– ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌పై మౌనం మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే ప్రకటన
– ఎమ్‌ఐఎమ్‌తో దోస్తీ చెడొద్దు.. బీజేపీకి కోపం రావద్దనే వ్యూహం
హైదరాబాద్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్య ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ… ‘ప్రజల ఇష్టాయిష్టాలను బట్టి మనం కొన్ని నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. అవి కఠినంగా ఉన్నా సరే.. చేసి తీరాల్సిందే…’ అని వ్యాఖ్యానించారు. ఇది కొంత వరకు కరెక్టే కావచ్చు. కానీ గులాబీ బాస్‌… ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ విషయంలో తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఈ మధ్య హైదరాబాద్‌లో జనాలు భారీ కవాతు నిర్వహించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రదర్శన చేసి.. ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజాభీష్టం ఇలా ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ఉంది. అయినా కారు సారు దీనిపై నోరు విప్పటం లేదు. ఆయన వీటిపై ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు..? కేసీఆర్‌ గుంభనంగా ఉండటానికి గల కారణ మేంటి…? అని టీఆర్‌ఎస్‌ వర్గాలను ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ వచ్చిన కొత్తలో సచివాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ను ఓ జర్నలిస్టు ఒక అంశంపై ప్రశ్నించగా… ‘మా పార్టేమన్నా అహో బిల మఠం అనుకున్నరా..? ఫక్తు రాజకీయ పార్టీ. రాజకీయంగానే ఆలోచిస్తాం. రాజకీయంగానే నిర్ణయాలు తీసుకుంటాం. ఆ ప్రకారమే ఫలితాలు కూడా రాబడతాం…’ అని ఆయన సమాధానమిచ్చారు.

ఇప్పుడు ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌పై కూడా గులాబీ దళపతి అదే పద్ధతుల్లో ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. వాటిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టమైన ప్రకటనలు వెలువరించిన సంగతి తెలిసిందే. కేరళ సీఎం పినరయి విజయన్‌… ఏకంగా ఒకరోజుపాటు త్రివేండ్రంలో దీక్ష కూడా చేశారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పలు దఫాలుగా భారీ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించారు. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్‌ ఇప్పటి వరకూ ఎన్నార్సీపైగానీ, ఎన్‌పీఆర్‌ పైగానీ ఏ విధమైన స్టేట్‌మెంటూ ఇవ్వలేదు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వీటిపై ఇప్పటికిప్పుడే మాట్లాడకపోవటం మంచిదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటిపై ఎలాంటి ప్రకటన చేసినా.. ఎల క్షన్లలో నష్టం వాటిల్లుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత వీటిపై ప్రకటన చేద్దా మంటూ ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు వినికిడి. అప్పటి వరకూ గుంభనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఇక్కడ రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చెడకుండా ఉండేందుకు పార్లమెంటులో క్యాబ్‌కు వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు బీజేపీకి కోపం రాకుండా చూసుకునేం దుకే మౌన ప్రదర్శన చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే.. బీజేపీ దాన్ని ఆయుధంగా చేసుకుని మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై దాడి చేస్తుంది. అలాగని ఏదో నామ్‌కే వాస్తే ప్రకటన చేస్తే.. మజ్లిస్‌తో సయోధ్య దెబ్బతింటుంది. ఫలితంగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఇటు హిందువుల ఓట్లు, అటు ముస్లింల ఓట్లలో తమకు కొంత మేర గండి పడుతుందనే భయం గులాబీ బాస్‌ను వెంటాడుతున్నది. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదని సమాచారం.

అంటే ప్రజాభీష్టం ఎలా ఉన్నా ఫరవాలేదు.. తమకు మాత్రం రాజకీయాలు, ఓటు బ్యాంకులే ముఖ్యమనే విధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నదనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

(Courtesy Nava Telangana)