కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళితుడిని అవమానించిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌పై వేటు పడింది. అతడిని ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. టెక్కలిపట్నం గ్రామానికి చెందిన పర్రి జగన్నాథరావు అనే దళితుడు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా అతడి తల్లి ఎదురుగానే సీఐ బూటు కాలితో తన్ని కొట్టాడు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో దళిత, ప్రజా సంఘాలు ఆగ్రహించాయి. సీఐపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. స్పందించిన ఉన్నతాధికారులు వేణుగోపాల్‌ను సస్పెండ్‌ చేశారు.

క్షమాపణ చెప్పిన ఎస్పీ
జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్‌ బుధవారం బాధితులకు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పారు. బాధితుడు జగన్నాథరావు, అతడి తల్లి పారమ్మలను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి క్షమాపణ కోరారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటన దురృష్టకరమని, ఈ ఘటనకు సంబంధించి సీఐ తరఫున జగన్నాథరావు కుటుంబానికి తాను క్షమాపణ చెబుతున్నానని ఎస్పీ అన్నారు.

‘వృత్తికి వ్యతిరేకంగా, నిబంధనలు, వ్యక్తిత్వాన్ని పక్కనబెట్టి సీఐ వేణుగోపాల్‌ వ్యవహరించారు. ఇటువంటి సంఘటన ఎక్కడా జరగకూడదన్న ఉద్దేశంతో వెంటనే సీఐను సస్పెండ్‌ చేశాం. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో సీఐపై సెక్షన్‌ 323, సెక్షన్‌ 354 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. ఇటువంటి తప్పిదాలు మరే పోలీసు అధికారులు, సిబ్బంది చేయకుండా ఉండేందుకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తున్నాం. ఈ సంఘటనపై ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించాం. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే క్షమించేదిలేదు’ అని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పేర్కొన్నారు.

దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు: హోంమంత్రి
ప్రజల పట్ల అత్యుత్సాహం, అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. నేరాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. పలాస ఘటనలో దురుసుగా ప్రవర్తించిన కాశీబుగ్గ సీఐపై వేటు వేసినట్లు తెలిపారు. తప్పు చేస్తే పోలీసులు కూడా చట్టానికి అతీతులు కాదన్నారు. ‘‘దళిత వ్యక్తి పట్ల దురుసుగా వ్యవహరించారని తెలిసిన వెంటనే కాశీబుగ్గ సీఐపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఆయన్ను సస్పెండ్ చేశాం. అలానే దిశ పోలీస్టేషన్ల ఏర్పాటుతో మహిళపై జరిగే నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది’’అని పేర్కొన్నారు.

పోలీసుస్టేషన్‌లో శిరోముండనం