Khel Khatham Dhukan Bandh

ఒక చిన్న కుటుంబం. భార్య, భర్త కూలి పని చేసుకుని బతికే వాళ్ళు. చిన్న గుడిసె తప్ప వారసత్వంగా వచ్చిన భూమి ఏమీ లేదు. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. పేరు రాజు అని పెట్టుకున్నారు. వాడ్ని మాత్రం చదివించాలని చెప్పి బడికి పంపే వాళ్ళు. భార్యకు ఏదో రోగం వచ్చి ఒళ్లంతా పీక్కుపోయి ఎముకల గూడు మాత్రం మిగిలిపోయింది. అప్పడప్పుడూ వచ్చి పలకరించి పోయే ఇద్దరు ముగ్గురు బంధువులు కూడా వాళ్ళ ఇంటికి రావడం మానేసారు. ఒకరోజు ఆ ఎముకల గూడు కూలిపోయింది. చదువు, లోకజ్ఞానం లేని భర్త దిక్కు లేని వాడు అయిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు విని, కొడుకుని అనాథ హాస్టల్లో చేర్పించి, ఒక్కడే గ్రామంలో ఉంటున్నాడు. తల్లికోసం వెతుకుతూ వెతుకుతూ అడవి నుంచి బయటకొచ్చి తప్పిపోయిన జింకపిల్లలా అయిపోయిందతని పరిస్థితి. కష్టం చేతనవుతలేదు. తిండి సరిగా తినాలనిపించట్లేదు. తీవ్రమైన డిప్రెషన్ కి లోను అవుతుండేవాడు. అతని మెదడు చచ్చిపోయింది. అది ఆలోచనలను చేయలేదు. ఒకరోజు ఉరిపోసుకుని చచ్చిపోవాలి అనుకున్నాడు. పాపం! ఇంట్లోకి వెళ్తే తలకు తాకే వెనుకర్ర ఉన్న గుడిసె, ఎలా ఉరిపోసుకుంటావని వెక్కిరించింది. గుడిసెను తగలపెట్టాడు. అదే అతని చివరి విజయం. ఊర్లో వాళ్ళంత అతని శవానికి సహాయం చేసారు.

ఈ విషయాన్ని ఎవరో వార్డెనికి తెలియజేస్తే, అతను వాళ్ళ కొడుకు ని గ్రామం తీసుకొచ్చి, వాడి పరిస్థితిని చూపించి మళ్లీ హాస్టల్ కి తీసుకెళ్లి, ఇక నీవు ఇక్కడే బతకాలని చెప్పాడు. అతనికి అక్కడ ఉండాలన్పించలేదు కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. ఈ ప్రభావాలన్నీ మెదడు మోయలేకపోయింది. చదువుకూ, భవిష్యత్తుకూ సహకరించనని మొండికేసింది. కొద్ది రోజులయ్యాక బయటపడ్డాడు.

కొన్నాళ్ళు హోటల్లో పని చేశాడు. అక్కడ కూడా చేయాలన్పించక బయటకి వచ్చాడు. కానీ ఈ సారీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అది బాగా ఎండా కాలం. సూర్యుడు చుట్టుపక్కన నీటిని మొత్తం మింగేస్తూ, నోరు వాయి లేని పశువులను పక్షులను చంపుతూ ఇక అవకాశం వస్తే దిక్కులేని పేదవాడిని మింగడానికి ఎదురుచూస్తున్న రోజులు అవి. నిరాశతో ఉన్నా రోడ్డు పైన ఇద్దరు ముగ్గురిని పని అడిగాడు. వాళ్లు లేదన్నారు. వాళ్లకు తన పరిస్థితి చెప్పుకోవాలి అనిపించలేదు. నిరాశ తృప్తి చెందింది. ఉన్న శక్తినంతా కూడదీసుకుని గమ్యం లేకుండా అలా నడుచుకుంటూ వెళ్లి ఒక దగ్గర కూర్చున్నాడు.
చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలో తనకి అర్ధం అయితలేదు. చాలా దాహంతో ఉన్నాడు. చుట్టుపక్కల చూసాడు ఎక్కడైనా నీరు దొరుకుతుందేమోనని, ఎక్కడా కనిపించలేదు. కొంచెం దూరంగా ఎవరో పెళ్లి చేసుకున్నట్లు ఉన్నారు. అక్కడ నుండి ఒక ప్లాస్టిక్ గ్లాస్ కొట్టుకొచ్చి పలకరించింది. అది తీసుకుని అలాగే ముందుకు వెళ్లి ఒక మోరి కాలువలోని పైపై నీళ్లు ముంచుకొని తాగాడు. అలా కాసేపు అక్కడే కూర్చుని, కడుపులో పిసికినట్లు అనిపిస్తే, అక్కడి నుండి లేచి కొంత దూరం నడిచి, ఒక బస్ షెల్టర్ లో పడుకున్నాడు. మధ్య మధ్యలో కళ్ళు తెరిచి రకరకాల ప్రయాణికులను చూస్తూ తన ప్రయాణాన్ని ముగించాడు.

  • – Salvadi Govardhan