విప్లవోద్యమం శాంతి భద్రతల సమస్య కాదని, దానికి సామాజిక ఆర్థిక మూలాలున్నాయని కె.సి.ఆర్ అన్న మాటలను గుర్తు చేయవలసిన సందర్భమిది. తెలంగాణ ఉద్యమానికి, అలాగే శాంతి చర్చలకి ఈ సంఘాలన్ని మద్దతునిచ్చాయి. ఇప్పుడు ఆ సంఘాలన్నీ చట్టవ్యతిరేక సంఘాలు అని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ లిస్టులో చేర్చిన పౌరహక్కుల సంఘం, తెలంగాణ ఉద్యమానికి 1995–96 ప్రాంతంలోనే తన మద్దతు ప్రకటించింది. ఆ సంఘం కె.సి.ఆర్.ను ఒక సదస్సుకి ఆహ్వానించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఘంలో చేరి తాను కూడా పౌర హక్కుల ఉద్యమంలో ముందు ఉంటానని అన్నారు. అలాంటి సంఘం, ఆ సంఘ అధ్యక్షుడు, సభ్యులు ఇప్పుడు చట్ట వ్యతిరేకమైన వ్యక్తులైపోయారు!

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో పన్నెండు ప్రజా సంఘాలకు చెందిన 35మంది బాధ్యుల మీద తెలంగాణ ప్రభుత్వం ‘ఉపా’ చట్టం ప్రయోగించడం నమ్మశక్యంకాని విషయం. ఇందులో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, లాయర్లు, విద్యార్థులు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పౌరహక్కుల సంఘ అధ్యక్షుడిని సభ్యులని కూడా చేర్చారు. వీళ్ళందరు మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సరఫరా చేస్తున్నారని, డబ్బు సమకూరుస్తున్నారని, కొత్తగా సభ్యులను చేరుస్తున్నారనే ఆరోపణలు చేశారు. మావోయిస్టు ఉద్యమం వీళ్ళ వల్లనే నడుస్తున్నదనేంత దూరం వెళ్లారు. అంతిమంగా ఇవేవి చట్టం ముందు నిలిచేవి కావు. కాని ‘ఉపా’ అనే అతిక్రూరమైన, అప్రజాస్వామికమైన, అన్యాయమైన చట్టం ఒకటి ఈ దేశ న్యాయప్రక్రియలో భాగమైపోయింది. ఈ చట్టం క్రింద అరెస్టు చేయబడిన వ్యక్తులను కనీసం ఆరునెలలు ఏ సాక్ష్యాధారాలు లేకుండా జైల్లో పెట్టవచ్చు. ఈ చట్టం క్రింద అరెస్టు అయిన కేసులు ఐదు శాతం కూడా చట్టం ముందు నిలవలేదు. అంటే తొంభై ఐదు శాతం మంది ఏ నేరం, తప్పులు చేయనివాళ్ళు కనీసం ఆరు నెల్లైనా జైలు శిక్ష ఎందుకు అనుభవించినట్లు? సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా అరెస్టు చేసిన యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చట్టం, అధికారం ఉంది కదా అని రాజ్యం దానిని విస్తృతంగా ఉపయోగిస్తున్నది. ‘ఉపా’లో ఈ సవరణ చేసేముందు టాడా, పోటా లాంటి దుర్మార్గ చట్టాలు దురుపయోగం చేయడం వలన వాటికి కాల పరిమితి ఉండడం వలన అవి రద్దు అయ్యాయి. ఆ చట్టాల్లో ఉండే అతి అప్రజాస్వామిక అంశాలను ‘ఉపా’ చట్టంలో చేర్చారు. దీనికి కాల పరిమితి లేదు. న్యాయస్థానాలు దీనిని ఇప్పటికే కొట్టి పారేయవలసింది. అది జరగకపోవడం వలన ఇవ్వాళ్ళ వందలాది మంది ఏ కారణం లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నిర్బంధ చట్టాలు ఎలా ఉపయోగింపబడతవో గత హోం మంత్రి చిదంబరానికి ఇప్పటికి అనుభవంలోకి వచ్చి వుంటుంది. ‘ఉపా’ చట్టంలో ఈ అంశాలు అతి ఉత్సాహంగా, ఎలాంటి సమగ్ర చర్చ లేకుండా చేర్చినవాడు చిదంబరం. భారతీయ జనతా పార్టీ అన్ని అప్రజాస్వామిక చట్టాలను తమకు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నది. తమ ప్రత్యర్థుల మీద ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా ప్రయోగిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఐనా శాశ్వతంగా అధికారంలో ఉండదు, చట్టాలు చేసేముందు కొన్ని ప్రజాస్వామిక విలువలు, ప్రమాణాలు నెలకొల్పాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’ అని మన ధర్మశాస్త్రాలే చెపుతున్నవి.

