Image result for Khairlanji, police neglected Dalit victims"రంగనాయకమ్మ
– 4 –
ఆ నీచక్రూరుల చేతుల్లో ఆ అనాధలు ఇంకెక్కడున్నారు? నలుగురూ ఎప్పుడో ఊపిర్లు వదిలేశారు. ఆడవాళ్లు చచ్చిపోయారని తెలిసిన తర్వాత కూడా, ఆ తాగుబోతులందరూ, ఆ దేహాల్ని వదల్లేదు. ఆ నిర్జీవ దేహాలమీదే తమ క్రూరత్వాలు సాగించారు. ఆ చర్యలతో, ఆ పెద్దకులాల వారి క్రోధాలు తీరడానికి 2 గంటల కాలం సరిపోలేదు. వాళ్ల క్రోధాలు తీరిపోవడం జరగలేదు. ఆ దేహాల్ని ఇంకా ఇంకా పీడిస్తూ, ఛిద్రం చేయడం, వాళ్లకి ముచ్చటే. కానీ, ఆ శవాల్ని తొందరగా మాయం చెయ్యాలి! మొదట పన్నిన పథకం ప్రకారమే, ఒక ఎడ్లబండి అక్కడికొచ్చింది. నాలుగు శవాల్నీ ఆ బండిలో పడేశారు. ఆ బండి, నాలుగు కిలో మీటర్ల దూరంలో వున్న కాల్వ దగ్గిరికి నడిచిది. ఆ శవాల్ని కాలవలోకి విసిరేశారు. బండి మనిషి, తన దారిన తను బండిని తోలుకుపోయాడు.
తన ఇంటి దగ్గిర లేని మాంగే సంగతి ఏమిటి? ఈ గ్రామం చిన్నదే కాబట్టి, పొలాలు, ఇళ్లకి కొంత దగ్గిరిగానే ఉంటాయి. పొలంలో పని చేసుకుంటున్న మాంగేకి, ఊళ్లో నించి ఏవో కేకలు వినపడ్డాయి. పని ఆపి, ఊరు వేపు వెళ్తూ చూస్తే, తమ పాక దగ్గిరే ట్రాక్టర్లూ, చాలామంది జనమూ కనపడ్డారు! ”బోట్‌ మాంగే ఏడీ! వాణ్ణి తన్నండి! కొట్టండి!” అనే కేకలు వినపడ్డాయి. తన భార్యా బిడ్డలు ఏమయ్యారో మాంగేకి తెలియదు. ఒక చెట్టు వెనక నిలబడి కొంత సేపు విన్నాడు. ఆ జనం, తన కోసమే వెతుకుతున్నట్టు అర్ధమైంది. సురేఖా, పిల్లలూ, ఎటో తప్పించుకు పోయి ఉంటారనుకున్నాడు. తమ పాక ముందు, ఒక బీజేపీ నాయకుడి ట్రాక్టర్‌ ఉన్నట్టు చూశాడు. దుసాల వేపు పరుగు తీసి, సిద్దార్ధ దగ్గిరికి వెళ్లాడు. తను విన్న కేకలూ అవీ చెప్పాడు, భయపడి పోతూ.
