గజ్వేల్‌, ములుగు, గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.వెంకటేశ్వర్లు (37) బుధవారం కార్బైన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, ఒకటో బెటాలియన్‌ కమాండెంట్‌ రమేష్‌ల కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడా ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఏక్తారి భిక్షపతి, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు. 2003 బ్యాచ్‌కి చెందిన ఆయన… సీఎం వ్యవసాయ క్షేత్రంలో దక్షిణద్వారం వద్ద గస్తీ బృందానికి బాధ్యుడిగా ఉన్నారు. చాలా కాలంగా మద్యానికి బానిసై సరిగా విధులు నిర్వహించకపోవటంతో ఉన్నతాధికారులు అనేకసార్లు నచ్చజెప్పారు. కొన్ని రోజుల క్రితం నార్కెట్‌పల్లిలోని డీఎడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స చేయించారు. మద్యం మానేశానని చెప్పటంతో గతనెల 29న మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వ్యవహార శైలిలో మార్పు రాలేదు. సెలవు తీసుకుని ఈనెల 15న తిరిగి వచ్చారు. భార్య శోభ, మరో వ్యక్తి వచ్చి బతిమాలితే ఎస్సై సింహాచలం విధుల్లోకి చేర్చుకున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో కార్బైన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్యతోపాటు కుమారుడు చందు, కూతురు వెన్నెల ఉన్నారు. శవపరీక్ష నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.

తోటి ఉద్యోగుల కారణంగానే: కుటుంబీకుల ఆరోపణ
పనిచేసే చోట తోటి ఉద్యోగులు వేధించటం వల్లే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య, కొడుకు, కూతురు ఆరోపించారు. కానిస్టేబుళ్లు అనిల్‌, మరో వ్యక్తి తరచూ గొడవ పడుతున్నారంటూ తమకు చెప్పేవాడని తెలిపారు. మరోవైపు సెలవులు ఇవ్వకుండా అధికారులు వేధించారన్నారు. తమ తండ్రిపై చేయిచేసుకున్న కానిస్టేబుళ్లతో పాటు సెలవులు ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు పిల్లలు డిమాండు చేశారు. పోలీసులు చెబుతున్నట్లుగా తన భర్తను విధుల్లోకి తీసుకోవాలని బతిమాలేందుకు తాను రాలేదని, తన భర్తను వేధిస్తున్న కానిస్టేబుళ్ల వ్యవహారశైలిని మార్చాలని కోరేందుకే 15న వ్యవసాయ క్షేత్రానికి వచ్చానని వెంకటేశ్వర్లు భార్య శోభ పేర్కొన్నారు.

తోబుట్టువులు, బావలతో మాట్లాడి..
వెంకటేశ్వర్లు తనువు చాలించాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి.. అక్క మణెమ్మ, బావ యాదగిరితోపాటు చెల్లెలు సమ్మక్క, బావ నరసింహతో ఫోన్‌లో చాలా సేపు మాట్లాడినట్లు వారు చెప్పారు. ఎప్పుడూ అంతసేపు మాట్లాడని సోదరుడు ఇప్పుడు ఇలా యోగక్షేమాలు వాకబు చేయటంతో ఎంతో సంతోషించామన్నారు. ఈ సంతోషం కొన్ని గంటలైనా నిలవక ముందే దూరమైతిపోతివా అంటూ.. వారు వాపోయారు.

(Courtesy Eenadu)