జమ్మూ కశ్మీర్‌ తన ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయి ఆర్నెల్లయింది. ఆగస్టు 5న కేంద్రప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి, 35ఎ రద్దుతో భూమి, ఉద్యోగాలు తదితర అంశాలపై దానికున్న హక్కులనూ లాక్కుంది. నిర్ణయాల అమలుకు వీలుగా పలు సెక్షన్ల ప్రయోగంతో, అదనపు సైనిక పోలీసు బలగాల మోహరింపుతో తీవ్ర నిర్బంధం మొదలైంది. విపక్ష పార్టీ నాయకులంతా అరెస్టయి నిర్బంధ శిబిరాల్లోకి తరలిపోగా, ప్రజలు దీర్ఘకాలం ఇళ్ళకే పరిమితమైపోవాల్సి వచ్చింది. నెలరోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించిన ప్రభుత్వానికి ఇన్ని నెలలైనా ఇంకా నమ్మకం కుదిరినట్టు లేదు. కశ్మీర్‌పై పార్లమెంటులో బుధవారం జరిగిన చర్చలో విపక్షాలు ఇదే అడిగాయి. దారికి తెస్తానన్న ప్రభుత్వం పరిస్థితిని మరింత దిగజార్చిందని విమర్శించాయి.

ఎలా దారికి తేవాలో ప్రభుత్వానికి ఇంకా స్పష్టమైన అవగాహన ఉన్నట్టు లేదు. వందలాదిమంది నిర్బంధంలో ఉన్నారన్న వాదనను ప్రభుత్వం ఎలాగూ అంగీకరించదు. బుధవారం హోంశాఖ సహాయమంత్రి రాజ్యసభకు తెలియచేసిన వివరాల ప్రకారం ప్రజాభద్రతాచట్టం కింద అక్కడ 390మంది మాత్రమే నిర్బంధంలో ఉన్నారు. స్థానికుల ప్రకారం ఈ లెక్క వేలల్లో ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రతి కేసునూ పరిశీలిస్తూ వరుసబెట్టి అందరినీ వదిలేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెబుతున్నది. అర్నెల్ల సందర్భాన్ని పురస్కరించుకొని కాబోలు బుధవారం ఇద్దరు నాయకులను ప్రభుత్వం విడిచిపెట్టింది. జైలుగా మారిన శ్రీనగర్‌ ఎమ్మెల్యే హాస్టల్‌నుంచి పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు సజ్జాద్‌లోన్‌, పీడీపీ నాయకుడు వాహీద్‌ పారా ఇలా బయటకు వచ్చారో లేదో వారిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను సంఘటిత పరచే శక్తి ఉన్న పెద్ద నాయకులు మినహా మిగతావారిని వదిలేయాలన్న నిర్ణయం కాస్తంత అటూఇటూగా అమలు జరుగుతున్నా అనేకులు ఇంకా ఏదో చోట నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. ‘సరైన సమయంలో’ అని ప్రభుత్వం అంటున్నది కనుక ఫారూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల విడుదల ఇప్పట్లో జరగదని అర్థం. చట్ట ప్రకారం ఒమర్‌, మెహబూబాలు ఈ వారంలోనే విడుదల కావాలి.

ఈ ఆరునెలల్లో ఎన్నో విన్యాసాలు. విపక్ష నాయకులను పోనివ్వకుండా మిగతా ప్రపంచానికి అంతా సవ్యంగా ఉన్నదని చూపడానికి భారత ప్రభుత్వం రెండు విదేశీ ప్రతినిధి బృందాలతో పర్యటనలు చేయించింది. ఐదునెలల తరువాత కశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించే పేరిట కేంద్రమంత్రుల యాత్రలూ జరిగాయి. ఇప్పుడు, కశ్మీర్‌కు ఉన్న అన్ని హక్కులూ హరించుకుపోయి, స్వతంత్రత పోయిన తరువాత ఇంతకాలమూ వాటిపైనే ఆధారపడి, కశ్మీర్‌ను మిగతా దేశంతో అనుసంధానిస్తూ వచ్చిన ప్రధాన స్రవంతి నాయకులు దాదాపు ఉనికి కోల్పోయారు. తయారవుతున్న కొత్తనాయకులు, నిర్బంధం నుంచి బయటకు వస్తున్న పాతవారు కేంద్రం దుశ్చర్యను ప్రశ్నించలేకపోవడం ప్రజల్లో మరింత అసహనాన్ని పెంచుతున్నది. ఈ ఆర్నెల్లకాలంలో ఇంటర్నెట్‌మీద ఆంక్షలు అన్ని వర్గాల ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. దేశంలోని మిగతా ప్రాంతాలకూ, విదేశాలకు జరిగే ఎగుమతులు స్తంభించిపోయి, పర్యాటకం, వ్యాపారం దెబ్బతినిపోయి, లక్షలమంది ఉపాధి కోల్పోయారు. కేవలం ఆర్నెల్లలో సంభవించిన ఆర్థికనష్టం కనీసం ఇరవైవేల కోట్ల రూపాయలని ఓ అంచనా.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్నెట్‌ పునరుద్ధరణ జరిగినా అది అత్యావశ్యకమైన రంగాలకు, అదీ పాక్షికంగా సామాజిక మాధ్యమాల వినియోగానికి ఏ మాత్రం వీల్లేని విధంగా టూజీ స్థాయిలోనే జరిగింది. ఇంటర్నెట్‌ ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నదని కశ్మీర్‌ ప్రెస్‌క్లబ్‌ మంగళవారం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని తొలుత సమర్థించిన జమ్మూలోనూ పునరాలోచన ఆరంభమైందనీ, తమ భూములు, ఉద్యోగాలకు భద్రత ఉండదేమోనన్న భయం మొదలైందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్‌లో కశ్మీర్‌కు ముప్పయ్‌వేల కోట్లు, లద్దాఖ్‌కు ఆరువేల కోట్లు కేటాయించి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసింది. ఎన్నడూ లేనంత వేగంగా, అధికంగా దాదాపు 20వేల ఎకరాల అటవీభూములను పారిశ్రామిక అవసరాలకు మళ్ళించే నిర్ణయాలు జరిగినట్టు, నలభై కంపెనీలు పదిహేనువేలకోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఏ మేరకు సాధ్యమవుతాయో, ప్రజల ఆగ్రహాన్ని ఎంతమేరకు ఉపశమింపచేస్తాయో తెలియదు కానీ, ఈ ఆర్నెల్ల జైలు శిక్ష ప్రభావం నుంచి కశ్మీర్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశాలైతే లేవు.

Courtesy Andhrajyothi