తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడో బడ్జెట్‌గా, 2019-20 సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారంనాడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ యథావిధిగా అసత్యాలతో, అర్థసత్యాలతో, ప్రగల్భాలతో, దాటవేతలతో, స్వయంకృత అపరాధాలకు ఇతరుల మీద నెపం మోపడంతో నిండి ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎన్నికలు వచ్చినందువల్ల ఈ సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించకుండా, ఫిబ్రవరి 22న రూ.1,82,017కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ (వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌) సమర్పించిన ప్రభుత్వం, దాదాపు ఏడు నెలల తర్వాత ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అప్పటికీ ఇప్పటికీ బడ్జెట్‌ రూ.35,525 కోట్లు తగ్గి రూ.1,46,492 కోట్లకు పడిపోయింది. అంటే ఏడునెలల కిందటి ప్రతిపాదనలూ, అంచనాలూ ఇరవై నాలుగు శాతం తగ్గిపోయాయి. ఎన్ని కారణాలు చెప్పినా రూపాయి లెక్క ముప్పావలాకు తగ్గిపోయిందంటే, ఇప్పటి అంకె వాస్తవికమైతే అప్పటి అంకె అతిశయోక్తి అయి ఉండాలి.

ఇంత పెద్ద ఎత్తున కోత ఉన్నది గనుక ప్రభుత్వానికి కూడా దాన్ని ఒప్పుకోక తప్పలేదు. కిందపడినా నాదే గెలుపు అనే ప్రగల్భాలు అలవాటు గనుక ఈ పతనానికి, అంచనాల తలకిందులకు బాధ్యతను అటు మాంద్యం మీదికో, ఇటు పన్నుల రాబడి తగ్గడం మీదికో నెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. మాంద్యం పెరుగుతున్న మాట, కేంద్ర ప్రభుత్వం సమాఖ్య భావనకు దూరం జరుగుతూ రాష్ట్రాల హక్కులను, ద్రవ్య రాబడులను అడ్డుకుంటున్న మాట నిజమే. మాంద్యం వల్ల, పెరుగుతున్న నిరుద్యోగం వల్ల పన్నుల రాబడి తగ్గుముఖం పట్టిన మాట నిజమే. కానీ మాంద్యం సూచనలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌ తయారు చేసేనాటికే ప్రారంభమయ్యాయి గనుక దాన్ని ఇప్పుడు కారణంగా చూపడం బుకాయింపు మాత్రమే. పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్యాయమైన విధానాలనెన్నిటినో ఈ రాష్ట్ర పాలకులే అత్యుత్సాహంగా సమర్థించి ఉన్నందువల్ల ఆ కారణం చెప్పడం కూడా అర్థసత్యమే గాని అసంగతం. ఇంతకూ స్వయంగా ఈ బడ్జెట్‌ ప్రసంగంలోనే పన్నుల రాబడి 14శాతం ఎక్కువగా ఉంటుందని మధ్యంతర బడ్జెట్‌ ఆశించగా, అది 6శాతం మాత్రమే ఉన్నదని అన్నారంటే, బడ్జెట్‌లో 24శాతం కోతకు ఈ రాబడి కోత మాత్రమే కారణం కాదన్నమాట.
ఇలా పలికీ పలకకుండా అపశ్రుతులు పలుకుతూనే, ”ఆర్థిక మాంద్యం భయపెడుతున్నా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది” అని బీరాలు కూడా పలికారు. ఆసరా, రైతు రుణమాఫీ, రైతు బీమా, విద్యుత్‌ రాయితీ, బియ్యం రాయితీ, రైతు బంధు, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల కేటాయింపుల భారీ అంకెలు ప్రకటించారు.
నిజానికి బడ్జెట్‌ కేటాయింపుల అంకెలను ఊరికే అంకెలుగా చూస్తే వాటి గురించి ఏమీ అర్థం కాదు. వాటి వందల కోట్ల, వేల కోట్ల భారీతనం వల్ల ఎక్కువలో ఎక్కువ అవి భయపెట్టవచ్చు. లేదా, అదేదో అర్థం కాని విషయం అని విస్మరించేలా చేయవచ్చు. కానీ ఒక బడ్జెట్‌ కేటాయింపు అంకెను సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా గత సంవత్సరాల కేటాయింపుల అంకెతో పోల్చిచూడవలసి ఉంటుంది. ఆ కేటాయింపులో వాస్తవంగా ఎంత ఖర్చు పెట్టడం జరిగిందో చూడవలసి ఉంటుంది. ఆ కేటాయింపు వల్ల ఆ రంగంలో ఎంత మంది లబ్ది పొందారో, తలసరి లబ్ది ఎంతో, సమాజంలో ఆ రంగంలో ఉన్న అవసరంతో పోలిస్తే ఆ లబ్ది ఆ అవసరాన్ని ఏమేరకు తీర్చగలిగిందో అంచనా వేయాలి. ఈ నాలుగు ప్రమాణాలతో పరిశీలించకుండా వంద కోట్లు అనే అంకె చెప్పినా, వెయ్యి కోట్లు అనే అంకె చెప్పినా, పదివేల కోట్లు అనే అంకె చెప్పినా ప్రయోజనమేమీ లేదు.

