సిపిఎం కేంద్ర కమిటీ ఆందోళన
ఇండియా న్యూస్‌నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో ‘సాధారణ’ పరిస్థితి నెలకొన్నట్లు కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఇల్లెక్కి కూస్తున్నప్పటికీ, వాస్తవిక పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉందని సిపిఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. మూడు రోజుల పాటు ఇక్కడ జరిగిన ఆ పార్టీ కేంద్రకమిటీ సమావేశాల ముగింపు రోజు శుక్రవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదలజేసింది. కాశ్మీర్‌ పరిస్థితితోబాటు, దేశాన్ని నేడు పట్టి పీడిస్తున్న ఆర్థిక మాంద్యం గురించి, బిజెపి సంకుచిత ఎజెండాలో భాగమైన జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి), సంబంధిత అంశాలపైన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అలాగే కనీస వేతనాల గురించి కూడా ఇందులో ప్రస్తావించింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక శత వార్షికోత్సవాల గురించి పార్టీ కేంద్ర కమిటీ ఆ ప్రకటనలో ప్రస్తావించింది. కేంద్ర కమిటీ ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది.
కాశ్మీర్‌లో నిర్బంధం ఇప్పటికీ కొనసాగుతోందనడానికి కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్‌ యూసఫ్‌ తరిగామిని ఈ సమావేశానికి రానివ్వకుండా అడ్డుకోవడమే నిదర్శనం. ఆయన (తరిగామి) నిర్బంధంలో లేరని సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు అనుమతి ఎందుకు మంజూరు చేయలేదు? కాశ్మీర్‌లోయలో ‘సాధారణ పరిస్థితులు’ గురించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో వీసమెత్తు కూడా నిజం లేదని ఇది తెలియజేస్తోంది. ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి అక్కడ నెలకొన్నదనేది ఎవరూ కాదనలేని సత్యం. అక్కడ కమ్యూనికేషన్‌ వ్యవస్థ షట్‌డౌన్‌ ఇప్పటికీ కొనసాగుతున్నది.బస్సులు, రైళ్లు ఏవీ తిరగడం లేదు. స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు ఇప్పటికీ మూసే వున్నాయి. షాపులు, ఇతర వ్యాపార సంస్థలు మూతపడే వున్నాయి. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ దిగ్బంధనంతో రాష్ట్ర ప్రజలు ఇదివరకెన్నడూ లేనంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్‌లో బ్లాక్‌ డెవలెప్‌మెంట్‌ కౌన్సిళ్ల ఎన్నికలను ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. అంతే కాదు రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొన్నట్లు ప్రపంచాన్ని నమ్మింపజేసేందుకు కేంద్రం ఇటువంటి ట్రిక్కులను ప్రయోగిస్తున్నది. బ్లాక్‌డెవలెప్‌మెంట్‌ కౌన్సిల ఎలక్టొరల్‌ కాలేజిలో భాగమైన పంచ్‌లు, సర్పంచ్‌లకు చెందిన 61 శాతం స్థానాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. కమ్యూనికేషన్లను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజల కదలికలపైన, పౌరహక్కులపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని, నిర్బంధంలోవున్న రాజకీయ నాయకులను, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలన్న డిమాండ్‌ను సిపిఐ(ఎం) పునరుద్ఘాటిస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, అదే సరైన చర్య.
కనీస వేతనం రు.21 వేలు ఇవ్వాలి
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు కనీస నెలసరి వేతనం రు.21 వేలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి., ప్రస్తుత మాంద్యంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన కార్మికులకు నెలసరి జీవన భృతిని అందించాలని కేంద్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి, రక్షణ, బొగ్గు రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలి. బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు, ఎయిరిండియా వంటి సంస్థలను ప్రైవేటీకరించటాన్ని వెంటనే విరమించుకోవాలి. జాతీయ ఉపాధి హామీ పనులకు నిధుల కేటాయింపును పెంచాలి. గత బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు చేసి కూలీలకు నిర్ణీత కనీస వేతనం అందేలా సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలి. వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించేందుకు, రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకుగాను రైతులకు ఒకే దఫా రుణమాఫీ అమలుచేయాలి. వ్యవసాయోత్పత్తులకు పెట్టుబడి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ప్రకటించాలి. వృద్ధాప్య, వితంతు పెన్షన్లను నెలకు రు.3000కు పెంచాలి.
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్రకమిటీ చర్చించింది. సీట్ల సర్దుబాటు గురించి వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. బిజెపి నేతృత్వంలోని మతోన్మాద, ఫాసిస్టు శక్తులను ఓడించి, చట్టసభల్లో వామపక్ష ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా సిపిఎం ఈ ఎన్నికల్లో పోరాడుతుందని కేంద్ర కమిటీ వివరించింది.

కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 2020 అక్టోబర్‌ 17 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ వ్యవస్థాపక ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

కేరళలో ఎల్‌డిఎఫ్‌ విజయం
కేరళలోని పాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు కేంద్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది. యుడిఎఫ్‌కు మంచి పట్టు ఉన్న కేంద్రంగా పరిగణించే ఈ స్థానంలో విజయం సాధించడం మామూలు విషయం కాదు. అందులోనూ ఎల్‌డిఎఫ్‌కు, దాని అభ్యర్థులకు వ్యతిరేకంగా యుడిపెఫ్‌ పెద్దయెత్తున ప్రచారం చేసినప్పటికీ, వాటన్నిటిని అధిగమించి ఎల్‌డిఎఫ్‌ ఈ విజయం సాధించడం గొప్ప విషయమే.