తెలంగాణలో ఇంతమంది ప్రజాసంఘాల్లో పని చేస్తున్న వారి మీద ఒకే సారి దాడి చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ప్రజా సంఘాలను నిషేధించే ప్రయత్నాలు చేశారు. సంఘాల మీద, సంఘ కార్యకర్తల మీద దాడి చేశారు. పౌర హక్కుల సంఘం తన ఆరుమంది నాయకులను కోల్పోయింది. ఎంత నిర్బంధం వచ్చినా తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతిలో ఒక ‘మొండితన’ముంది. ఆ పట్టింపే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది. దాదాపు 1955-–56 నుండి 2014లో రాష్ట్రం సాధించే దాక ఏదో ఒక రూపంలో ఉద్యమం కొనసాగింది. ఉద్యమాన్ని 1960లలో అణచివేస్తే అది మళ్ళీ 1990లలో విచ్చుకున్నది. రెండవ పర్యాయం దాదాపు రెండు దశాబ్దాల కాలం ఉద్యమం జరిగితే కాని తెలంగాణ సిద్ధించలేదు. గతంలో అరెస్టు ఐన సాయిబాబా నుండి, సంవత్సరంగా జైలులో ఉన్న వి.వి. దాకా, అలాగే ఇవ్వాళ పేర్కొన్న 12 సంస్థలు, 35మంది ప్రజాసంఘాల బాధ్యులు అందరూ ప్రత్యేక తెలంగాణ కొరకు రాజీలేకుండా పోరాడిన వాళ్ళే. నిజానికి తెలంగాణ ఉద్యమం నిర్బంధానికి వ్యతిరేకంగా పెల్లుబికిన ఉద్యమమే. ఉమ్మడి రాష్ట్రంలో వెంగళరావుతో ప్రారంభమైన నిర్బంధం ఎన్.టి.రామారావు, చంద్రబాబు కాలంలో పరాకాష్ఠకు చేరుకుంది. ఈ నిర్బంధం అంతా అప్పటి పీపుల్స్‌వార్ తర్వాత, మావోయిస్టు పార్టీ పేరిట జరిగిందే. నిజానికి తెలంగాణ హింస ప్రతిహింస వలయంలో చాలా కాలమే చిక్కుకుంది, విపరీతమైన ప్రాణనష్టం కూడా చూసింది.