సిద్దార్ధ వెంటనే ఒక పోలీస్‌ స్టేషన్‌కి ఫోన్‌ చేసి, ఖైర్లాంజీలో మాంగే ఇంటి ముందు ఏదో దాడి జరుగుతున్నట్టుందనీ, పోలీసులు వెంటనే అటు వెళ్లాలనీ, ప్రాధేయపడ్డాడు. మళ్లీ మళ్లీ చెప్పాడు. సిద్దార్ధతో ఫోన్‌లో మాట్లాడిన కానిస్టేబుల్‌ పేరు రాజ్‌కుమార్‌ దొంగారే. పోలీసు పటేల్‌ చెప్పినా, ఆ తర్వాత, ఆ పోలీసుల చర్యలేవీ జరగలేదు. ఆ సాయంత్రమే, దుసాలలో వున్న రాజేంద్ర, సురేఖ నంబర్‌కి ఫోన్‌ చేసినప్పుడు, ఆ ఫోన్‌ మోగడం అయితే జరిగింది. దాన్ని ఎవరు తెరిచారో రాజేంద్రకి తెలియలేదు. కానీ, అక్కడ పెద్దపెద్ద కేకలతో అల్లరి జరగడం ఒక్క క్షణం వినపడింది. రాజేంద్ర, ఖైర్లాంజీ వేపు పరిగెత్తి, మాంగే ఇంటి ముందు జనాల గుంపుల్ని చాలా దూరం నించి చూశాడు. పరుగున దుసాల వచ్చి, ఆ సంగతిని తన అన్నకి చెప్పడం తప్ప, ఇంకేమీ చేయలేకపోయాడు. నాలుగు శవాలతో ఎద్దు బండి వెళ్లిపోయాక, మాంగే పాక దగ్గిర కొంత మూక, దాడి గుర్తులేవీ బైట పడకుండా నేలని తుడిచి, సర్దుళ్లన్నీ చేశారు.
ఆ మూకలో కొందరు నాయకులు, ఆ మూకకందరికీ ఒక హెచ్చరిక చేశారు. ‘రేపటి నించీ, ఈ ఊళ్లో ఏం జరిగిందని అడగటానికి పోలీసులు వస్తారు. పత్రికల వాళ్లు రావచ్చు. ఇంకా ఎవరైనా రావచ్చు. మనలో ఎవ్వరూ ఏదీ చెప్పకూడదు. ‘మాకేం తెలీదు, మేమేదీ చూడలేదు’ అని చెప్పాలి” అని చాలా చెప్పారు. ఆ గ్రామంలో, ఆ దాడికి కొందరు వ్యతిరేకులు ఉన్నప్పటికీ, వాళ్లు అతి తక్కువ మంది! వాళ్లు నోళ్లు తెరవలేకపోయారు. ఆ మర్నాటి నించీ, మరాఠీ పత్రికల్లో ఒక వార్త బైటపడింది. మాంగే భార్య సురేఖ, పోలీస్‌ పటేల్‌ అయిన సిద్దార్ధతో అక్రమ సంబంధంతో గడపడం వల్ల, ఆ గ్రామంలో నీతిపరులు, ఆ అక్రమాన్ని సహించలేక, ఆ అవినీతి పరులకు బుద్ధి చెప్పారు. – ఇదీ, పత్రికల్లో వార్త!
కానీ, కొన్ని రోజుల తర్వాత అసలు సమాచారం బైటపడింది. స్థానిక మరాఠీ పత్రిక, తన ప్రత్యేక సంచికలో, అసలు సమాచారాన్ని కొంత వరకూ రాసింది. ఆ హత్యల్ని చూసిన వారు రహస్యంగా చెప్పిన వివరాల్ని బట్టి, ఆ సమాచారాన్ని రాయగలి గింది. మహారాష్ట్రలో ఒక షెడ్యూల్డ్‌ కులానికి చెందిన భగవాన్‌ ధవానే అనే వృద్ధుడు, ఖైర్లాంజీలో, పంచాయతీ కార్యాలయం ముందు వున్న ఇంటిలోనే నివసిస్తాడు. ఈయన, ప్రత్యక్ష సాక్షిగా, ఆ దాడి చేసిన కొందరు ఓబీసీ ఆడవాళ్ల పేర్లు చెప్పేశాడు. వాళ్లు, తారా ధాండే, సునీతా ధాండే, చందా అతిలేకర్‌. – ఈ విధగా, చాలా పేర్లు చెప్పాడు. ఆ వృద్ధుడు, ఆ దాడిని, ఆ సమీపంలోనే ఒకరి ఇంట్లో దాక్కుని స్పష్టంగా చూడడం వల్ల అదంతా చెప్పగలిగాడు. ఆ దాడిని అడ్డు కోవాలని కూడా ఒకరిద్దరితో మాట్లాడాడు గానీ, ఆ తాగుబోతు మూకని అడ్డుకోవడం సాధ్యం కాదని, కొందరు సానుభూతిపరులు కూడా దానికి సాహసించలేక పోయారు.
