ముస్లిం మహిళలపై బీజేపీ నేతల వ్యంగ్యాస్త్రాలు
సర్వత్రా విమర్శల వెల్లువ

న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ప్రతిపాదిత నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్నార్సీ), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌)లతో మోడీ సర్కారు ఇప్పటికే దేశప్రజల్లో, మరీ ముఖ్యంగా ముస్లింల్లో అనేక భయాందోళనలను సృష్టించింది. ఇప్పుడు బీజేపీ కర్నాటక శాఖ కూడా అదే బాటలో పయనిస్తున్నది. ఎన్పీఆర్‌ సర్వేపై ముస్లిం సమాజంలో మరిన్ని భయాలు ఉత్పన్నమయ్యేలా బీజేపీ కర్నాటక శాఖ సామాజిక మాధ్యమంలో ట్వీట్‌లు చేసింది. ఈ మేరకు శనివారం ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా క్యూ లైన్లలో నిలబడి ఓటరు కార్డులను చూపిస్తున్న ముస్లిం మహిళల వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ఆ పార్టీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో వ్యంగ్యంగా కామెంట్‌ పెట్టింది. ‘పత్రాలను భద్రంగా ఉంచుకోండి.. ఎన్పీఆర్‌ కోసం వాటిని తిరిగి చూపించాల్సి ఉంటుంది’ అంటూ రాసుకొచ్చింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ ఈ విధమైన ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా, బీజేపీ దేశంలోని ప్రజల్లో విభజన తెచ్చి ముస్లింలను భయపెడుతోందని తాజా ట్వీట్‌పై సామాజిక, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాహీన్‌బాగ్‌లో దాదాపు 50 రోజుల నుంచి నిరసనలు చేస్తున్న మహిళలు.. ‘మా పౌరసత్వ నిరూపణ కోసం ఎలాంటి పత్రాలూ చూపం’ అంటూ చేసే నినాదాలు తరచూ వినబడుతున్నాయి.

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఎన్పీఆర్‌ ప్రక్రియను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు నిర్వహించడానికి మోడీ సర్కారు యత్నిస్తున్నది. అయితే ఎన్పీఆర్‌.. ఎన్నార్సీకి తొలి మెట్టు అని రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు ఎన్పీఆర్‌ సంబంధిత ప్రక్రియను కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు నిలిపివేశాయి. కాంగ్రెస్‌ పాలిత ఐదు రాష్ట్రాలు సైతం ఇదే బాటలో నడవడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రతిపాదిత ఎన్నార్సీని దేశవ్యాప్తంగా చేపడతామంటూ కేంద్ర హౌంమంత్రి స్థాయి హౌదాలో అమిత్‌ షా.. అసలు ఎన్నార్సీపై ఇప్పటి వరకు తాము చర్చించనే లేదని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో దేశప్రజలు అయోమయానికి గురైన విషయం తెలిసిందే.

స్కూల్‌ చిన్నారులను ప్రశ్నించడం తప్పే:బీదర్‌ పోలీసుల తీరుపై కర్నాటక బాలల హక్కుల కమిటీ
సీఏఏపై దేశద్రోహం కేసులో స్కూల్‌ చిన్నారులను పోలీసులు ప్రశ్నించడాన్ని కర్నాటక బాలల హక్కుల సంరక్షణ కమిటీ(కేఎస్‌పీసీఆర్‌) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీదర్‌ పోలీసుల తీరును తప్పుపట్టింది. ఇది జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌కు విరుద్ధమని ఆక్షేపించింది. బీదర్‌లోని ఓ పాఠశాలలో సీఏఏకు వ్యతిరేకంగా గతనెల 21న చిన్నారులు నాటకాన్ని ప్రదర్శించారు. దీనిపై ఏబీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు దేశద్రోహం కేసు కింద ఒక విద్యార్థి తల్లిని, ఆ పాఠశాల బాధ్యురాలిని అరెస్టు చేశారు. అలాగే ఈ అంశంపై గతనెల 30న చిన్నారులను పోలీసులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేఎస్‌పీసీఆర్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంటోనీ సెబాస్టియన్‌.. బీదర్‌ పోలీసు అధికారులకు లేఖ పంపారు. బీదర్‌లోని ఆ ప్రాథమిక పాఠశాలలో దర్యాప్తు పేరుతో పోలీసులు ”భయానక వాతావరణం”ను సృష్టించారని అందులో పేర్కొన్నారు. స్కూల్‌ చిన్నారులను ప్రశ్నించడం వెంటనే ఆపాలంటూ ఆదేశించారు.