విప్లవ పార్టీల పట్ల పాలక పార్టీల వైఖరి నిరంతరంగా ద్వంద్వ ప్రమాణాలతో రెండు నాల్కలతో నడిచింది. ఈ పోరాటం శాంతిభద్రతల సమస్యా లేక సామాజిక ఆర్థిక సమస్యా అనే చర్చ చేయని రాజకీయ పార్టీ లేదు. అన్ని పార్టీలు, (ఒక్క బి.జె.పి. మినహా) ఎప్పుడో ఒక సందర్భంలో ఇది సామాజిక సమస్య అని, విప్లవ పార్టీల అజెండాయే మా అజెండా అనీ అన్న పార్టీలే. ఇది కేవలం హింసాత్మక ఉద్యమం అన్న పార్టీలు లేవు. ఎన్.టి. రామారావు నక్సలైట్లు తన తమ్ముళ్ళు అన్నవాడే, రాజశేఖర్ రెడ్డి 2004లో ఇది ఒక సామాజిక సమస్య అని తన పార్టీ గెలిస్తే శాంతి చర్చలు జరుపుతానని గెలిచాక తూతూమంత్రంగా చర్చలు జరిపినవాడే. మావోయిస్టు పార్టీ నాయకులను ప్రభుత్వం తన అతిథులుగా చూసింది. కేవలం హింసాత్మక పార్టీ అంటే ఇది సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ హింస ప్రతిహింస వలయం నుండి బయటపడాలని దాదాపు ఒక దశాబ్ద కాలం యస్.ఆర్.శంకరన్ ఆధ్వర్యంలో పదిహేనుమంది వివిధ రంగాలలో ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు కృషి చేశారు. ఈ కృషి జరుగుతున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, బి.జె.పి.తో సహా, చర్చల్లో పాల్గొన్నాయి. పౌర స్పందన వేదిక కృషికి మద్దతు పలికాయి. ఈ సందర్భంలో జరిగిన ఒకానొక చర్చలో ప్రస్తుత ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చేసిన సూచనలు, ఆయన ప్రతిపాదనలు వేదిక ప్రచురించిన నివేదికలో నిక్షిప్తమై ఉన్నవి. విప్లవోద్యమం శాంతిభద్రతల సమస్య కాదని, దానికి సామాజిక ఆర్థిక మూలాలున్నాయని కె.సి.ఆర్ అన్న మాటలను గుర్తు చేయవలసిన సందర్భమిది. తెలంగాణ ఉద్యమానికి, అలాగే శాంతి చర్చలకి ఈ సంఘాలన్ని మద్దతునిచ్చాయి. ఇప్పుడు ఆ సంఘాలన్నీ చట్టవ్యతిరేక సంఘాలు అని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ లిస్టులో చేర్చిన పౌరహక్కుల సంఘం, తెలంగాణ ఉద్యమానికి 1995–-96 ప్రాంతంలోనే తన మద్దతు ప్రకటించింది. ఆ సంఘం కె.సి.ఆర్ ను ఒక సదస్సుకి ఆహ్వానించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఘంలో చేరి తాను కూడా పౌర హక్కుల ఉద్యమంలో ముందు ఉంటానని అన్నారు. అలాంటి సంఘం, ఆ సంఘ అధ్యక్షుడు, సభ్యులు ఇప్పుడు చట్ట వ్యతిరేకమైన వ్యక్తులైపోయారు!

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రెండవసారి భారీ మెజారిటీతో గెలిచింది. నరేంద్ర మోదీ ఇప్పుడు తిరుగులేని నాయకుడుగా, అమిత్ షా అత్యంత ప్రభావశీల నాయకుడుగా పరిగణింపబడుతున్నారు. ఇంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాల మీద, ప్రజాసంఘాల మీద నిర్బంధం ప్రయోగించడం విచిత్రంగా కనిపిస్తున్నది. నిజానికి బలహీన ప్రభుత్వాలు తమ అధికారం ఎప్పుడు ఊడుతుందో అన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు వాళ్ళకున్న మెజారిటీతో ఏ సమస్యనైనా రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప రాజ్య వ్యవస్థను, సంస్థలను దురుపయోగం చేయడం ద్వారా కాదు. బలప్రయోగం రాజ్య బలహీనతే కాని బలం కాదు. కె.సి.ఆర్. మొన్న అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాతే నిర్బంధం పెరిగిందని తెలంగాణలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో విప్లవ పార్టీ చాలా బలంగా ఉన్న కాలంలో లేని బల ప్రయోగం ఇప్పుడు ఎందుకు అవసరం అనేది ప్రశ్నే. దక్షిణ భారత దేశంలో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో తాము తప్పక పాగా వేస్తామని బి.జె.పి పార్టీ నమ్ముతున్నది. తె.రా.స, కాంగ్రెస్ పని అయిపోయిందని కూడా భావిస్తున్నది. తమ భావజాల వ్యాప్తికి ఈ ప్రజాసంఘాలన్నీ ప్రతిబంధకం అని భావించే ఈ చర్యలు తీసుకోవలసిందిగా కె.సి.ఆర్‌ని ఆదేశించినారని భావించవలసి వస్తున్నది. అలాంటి ఆదేశాలు ఏవి ఇచ్చినా, ఈ సమస్యను తాను రాజకీయంగా ఎదుర్కొంటానని, తెలంగాణ ఒక భిన్నమైన విశిష్టమైన రాష్ట్రమని కె.సి.ఆర్ చెప్పవలసింది. అంతేకాని అకస్మాత్తుగా ఇన్ని సంఘాలని, ఇంతమంది కార్యకర్తలని ఒక దుర్మార్గ చట్టం కింద నిర్బంధిస్తామనడం అటు తె.రా.స.కి, ఇటు బి.జె.పి.కి రాజకీయంగా ఏమాత్రం ఉపయోగపడదు.

