బాలికపై పెద్దమనుషుల రాక్షసత్వం
అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన

తెలిసీతెలియని వయసు.. ఇద్దరు మైనర్లు ప్రేమించుకుంటారు. పెద్దలు తమ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని గ్రహిస్తారు. ఇద్దరూ కూడబలుక్కొని ఊరొదిలి పరారవుతారు. ఇది తెలిసి అయినవారు ఆగ్రహోదగ్రులవుతారు.. వారిని వెంటాడి, వేటాడి ఊళ్లోకి పట్టుకొస్తారు.. ప్రేమించిన పాపానికి వారిరువురిని ఈడ్చుకొచ్చి, గ్రామం నడిబొడ్డున పంచాయతీ పెడతారు.. అంతా చూస్తుండగానే చిత్రవధ చేస్తారు.. ఇలాంటి దృశ్యాలు మనం చూస్తుంటాం.. కానీ, అవి సినిమాల్లో.. అచ్చంగా ఈ తరహా అమానవీయ ఘటనే అనంతపురం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. కాస్త ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది.  గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు పది రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు.  ఇరువురి తల్లిదండ్రులు వారిని స్వగ్రామానికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడ పెద్దల మాట విననందుకు మైనర్‌ బాలికపై గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప విరుచుకుపడ్డాడు. ఇష్టారాజ్యంగా చెంపదెబ్బలు కొట్టాడు.. పదేపదే కాలితో కర్కశంగా తన్నాడు.. పక్కనే ఉన్న కర్రతో పశువును బాదినట్లు చావబాదాడు. అక్కడ సుమారు వంద మందికి పైగా ఉన్నా.. ఆ దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ ఆపటానికి ప్రయత్నించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమ గ్రూపుల్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ వైరల్‌గా మారింది. బాలికను అంత రాక్షసంగా కొట్టిన దృశ్యం చూసిన వారంతా అయ్యో పాపం! అంటున్నారు. దీనిపై డీఎస్పీ ఎం.వెంకటరమణను వివరణ కోరగా ఆ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అబ్బాయి దగ్గరి బంధువుతో మాట్లాడగా.. ప్రేమికులిద్దరూ అన్నదమ్ముల పిల్లలని తల్లిదండ్రులే ఈ విషయాన్ని ఊరి పెద్దలకు చెప్పారని వివరించారు.

బాలికపై రాక్షసత్వం..గ్రామపెద్దపై కేసు

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేపీదొడ్డిలో మైనర్లను చితకబాదిన గ్రామపెద్ద లింగప్పపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను ప్రేమించిన బాలుడి పైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లింగప్పను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మైనర్లు ప్రేమించుకున్నారని ఆరోపిస్తూ.. వారిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేయడం సామాజిక మాద్యమాల్లో శుక్రవారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్‌ వెంకటచలపతి, సీఐ రాజులు కలిసి బాధిత మైనర్‌ బాలిక ఇంటివద్ద విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. మైనర్‌ బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మరోవైపు బాధితురాలికి న్యాయం జరగాలంటూ శనివారం ఉదయం నుంచి వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై ఇలాంటి హేయమైన చర్య చేపట్టినవారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

(Courtacy Eenadu)