ఆర్థిక సంక్షోభం…
దేశంలో ఆసాధారణ ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగిత, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న వేలాది మంది కార్మికులు, కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. వివాదాస్పదంగా మారిన 2011-12 ఆధారిత సంవత్సరం ప్రాతిపదికన జిడిపి వివరాలను పరిశీలిస్తే గత ఐదు త్రైమాసికాల్లో అంటే 2017-18లో నాల్గవ త్రైమాసికంలో 8.1 శాతంగా ఉన్న జిడిపి 2019-20 తొలి త్రైమాసికంలో 5శాతానికి పడిపోయింది. పారిశ్రామికోత్పత్తుల సూచీ కూడా ఆర్థిక మాంద్యాన్ని నిర్ధారిస్తున్నది. 2019 ఏప్రిల్‌ -జులై మధ్య పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి వృద్ది రేటు సూచీ 2.8గా నమోదయింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. స్థూలంగా ఐఐపి వృద్ధి రేటుల ఏప్రిల్‌-జులై మధ్య ఇదే విధంగా క్షీణించడాన్ని మనం చూస్తాము. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అది 3.3 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఐఐపి వృద్ధి రేట్లు 5.4 శాతంగా ఉంది. యంత్రాలు వంటి కేపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి కూడా ప్రతికూల వృద్ధిరేటు నమోదు చేసుకుంది. గత ఏడాది 7.1 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు 4.3 శాతానికి పడిపోయింది. వినిమయ వస్తువుల ఉత్పత్తి కూడా 2.7 శాతానికి దిగజారింది ఇటువంటి పరిస్థితులతో దేశంలో నిరుద్యోగిత గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయింది. అధికారిక గణాంకాల ప్రాతిపదికగా సిఎంఐఇ వేసిన అంచనాల ప్రకారం గత నెల 27 నాటికి దేశంలో నిరుద్యోగిత 9.94 శాతానికి చేరింది. ఇది గత అర్ధశతాబ్ది కాలంలోనే అత్యధికం. ఆగస్టు చివరి నాటికి దేశంలో 4.5 కోట్ల మంది నిరుద్యోగులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 1.1 కోట్ల మేర అధికం. దేశంలో యువ నిరుద్యోగుల సంఖ్య 28 శాతం మేర వున్నట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి కల్పనకు ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. అప్పటి వరకూ యువతకు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం వామపక్షాల పిలుపు మేరకు ఈ నెల 10,16 తేదీల్లో జరిగే జాతీయస్థాయి నిరసన ప్రదర్శనల్లో ప్రజలను పెద్దయెత్తున సమీకరించాలని అన్ని స్థాయిల్లోని పార్టీ కమిటీలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

ఎన్‌ఆర్‌సి ప్రక్రియ…
జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియను తమ రాష్ట్రాలలో కూడా చేపట్టాలని బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌ఆర్‌సి అనేది అసోం ఒప్పందంలో భాగం, ఇది కేవలం అసోం రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనట్టిది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అసోంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలకు ఎన్‌ఆర్‌సి జాబితాలో చేర్చకుండా వదిలేశారు. సహజమైన భారతీయ పౌరులనెవరినీ దీని నుంచి మినహాయించరాదు. ఇందుకు సంబంధించిన అప్పీళ్లన్నింటిపై ఎటువంటి వివక్షకూ తావు లేకుండా న్యాయవ్యవస్థ పరిశీలించి తగు విధంగా సర్దుబాటు చేసేలా చూడాలి. ‘ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌’ విదేశీయులుగా ప్రకటించిన వారిని నిర్బంధించేందుకు ఉపయోగిస్తున్న నిర్బంధ కేంద్రాలలో ఎలాంటి కనీస వసతులు లేవు. అక్కడి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. ఇది ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించటమేనని కేంద్ర కమిటీ భావిస్తున్నది. ఈ నిర్బంధ కేంద్రాలను వెంటనే మూసివేసి ప్రజల అప్పీళ్లు పరిష్కారమయ్యే వరకూ వారిని యధాతథ స్థితిలో కొనసాగించాలి. అసోం వెలుపలి ప్రాంతా లలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ చేపట్టడాన్ని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది. జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) తయారీకి ప్రయత్నాలను పున్ణప్రారం భించిన ప్రభుత్వం దీనిని అఖిల భారత స్థాయిలో ఎన్‌ఆర్‌సి ప్రక్రి యకు ప్రాతిపదికగా చేసుకుంటున్నది. నిర్బంధ కేంద్రాలుగా వినియోగించేందుకు వీలుగా కొన్ని భవనాలను నిర్మించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆధార్‌ కార్డులను అన్నిటికీ వర్తింప జేస్తున్నది. దేశంలోని ఓటర్లరందరికీ ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నది. ఓటర్ల జాబితా సవరించే ప్రక్రియ ప్రతి యేటా కొనసాగుతున్నది. ఇవన్నీ ఉండగా అసోం వెలుపల ఎన్‌పిఆర్‌ ఎన్యూమరేషన్‌ ప్రక్రియను చేపట్టటం, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తేవడం వంటివి దేశంలో ప్రజల మధ్య మత చిచ్చు రగిల్చి, తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ఆరెస్సెస్‌, బిజెపి ప్రాకులాడుతున్నాయి.

Courtesy Prajasakthi..