ఏ సంవత్సరమైనా ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రతిపాదనలు (బడ్జెట్‌ ఎస్టిమేట్స్‌ – బి ఇ) మాత్రమే ఉంటాయి, ఒక ఏడాది గడిచినాక, ప్రతిపాదించిన మేరకు ఆదాయం ఉందా లేదా, ప్రతిపాదించిన మేరకు వ్యయం జరిగిందా లేదా తొలి గణాంకాలు అంది సవరించిన అంచనాలు (రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ – ఆర్‌ ఇ) తయారవుతాయి. మరొక సంవత్సరం గడిచిన తర్వాత మాత్రమే ఆ గణాంకాల నిర్ధారణ పూర్తయి సంపూర్ణమైన లెక్కలు (అకౌంట్స్‌) తయారవుతాయి. అంటే ఒక బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నప్పుడు రానున్న సంవత్సరపు బిఇ, గడిచిన సంవత్సరపు ఆర్‌ఇ, అంతకుముందరి సంవత్సరపు అకౌంట్స్‌ అనే మూడు అంకెలు ఉంటాయి. వీటిలో మధ్య సంవత్సరపు బిఇని, ఆర్‌ఇని కూడా పోల్చి చూడటానికి వీలు ఉంటుంది. అలా చూసినప్పుడు, మరీ ఎక్కువ వివరాల్లోకీ, సాంకేతిక అంశాల్లోకీ వెళ్లకుండానే ఈ బడ్జెట్‌ స్థూల అంకెలనూ, దానికన్న ముందరి మూడు బడ్జెట్ల స్థూల అంకెలనూ పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన సంగతులు బైటపడతాయి.

గత సంవత్సరం 2018-19లో రెవెన్యూ ఆదాయం రూ.1,30,975కోట్లు ఉంటుందని బడ్జెట్‌ అంచనాలలో ఊహించగా, అది సవరించిన అంచనాల నాటికి రూ.1,19,099 కోట్లకు తగ్గిపోయింది. అది ఇంకెంత తగ్గిపోయిందో వచ్చే సంవత్సరం బడ్జెట్‌ నాటికి తేలుతుంది. ఇదే సమయంలో మూలధన ఆదాయం రూ.43,507 ఊహించగా, సవరించిన అంచనాల నాటికే అది రూ.42,507 కోట్లకు తగ్గింది. మరెంత తగ్గుతుందో తెలియదు. ఈ ఆదాయాల తరుగుదల వల్ల, (లేదా, ఊహలకూ వాస్తవాలకూ తేడా వల్ల), ఇదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.1,25,454 కోట్ల నుంచి రూ.1,19,026 కోట్లకూ, మూలధన వ్యయం రూ.33,369 కోట్ల నుంచి రూ.26,888 కోట్లకూ తగ్గింది.