పోలీసుల పాత్ర (పేజీ 36)
(పోలీసులు, ఎక్కడికక్కడ, ఎంత లంచగొండి తనంతో ప్రవర్తించారో చెప్పే సంఘటనలు అనేకం ఉన్నాయి, ఈ పుస్తకంలో. అవన్నీ ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు. అసలు పుస్తకమే చదువుకోవాలి.) ఖైర్లాంజీలో, ఆ క్రూర సంఘటనలు జరిగిన రాత్రి, మాంగే భార్యా బిడ్డలు ఏమైపోయారో, సిద్దార్ధా వాళ్లకి తెలియలేదు. సిద్దార్ధ, తన కొడుకైన రాహుల్‌ని, మాంగేకి సహాయంగా ఇచ్చి, మాంగేని, పోలీసులకు ఫిర్యాదు చెయ్యమని పంపించాడు. రాహుల్‌ మోటార్‌ సైకిల్‌ మీద మాంగే, పోలీసు స్టేషన్‌కి వెళ్లాడు గానీ, అక్కడ ఫిర్యాదు చెయ్యలేదు. ఎందుకంటే, అక్కడ పోలీసు అధికారి భవానే ఉన్నాడు. ఆ అధికారికి లంచం ఇస్తానని, గతంలో మాంగే అన్నాడు గానీ, ఆ లంచం ఇవ్వలేకపోయాడు. ఆ అధికారి గతంలో, మాంగేతో, ‘నువ్వు ఇస్తానన్నది ఇవ్వకపోతే, ఇంకెప్పుడూ నీ ఫిర్యాదులు తీసుకోను’ అని చెప్పి ఉన్నాడు. ఆ అధికారే ఆ సమయంలో ఉన్నాడు కాబట్టి, మాంగే ఇక ‘భార్యా బిడ్డలు కనపడడం లేదు’అని అక్కడ ఫిర్యాదు చెయ్యకుండా వెనక్కి తిరిగాడు. ఫిర్యాదు చెయ్యాలంటే, పాత లంచమూ, కొత్త లంచమూ, రెండూ తక్షణం ఇవ్వాలి. అది చెయ్యలేడు. తిరిగి సిద్దార్ధ దగ్గిరికే చేరాడు మాంగే. ప్రతి రాత్రీ ఆ సమయంలో, మాంగే, భార్యా బిడ్డలతో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటాడు. కానీ, ఈ రాత్రి, భోజనాల సమయంలో, తల్లీ, ముగ్గురు పిల్లలూ, కాలవ ప్రవాహంలో, కొట్టుకుపోతూ తిరుగుతున్నారు! ‘వాళ్లెక్కడో క్షేమంగానే ఉండి వుంటారు’ అనే నమ్మకం ఉన్నా, ఆ రాత్రంతా మాంగే తీవ్రాందోళనతోనే గడిపాడు. ఆ సంఘటనలన్నీ జరిగింది 2006 సెప్టెంబరు 29న.
