– హక్కుల చట్టం అమలుపై నీలి నీడలు
– హామీ మరచిన సీఎం..
– ఆదివాసీల అసంతృప్తి
కొండూరి రమేశ్‌బాబు

అడవి తల్లిని నమ్ముకుని తర తరాలుగా జీవనం సాగిస్తున్న ఆదివాసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతున్నది. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయక పోవటంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వక పోగా హరిత హారం పేరుతో వాటిని అక్రమించుకోవటానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న దాడులతో అటవీ గ్రామాల్లో అలజడి రేగుతున్నది. మరో వైపు అభయారణ్యాల్లో జీవిస్తున్న ఆదిమ తెగల వారిని, గొత్తి కోయలను చట్ట విరుద్ధంగా అక్కడి నుంచి ఖాళీ చేయించే దిశగా అటవీ శాఖ అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో 2014 వరకూ పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తానని చెప్పారు. ఏడాది గడచినా ఈ హామీని ఆయన నిలబెట్టుకోలేదు. పోడు భూముల సమస్యను పరిష్కరించక పోగా తాము సాగు చేసుకుంటున్న భూములపై అటవీ అధికారులు దండయాత్రలు చేయటంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు తమ తడాఖా చూపించారు. ఆదివాసీ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. ఇది గమనించిన కేసీఆర్‌ ఏజెన్పీ ప్రాంతంలో పర్యటిస్తానని ప్రకటించారు. అయినా అడుగు ముందుకు పడలేదు. వామపక్షాలు మూడు దశాబ్ధాల కాలం చేసిన పోరాటాల ఫలితంగా కేంద్రం అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. 2005కి పూర్వం అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారందరికీ ఈ చట్టం ప్రకారం హక్కులను కల్పించాలని చట్టంలో పేర్కొన్నది. రాష్ట్ర విభజనకు పూర్వమే చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ దరఖాస్తుల (క్లెయిమ్స్‌) పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగలేదు.

ఆదివాసీలదే అడవి…
అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించటమే కాక అటవీ గ్రామాల పరిధిలో ఉన్న ఆదివాసీలకే అడవిపై హక్కు ఉంటుంది. ఈ అడవికి సాముదాయక హక్కులు కల్పించి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా అప్పగించాల్సి ఉంటుంది. కానీ కమ్యూనిటీ గుర్తింపు ఇవ్వటానికి అటవీ శాఖ అంగీకరించటం లేదు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 66.67 లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఆదివాసీలు నివసించే 2,641 అటవీ గ్రామాల పరిధిలో 37.04 లక్షల ఎకరాల అడవి ఉండగా 29.63 లక్షల ఎకరాలు బయట ఉన్నది. చట్ట ప్రకారం ఆదివాసీ గ్రామల పరిధిలో ఉన్న అడవికి కూడా కమ్యూనిటీ హక్కులు కల్పించాలని ఆదివాసీలు కోరుతున్నారు. 7.61 లక్షల ఎకరాలకు ఉమ్మడి యాజమాన్య హక్కులు కల్పించాలని అటవీ హక్కుల కమిటీలకు ఆదివాసీలు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిలో వన సంరక్షణ సమితీల పేరుతో 2.18 లక్షల ఎకరాలకు హక్కులు ఇవ్వటానికి అటవీ శాఖ అంగీకరించింది. వనసంరక్షణ కమిటీల్లో అటవీ అధికారుల పెత్తనమే ఉంటుందని ఇది అటవీ హక్కుల చట్టం స్ఫూర్తికి విరుద్ధమని ఆదివాసీలు అంటున్నారు.

వ్యక్తిగత దరఖాస్తుల పరిస్థితి ఇంతే…
పోడు భూములను మూడు తరాల నుంచి సాగు చేసుకుంటున్న ఆదివాసీలు యాజమాన్య హక్కుల కోసైం 2,11,970 దరఖాస్తులను పెట్టుకున్నారు. గ్రామసభల తీర్మానాల ప్రకారం ఈ దరఖాస్తులకు సంబంధించి 7.61 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా అడుగడుగునా అటవీ అధికారులు అభ్యంతరాలు చెప్పటంతో ప్రక్రియ మధ్యలోనే ఆగి పోయింది. ఇప్పటి వరకూ 99,486 దరఖాస్తులను పరిష్కరించి కేవలం 3,31,070 ఎకరాలకు మాత్రమే హక్కులను కల్పించారు.

అభయారణ్యం పేరుతో..
ఆదివాసీలు అడవుల్లో నివసించటానికి అటవీ హక్కుల చట్టం అధికారం ఇచ్చింది. వన్యప్రాణుల అభయారణ్యాల పేరుతో అడడుల్లో నివసించే ఆదివాసీలను అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించటానికి అటవీ శాఖ అడుగులు వేస్తున్నది. కవ్వాల్‌, ఆమ్రాబాద్‌ పులుల అభయారణ్యాలతో కలిపి రాష్ట్రంలో 12 అభయారణ్యాలు ఉండగా అక్కడ నివసించే చెంచులు, కొండరెడ్లు, తోటి, కొల్లాం వంటి ఆదిమ తెగల వారిని అడవి నుంచి బయటికి పంపితే ఆ తెగలు అంతరించి పోయే ప్రమాదం ఉన్నదని మేధావులు హెచ్చరిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి ఉన్నచోటే జీవించే అవకాశం ఇవ్వాలి.

గొత్తి కోయల జీవన్మరణ పోరాటం
దండకారణ్యం నుంచి వలస వచ్చి గోదావరి లోయలోని అడవుల్లో ఉంటున్న గొత్తి కోయలను కూడా అడవి నుంచి తరిమి వేయాలని అటవీ శాఖ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ఆవాసాలపై దాడులు చేయటం, ఇండ్లు పీకి నిరాశ్రయులను చేయటంతో వారు పూర్తి అభద్రతా భావంతో కాలం గడుపుతున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారు నివసిస్తున్న అడవిలోనే ఉంచాలి. హైకోర్టు కూడా ఇటువంటి ఆదేశాలనే ఇచ్చింది. అయినప్పటికీ చట్ట ప్రకారం వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీరించటానికి కూడా అధికారులు అంగీకరించటం లేదు.

Courtesy Nava telangana