ఈ నేపథ్యంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గత సంవత్సరపు రెవెన్యూ ఆదాయపు బడ్జెట్‌ అంచనాల కన్న, సవరించిన అంచనాల కన్న తక్కువగా రూ.1,13,099 కోట్లుగా ఉంది. అంటే గత సంవత్సరం ప్రతిపాదించిన, సవరించిన అంకె కన్న కూడా రూ. ఆరు వేల కోట్ల తక్కువ రెవెన్యూ ఆదాయం ఉండబోతున్నదన్నమాట. అలాగే గత సంవత్సరం ప్రతిపాదించిన, సవరించిన అంకె కన్న కూడా రూ. ఐదు వేల కోట్ల తక్కువగా మూలధన ఆదాయం ఉండబోతున్నది. ఈ ఆదాయ కొరతకు పూర్తిగా భిన్నంగా వ్యయంలో మాత్రం రెవెన్యూ వ్యయంలో గత సంవత్సర సవరించిన అంచనాల కన్న ఎక్కువగా కేవలం వడ్డీల చెల్లింపులకే మూడు వేల కోట్ల రూపాయలు, అసలు చెల్లింపులకు అరొక మూడు వేల కోట్ల రూపాయలు ఉండబోతున్నాయని తాజా ప్రతిపాదనలు తెల్పుతున్నాయి. అంటే మన ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా అప్పుల అసలు, వడ్డీ చెల్లించవలసిన రుణభార స్థితికి రాష్ట్ర ఖజానా చేరింది.

ఈ కథ ఇక్కడితో కూడ అయిపోలేదు. ‘2019-20 తెలంగాణ బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌’ అనే అధికారిక పత్రం ప్రకారమే రాష్ట్రపు రుణభారం 2017-18 గణాంకాల ప్రకారం రూ.1,52,190కోట్లు ఉన్నదల్లా, 2018-19 సవరించిన అంచనాల్లో రూ.1,79,795కోట్లకు చేరి, ప్రస్తుత బడ్జెట్‌ అంచనాల్లో రూ.2,03,730 కోట్లకు ఎగబాకింది. ఇది కాకుండా, ఈ బడ్జెట్‌లో చూపిన ద్రవ్యలోటు రూ.24,081 కోట్లను పూరించుకోవడానికి కూడా రుణం తెచ్చుకోవలసిందే గనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలలో ఇప్పటి రెండు లక్షల మూడు వేల కోట్ల రుణభారం రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకు ఎగబాకినా ఆశ్చర్యం లేదు.

ప్రజాప్రయోజనాలకోసం చేస్తున్న కేటాయింపుల అసలు సంగతి తేలాలంటే వాటిని పోల్చిచూడాలని కేటాయింపునకూ వాస్తవ ఖర్చుకూ మధ్య వ్యత్యాసాన్ని చూడాలని ఇంతకు ముందే చెప్పుకున్నాం. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ కింద ఉన్న ఎనిమిది విశ్వవిద్యాలయాలకూ, హిందీ అకాడమికీ కలిపి నిర్వహణ వ్యయంగా గత సంవత్సరపు సవరించిన అంచనా రూ.485 కోట్లు కాగా, నిన్నటి బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేటాయింపులు రూ.480 కోట్లు. ఇందులోనూ కాకతీయ విశ్వవిద్యాలయానికి గత సంవత్సరపు సవరించిన అంచనా రూ.87 కోట్లు కాగా, అది ఈ సంవత్సరం రూ.79 కోట్లకు తగ్గింది. ఎక్కడైనా రోజులు గడుస్తుంటే నిర్వహణా వ్యయం పెరుగుతుంది గాని తగ్గించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయం ప్రవేశపెడుతున్నట్టున్నది. అంతకంటే విచిత్రం పాతరోజుల్లో మూలధన వ్యయం అని పిలిచే పద్దును ప్రస్తుత ప్రభుత్వం ప్రగతి పద్దు అని కొత్త పేరు పెట్టింది. ఆ పద్దు కింద గత సంవత్సరం ఈ ఎనిమిది విశ్వవిద్యాలయాలకు, హిందీ అకాడమికి కలిసి బడ్జెట్‌ అంచనాలలో రూ.210 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాలలో దాన్ని రూ.173 కోట్లకు తగ్గించారు. ఆ పద్దు కింద ఈ సంవత్సరం కేటాయింపులు ముచ్చటగా మూడు కోట్ల రూపాయలు మాత్రమే. ఈ అంకెలను అందరికీ అర్థమయ్యే మాటల్లో చెప్పుకోవాలంటే రానున్న సంవత్సరంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది జీతభత్యాలు, గ్రంథాలయంలో పుస్తకాలు, వివిధ ప్రయోగశాలల్లో అవసరమైన పరికరాలు వంటి ఖర్చులు గత సంవత్సరం కంటె తగ్గవలసిందే గాని పెరగడానికి వీలులేదు. కొత్త భవనం కాదు సరిగదా, ఇటుక ముక్క కూడ కొనడానికి నిధులు ఉండవు.

