందం చేసుకున్న ఏషియన్‌ పేపర్స్‌ అండ్‌ పల్స్‌ పరిశ్రమ మహారాష్ట్రకు తరలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, రావాల్సిన పరిశ్రమలు తరలిపోతుంటే ఎపి ఏ విధంగా పారిశ్రామికాభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నించారు. ప్రణాళికలేని ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.

అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు : బుగ్గన
కియా కార్ల సంస్థ రాష్ట్రం నురచి తరలిపోతోరదంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రచారాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతురదని చెప్పారు. 14వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకారం అరదిస్తున్నామని చెప్పారు. కియా యాజమాన్యం కూడా సంతృప్తిగా ఉరదన్నారు. వాస్తవానికి అనుకున్నదానికంటే ఎక్కువగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, ఐఇఎం నివేదిక మేరకు 2019 అక్టోబర్‌ వరకు 15,953 కోట్లు పెట్టుబడులు వస్తాయనుకుంటే 32 వేల కోట్ల వరకు వచ్చాయని గుర్తు చేశారు. తాము ఐపిఐఐసి ద్వారా 1252 సంస్థలకు 1057 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకోసం కేటాయిరపులు చేశామని, బిర్లా గ్రూప్‌కు చెరదిన గ్రాసిమ్‌, స్మార్ట్‌కెమ్‌ టెక్నాలజీస్‌, ఎటిసి టైర్స్‌, సిఆర్‌ఆర్‌ కార్పొరేషన్‌ ఫర్‌ మెట్రో కోచెస్‌, హ్యురడారు,పాస్కోస్టీల్స్‌ వంటి సంస్థలు మురదుకొచ్చాయని ఆయన వివరిరచారు. కాగా గత ప్రభుత్వం పారిశ్రామిక పోత్సాహకాలుగా ఇవ్వాల్సిన 3500 కోట్లు చెల్లిరచలేదని, దీనిని బట్టే గత ప్రభుత్వానికి పరిశ్రమలపై శ్రద్ధ లేదన్నదిస్పష్టమవుతోరదని వ్యాఖ్యానిరచారు. కేంద్రం నురచి రావాల్సిన నిధులు తగ్గుతున్నాయని, జనాభా నియంత్రణ పాటిరచడం వల్ల ఈ సమస్య కనిపిస్తోరదన్నారు.

సిఎం సమాధానం చెప్పాలి : చంద్రబాబు
కియా మోటార్స్‌ రాష్ట్రం నుండి వెళ్ళిపోతున్నట్లు వచ్చిన వార్తలపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన రూ.13,500 కోట్ల పెట్టుబడితో 18 వేల మందికి ఉపాధి కల్పించి, ఏడాదికి 3 లక్షల కార్ల తయారీ లక్ష్యంగా ఉన్న కియా పరిశ్రమను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యానికి గురిచేస్తోందని ఆరోపించారు. ‘కియా వల్ల రూ.20 వేల కోట్లు భారం. ప్రోత్సాహకాలు ఇవ్వం. పరిశ్రమను మళ్లీ సమీక్షిస్తాం’ అని ఒక మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కియా పరిశ్రమకు భూములివ్వొద్దని రైతులను జగన్‌ రెచ్చగొట్టినా విజ్ఞతతో ఆలోచించి భూములిచ్చారన్నారు. దావోస్‌లో ఎపికి మంచి పేరు ఉండేదని, ఎపిలో పెట్టుబడులకు ముందుండేవారని, ఇప్పుడు దావోస్‌లో ఎపి పేరు కూడా వినబడడంలేదని అన్నారు. కాండ్యూయెంట్‌ కంపెనీ, మిలీనియం టవర్లను విశాఖలో తొలగించి, సెక్రటేరియట్‌ను పెట్టడం సబబా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. వైసిపి ఎంపిలు, నాయకులు వీధి రౌడీల్లా బెదిరిస్తే మల్టీ నేషనల్‌ కంపెనీ ఏదీ ఎపిలో ఉండదని అన్నారు. . అదాని డేటా సెంటర్‌ రూ.70 వేల కోట్లు, లులూ కన్వెన్షన్‌ సెంటర్‌ రూ.3 వేల కోట్లు, ఆసియా పేపర్‌ మిల్స్‌ రూ.25 వేల కోట్లు, సింగపూర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.50 వేల కోట్లు, 130 సంస్థలకు ఇచ్చిన భూముల్లో వచ్చే రూ.45 వేల కోట్లు పెట్టుబడులు అన్నీ పోగొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పరిశ్రమలు లేకుంటే ఆర్థిక వ్యవస్థ కుదేలు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాష్ట్రంలో పరిశ్రమలు లేకుంటే ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కియా పరిశ్రమ రాష్ట్రం నుండి తరలిపోతుందంటూ ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్‌ ప్రచురించిన కథనంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని, ఇదే కొనసాగితే ఇప్పటికే వేళ్లూనుకుపోయిన నిరుద్యోగ రక్కసి భవిష్యత్తులో మరింత విజృంభించే అవకాశం ఏర్పడుతుందని తెలి పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తగు విధంగా బాటలు వేయాలని కోరారు.

రాయిటర్స్‌ ఏం రాసింది ?
కియా పరిశ్రమ కిచ్చిన రాయితీలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమీక్షిస్తోందని రాయిటర్స్‌ తాజా కథనంలో పేర్కొంది. స్థానికంగా బెదిరిం పులు వస్తున్నాయంటూ ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకువెళ్లినా ఫలితం లేదని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన కూడా కంపెనీకి ఇబ్బందిగా మారిందని, ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని తెలిపింది. దీంతో ఉలికిపడిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ పేర్కొన్నారు.

Courtesy Prajashakthi