తెల్లారిన వెంటనే, మాంగే, రాహుల్‌తో కలిసి తన పాకకి వెళ్లాడు. ఏముంది అక్కడీ ఆ పాక అంతా చిందర వందరగా, బీభత్సంగా కనిపించింది. వంట జరిగే చోట, కోసిన కూరగాయల ముక్కలు చెల్లా చెదురుగా కనిపించాయి. ఇంకో చోట పిల్లల పుస్తకాలు తెరిచినవి తెరిచినట్టే నేల మీద ఎగిరిపోతూ కనిపించాయి. ఇక అక్కడ నిలబడలేక, పొరుగూళ్లో వున్న బావ మరుదుల ఇంటికి వెళ్లాడు. తన వాళ్లు అక్కడ ఉంటారని. అక్కడ ఏ జవాబూ దొరకలేదు. ఆ బంధువులందరికీ, సురేఖా వాళ్లూ కనపడడం లేదన్నది, కొత్త సమాచారం. ఇక అప్పుడు అందరూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లక తప్పలేదు. అక్కడ పోలీసులు, మాంగే నించి ఫిర్యాదు తీసుకోకుండా, ఒక నేరస్తుడితో ప్రవర్తించినట్టు, మాంగేని 2 గంటల సేపు అక్కడే కూర్చోబెట్టారు. ఆ పోలీస్‌ స్టేషన్‌ అధికారి, మాంగే మీద లంచాలు ఇవ్వలేదనే కోపంతో వున్నవాడే. ఆ అధికారి, పోలీస్‌ స్టేషన్‌లో వున్న కానిస్టేబుల్‌కి ఫోన్‌ చేసి, ఒక వార్త చెప్పాడు, ఈ విధంగా: వాదేగావ్‌ శివార్లలో ఉన్న కాలవలో ఒ క శవం దొరికింది. దానికి ఒక చేతి మీద ‘ప్రియాంక’ అనే పచ్చబొట్టు వుంది. స్టేషన్‌లో వున్న మాంగే, ఆ శవాన్ని పోల్చాలి. అతన్ని, మెహది ఆస్పత్రికి తీసుకురండి’ అంటూ, ఆ అధికారి పోలీసుల్ని ఆదేశించాడు. ఆ ఆస్పత్రికి చేరిన మాంగే, ఆ శవాన్ని చూసి, తన కూతురే అని, అర్థం చేసుకున్నాడు. ఆ శవం పూర్తిగా నగంగా వుంది! ఒళ్లంతా దెబ్బలతో ఛిద్రమై పోయి వుంది. ఒక చేతి మీద ‘ప్రియాంక’ అనే పేరు ఉండడం వల్ల, మాంగే, ఆ శవాన్ని తన కూతురుగానే పోల్చాడు. అప్పుడు, 10 గంటలకి పోలీసు రిపోర్టు తయారైంది. ‘ఒక దళిత యువతిని, ఎవరో కులం పేరుతో దూషించి ఉంటారు’ అని మాత్రమే ఆ రిపోర్టు! ‘ఎవరో హత్య చేసి ఉంటారు’ అని కాదు! ‘ఎవరో దూషించారు’ అటే, ఆమె ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుంది.. అని, కోర్టులో వాదించి హతకులు తప్పించుకోవడానికి వీలుగా అలా రాశారు పోలీసులు. ఆ శవానికి పరీక్ష కూడా నామమాత్రం గా జరిగింది. తర్వాత, ఆ శవాన్ని తండ్రికి అప్పగించి ‘వెంటనే ఖననం చెయ్యాలి’ అని పోలీసులు ఒత్తిడి చేశారు. ఆ శవాన్ని, మేనమామలు ఉండే దుల్‌గావ్‌ గ్రామంలో ఖననం చేశారు. కిందటి రోజు అదే సమయలో, ప్రియాంక, మంచి నీళ్ల కోసం, బావి దగ్గిరికి వెళ్తే, అక్కడ, ‘మాంగే కుటుంబాన్ని హతమారుస్తాం’ అనే వార్త విని భయంతో ఇంటికి పరుగున వచ్చింది. ఇప్పుడు, భూమిలో భయం లేకుండా, నిద్రపోతోంది.