విప్లవ రాజకీయాల ప్రభావం అన్ని రంగాల మీద ఉంది. ఇవ్వాళ జర్నలిజంలో ప్రఖ్యాతమైన జర్నలిస్టులు, విద్యారంగంలో విద్యావేత్తలు, లీగల్ రంగంలో లాయర్లు, సాహిత్య రంగంలో ప్రసిద్ధి చెందిన కవులు, రచయితలు, కళాకారులు, అద్భుత గాయకులు అందరూ ఈ రాజకీయాల వల్ల ప్రభావితమైనవారే. కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా దీనికి మినహాయింపు కాదు. విప్లవ రాజకీయాలని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడడం బి.జె.పి.కి వర్తిస్తుందేమోగాని తె.రా.స. పార్టీకి సమంజసం కాదు.

ఇవ్వాళ ‘ఉపా’ ప్రయోగించాలనుకున్న 35 మంది వ్యక్తిగతంగా విలువలు, విశ్వాసాలున్న వారు. అంతకుమించి నిజాయితీపరులు, సమాజాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు. వీళ్ళందరు తెలంగాణ సమాజం పెంచి పోషించిన నైతిక వనరులు. విశ్వాసాలు తప్ప వాళ్ళ మీద ఏ నేరారోపణ చేయడం సాధ్యం కాదు. ఇంతమందిని ఒక దుర్మార్గ చట్టం కింద నిర్బంధిస్తే, తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో, కె.సి.ఆర్., అలాగే టి.ఆర్.ఎస్. పార్టీ అంచనా వేయాలని, రాజకీయంగా ఇది ఎంత నష్టానికి గురి చేస్తుందో ఆలోచించాలని సలహా. టి.ఆర్.ఎస్. పార్టీలో ఉండే ప్రజా ప్రతినిధులందరూ తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగం కావాలి, ఇవ్వాళ భిన్న బాధ్యతలలో ఉన్న మిత్రులు, తెలంగాణ ప్రజాస్వామికవాదులు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. శాంతి చర్చలప్పుడు తెలంగాణ సమాజం ఆ పని చేసింది. తెలంగాణ బి.జె.పి పార్టీ తమ కేంద్ర పార్టీ మీద ఒత్తిడి తేవాలి. తెలంగాణ నిర్బంధాన్ని సహించదు. నిజానికి ఉద్యమాలు ప్రజాస్వామ్య సంస్కృతి మధ్య శాంతియుతంగా జరుగుతాయి. నిర్బంధంలో నుంచి వచ్చే ప్రతిఘటన రూపాలు వేరుంటాయి. అసమానతలు, ఆధిపత్యం ఉన్నంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో సాగుతూనే ఉంటాయి. తె.రా.స. ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గుర్తించి ఈ మొత్తం చర్యను వెనక్కి తీసుకోవాలి.

ప్రొ. జి. హరగోపాల్