ముంబయి బాగ్‌ నిరసనకారులపై కేసులు
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘ముంబయి బాగ్‌’ నిరసనలను అణచివేయడాకి నగర పోలీసులు, అధికారులు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. ముంబయి మహానగరపాలక సంస్థ(బీఎంసీ) ఫిర్యాదు మేరకు దాదాపు 300 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్లను అక్రమంగా దిగ్బంధం చేయడమే కాకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ బీఎంసీ అసిస్టెంట్‌ మునిసిపల్‌ కమిషనర్‌ అల్కా ససానే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. షాహీన్‌బాగ్‌ నిరసనల ప్రేరణతో సీఏఏకు వ్యతిరేకంగా గతనెల 26 నుంచి నాగ్‌పడాలో స్థానిక ముస్లిం మహిళలు చేస్తున్న ఆందోళనలు ”ముంబయిబాగ్‌”గా పేరు పొందిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదుపై స్పందించిన నిరసనకారులు.. కోర్టు ముందు తమ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
కాగా, ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ నిరసనల్లో నాలుగునెలల పసికందు మృతిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. చిన్నారులను నిరసనల నుంచి దూరం పెట్టాలంటూ జాతీయ సాహస బాలల అవార్డు గ్రహీత జెన్‌ గుర్నాథన్‌ సదావర్తే.. ఈనెల 5న సీజేఐ బోబ్డే కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తాజా చర్యకు పూనుకున్నది. నిరసనల్లో పాల్గొనకుండా చిన్నారులను దూరం పెట్టే విషయంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆ లేఖలో విద్యార్థి ఆరోపించారు.

కన్నయ్య ప్రసంగించిన వేదికను శుభ్రం చేసిన ఏబీవీపీ
సీఏఏకు వ్యతిరేకంగా బీహార్‌లో పలు నిరసనల్లో పాల్గొంటున్న జేఎన్‌ యూ మాజీ విద్యార్థి నాయకుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌ పట్ల.. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ దారుణంగా ప్రవర్తిస్తున్నది. ఈనెల 4న లలిత్‌ నారాయణ్‌ మిథిలా యూనవిర్సిటీలో జరిగిన సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని కన్నయ్య ప్రసంగించాడు. కన్నయ్య కుమార్‌ వేదికపై నుంచి ప్రసంగించడంతో అది మలినమైందని ఏబీవీపీ విద్యార్థులు దానిని శుభ్రపరిచే చర్యకు పూనుకున్నారు. ‘కన్నయ్య పాల్గొనడం ద్వారా ఈ వేదిక మలినమైంది. దీనిని గంగా జలంతో శుభ్రం చేయడం అత్యవసరం’ అని ఏబీవీపీ విద్యార్థులు తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా కన్నయ్య ఎక్కడికి వెళ్లినా.. ఆ ప్రదేశాలను శుభ్రం చేస్తామని వారు ఉద్ఘాటించారు.

సీఏఏపై కవిని పోలీసులకు పట్టించిన ఉబర్‌ డ్రైవర్‌కు బీజేపీ ఎమ్మెల్యే సన్మానం
సీఏఏ నిరసనలపై ఫోన్‌లో మాట్లాడిన కవిని పోలీసులకు అప్పగించిన ఉబర్‌ డ్రైవర్‌ను ముంబయి బీజేపీ చీఫ్‌, ఎమ్మెల్యే మంగళ్‌ ప్రభాత్‌ లోధా సత్కరించారు. పోలీస్‌ స్టేషన్‌లోనే ‘అలర్ట్‌ సిటిజన్‌షిప్‌ అవార్డు’ను డ్రైవర్‌కు.. ఎమ్మెల్యే ప్రదానం చేయడం గమనార్హం. రాజస్థాన్‌లోని జైపూర్‌ వాసి, కవి అయిన బప్పాదిత్య సర్కార్‌ ఈనెల 3న ముంబయికి వచ్చారు. ఒక కార్యక్రమం నిమిత్తం ఉబర్‌ కారులో బయలుదేరారు. ఆ సమయంలో ముంబయిలోని నాగ్‌పడాలో(‘ముంబయిబాగ్‌’) జరుగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై అనుకూలంగా సర్కార్‌.. తన మిత్రుడితో మాట్లాడుతుండగా తాను విని ఆయనను పోలీసులకు అప్పజెప్పానని ఉబర్‌ డ్రైవర్‌ రోహిత్‌ గుజ్జర్‌ తెలిపారు. కాగా, దీనిపై బీజేపీ ఎమ్మెల్యే లోధా.. రోహిత్‌ను శాంతాక్రూజ్‌ పోలీస్‌ స్టేషన్లో సత్కరించాడు. ”సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యతిరేక కుట్రలో భాగమైన నిందితుడిని పోలీసులకు అప్పజెప్పిన వ్యక్తి రోహిత్‌ గౌర్‌. ఆయనను ముంబయి ప్రజల తరఫున అలర్ట్‌ సిటిజెన్‌ అవార్డుతో సత్కరించాను” అని వాటికి సంబంధించిన ఫోటోలను సైతం ట్విట్టర్‌లో లోధా షేర్‌ చేయడం గమనార్హం.

Courtesy Nava Telangana