ఇది కేవలం ఈ ప్రభుత్వానికి సాధారణంగానే చిన్నచూపు ఉన్న విశ్వవిద్యాలయాల కథ మాత్రమే కాదు, స్వయంగా ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్నానని గప్పాలు కొట్టుకుంటున్న, ఒక సెంటిమెంటుగా మార్చి ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్న నీటి పారుదల రంగంలో కూడా ఇదే స్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వ్యయంగా గత సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ, సవరించిన అంచనాలలోనూ రూ.2368 కోట్లు ఉండగా అది ఈ సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రూ.1348 కోట్లకు తగ్గిపోయింది. ఇక ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రగతి పద్దు కింద గత సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులు రూ.6094 కోట్లు కాగా, సవరించిన అంచనాల్లో అవి రూ.4341కోట్లకు తగ్గిపోయాయి. ఈ సంవత్సరం ప్రతిపాదనే రూ.974 కోట్ల కేటాయింపుగా ఉంది. ప్రగతి పద్దు కిందనే మరొక ఖాతాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు గత సంవత్సరం రూ.5386 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.3809 కోట్లకు తగ్గించి, ఈసారి బడ్జెట్‌లో అక్షరాలా ఏమీ కేటాయించలేదు.
ఇలా చెపుతూ పోతే, బడ్జెట్‌ పత్రాలలో (అవి 31 పుస్తకాలు – అర్థ గణాంక విశ్లేషణలో శిక్షణ పొందినవారికి తప్ప సాధారణ పాఠకులకు అర్థం కాని సంస్కృతం వంటి తిలకాష్టమహిషబంధనం అది) ఎన్నెన్నో విచిత్రాలు కనబడతాయి.

బడ్జెట్‌ అనేదే ప్రజలు తమ నెత్తుటిని చెమట చేసుకుని రూపొందించిన సంపదతో, చెల్లించిన పన్నులతో నిర్మాణమైనది గనుక బడ్జెట్‌ గురించి వివరంగా తెలుసుకోవడం ప్రజల హక్కు. ఆ సంపదను ప్రజల నుంచి కొల్లగొట్టి తమ విలాసాలకూ, తమ ఆశ్రితులకూ కాంట్రాక్టర్లకూ దోచిపెట్టడానికీ బడ్జెట్‌ పంపిణీ జరుగుతున్నది గనుక ప్రజలు తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి మూల్యం అనే మూలసూత్రం అన్నిటికన్న ఎక్కువగా పాలకుల ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో అమలు జరగాలి. కానీ, అందుకు తగిన వనరులూ అవకాశాలూ పరిజ్ఞానమూ మన ప్రజలకు అందకుండా చేయడమే పాలకులు సాధించిన విజయం. తెలంగాణలో సామెత చెప్పినట్టు దోసెడు బలపాలు చూపి భ్రమలు పెంచి, మురిసిపోయే సెంటిమెంట్లు రెచ్చగొట్టి నిజానికి సాగుతున్నది చారెడు చదువు కూడా కాదు, చిటికెడు చదువు మాత్రమే.

ఎన్‌. వేణుగోపాల్‌
సెల్‌: 9848577028 

Courtesy Nava telangana…