ఆ మర్నాడు, అదే కాలవలో అదే చోట, మరో 3 శవాలు దొరికాయని పోలీసులు ప్రకటించారు. మాంగే, తన బావ మరుదులతో కలిసి, ఆ 3 నిర్జీవ దేహాల్నీ కూడా చూశాడు. అతను, ఇటూ అటూ చూస్తున్నా డు, నడుస్తున్నాడు. కానీ, ఏం చూస్తున్నాడో, ఎందుకు నడుస్తున్నాడో, తెలియకుండానే ఆ పనులు చేసుతన్నాడు. అతనికి మతి లేదు. మాంగే చేతుల్ని బావ మరుదులు పట్టుకుని నడిపిస్తున్నారు. మాంగే, కళ్ల ముందు పడి వున్న 3 దేహాలు నిర్జీవులై ఉన్ట్టే, నడిచే మాంగే కూడా నిర్జీవుడిగానే, కేవలం భార్యాబిడ్డల్ని చూడడం తప్ప, ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోయాడు. సురేఖ దేహం మీద, పీలికలైపోయిన జాకెట్‌, లంగా, ఉన్నాయి. అవి అయినా, అస్తవ్యస్తంగా. తల, నుజ్జునుజ్జుగా, మెదడు బైటికి వాలిపోయి! రోషన్‌ ఒంటి మీద బనీను మాత్రమే చింపిరిగా వుండి, వృషణాలు వాచిపోయి, పగిలిపోయి వున్నాయి. సుధీర్‌ శరీరం మీద డ్రాయర్‌ మాత్రమే వుంది. పురుషాంగాల్ని, దెబ్బలతో నాశనం చేసేసిన తర్వాత కూడా డ్రాయర్‌ ఉందంటే, నిర్జీవ దేహాలకే ఆ చింపిరైన బట్టని ఎక్కించి ఉంటారని అర్థం. ఆ బట్ట, పురుషాంగానికి అడ్డంగా వుంటే, లోపలి విషయం బైటికి కనపడదని, ఆ డ్రాయర్ని ఎక్కించి ఉంటారు. మృతదేహాల నిండా బలమైన గాయాలే! ఆ దేహాల్ని మెహదా ఆస్పత్రికి ట్రాక్టర్‌తో తీసుకొచ్చి శవ పరీక్షలు జరిపి (ఈ పరీక్షలు మోసంగా జరిగినవే), అదే రోజు రాత్రి, 11 గంటలకు దులేగాంవ్‌లో ఖననం, ఒకేచోట, చేసేశారు.
శవ పరీక్షలు ఎలా జరిగాయంటే..
ప్రియాంక దేహాన్ని పరీక్ష చేయబోయిన సీనియర్‌ డాక్టర్‌ మనీష్‌, తనకు ఎవరి ద్వారానో దొంగ ఫోన్‌ చేయించుకుని, ‘నేను, ఒక పేషెంట్‌ని చూడాలి’ అనే సాకుతో శవ పరీక్ష చెయ్యకుండా వెళ్లిపోయింది. ఎందుకు అలా తప్పించుకుందంటే, ఆ శవ పరీక్ష ఆమే చెయ్యాలంటే, ఆమె సీనియర్‌ డాక్టర్‌ కాబట్టి, ఆ పరీక్షని సరైన పద్ధతిలోనే చేసినట్టు చూపించాలి. స్త్రీలకు శవ పరీక్షలో, గర్భ సంచిని తీసి వుంచాలి. దాని మీద ఇంకా కొన్ని పరీక్షలు జరగాలి. సీనియర్‌ డాక్టరైన మనిషే, సరైన పరీక్షలు చేసినట్టు కనపడకపోతే, రేపు కోర్టులో, సంజాయిషీ చెప్పుకోవలిసి వస్తుంది. అందుకని, తను ఆ పరీక్షలు ప్రారంభించకుండా ఆ పనిని, జూనియర్‌ డాక్టర్‌కి అప్పగించేసి, తను ఒక మామూలు పేషెంట్‌ని చూడ్డానికి వెళ్లిపోయింది.
(ఇంకా ఉంది)
(Courtesy Nava Telangana)