– భూయాజమాన్య హక్కుల్లో మార్పులు..!! 
– జమ్మూకాశ్మీర్‌లో అక్టోబర్‌ 31 నుంచి అమలు 
– పరిశ్రమల పేరుతో కార్పొరేట్ల చేతుల్లోకి..? 

ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర విభజన చట్టం సర్దార్‌ పటేల్‌ జన్మదినమైన అక్టోబర్‌ 31 నుంచి అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాంతో, ఆ తేదీ నుంచి జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. ఆ తర్వాత విభజన చట్టంలోని అంశాల్ని అక్కడ అమలు చేస్తారు.
జమ్మూకాశ్మీర్‌ పునర్విభజన చట్టంలోని 95 సెక్షన్‌ ప్రకారం అక్కడి చట్టాల్లో జరగనున్న మార్పుల గురించి తెలిపారు. వాటిని విభజన చట్టంలోని నాలుగో షెడ్యూల్‌లో పొందుపరిచారు. దాని ప్రకారం 106 కేంద్ర చట్టాలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌లకూ వర్తిస్తాయి. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో అమలైన 330 రాష్ట్ర చట్టాలు, గవర్నర్‌ ఆదేశాల్లో(చట్టాల్లో) 164 మాత్రమే కొనసాగుతాయి. ఇందులోనూ ఏడు చట్టాలు మార్పులు, చేర్పులతో ఉనికిలోకి వస్తాయి. వీటిలో ఆరు చట్టాలు భూయాజమాన్య హక్కులకు సంబంధించినవన్నది గమనార్హం.

370 అధికరణం రద్దుతో దానికి అనుబంధంగా ఏర్పడిన 35ఏ అధికరణం కూడా రద్దయిన విషయం తెలిసిందే. 35ఏ ప్రకారం అక్కడి భూయాజమాన్య హక్కులు స్థానికులకు(శాశ్వత నివాసితులకు) మాత్రమే పరిమితం. ఇప్పుడిక ఆ నిబంధన అక్కడ చెల్లుబాటు కాదు. మిగతా రాష్ట్రాల్లో వలె భూయాజమాన్య హక్కులు మారిపోతాయి. ఇతర రాష్ట్రాలవారు కూడా అక్కడ భూమి కొనుగోలుకు వీలుంటుంది. అంతేకాదు, అక్కడ గతంలో భూసంస్కరణలు కూడా అమలయ్యాయన్నది గమనార్హం.
షేక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అక్కడ భూసంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూఎస్టేట్ల రద్దు చట్టం 1950 ప్రకారం ఆ రాష్ట్రంలో తోటలుగానీ, పంట భూములుగానీ ఒక్కో కుటుంబానికి 23 (22.75) ఎకరాలకు మించి ఉండకూడదు. అయితే, అక్కడ భూసంస్కరణల్ని అమలు చేసిన తీరు మిగతా రాష్ట్రాలకు భిన్నం. జమ్మూకాశ్మీర్‌లోని భూస్వాముల నుంచి అదనపు భూమిని స్వాధీనం చేసుకున్నందుకు ఆ ప్రభుత్వం ఎలాంటి పరిహారాన్నీ ఇవ్వకపోవడం గమనార్హం. అప్పట్లో అక్కడి భూస్వాముల్లో అధిక భాగం కాశ్మీరీ పండిట్‌, డోగ్రా వర్గాలకు చెందినవారు. దాదాపు 9000మంది భూస్వాముల నుంచి 4,50,000 ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వం స్వాధీనపరచుకున్నది. అందులో 2,30,000 ఎకరాలను రైతులకు పంచింది. ఆ రాష్ట్రంలోని ప్రత్యేక చట్టాన్ని కోర్టుల్లో సవాల్‌ చేయడానికి వీల్లేకపోవడం వల్లే అది సాధ్యమైంది.

ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో పరిస్థితి మరో రూపంలో మొదటికి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్‌ సంస్థలు ఆ రాష్ట్రంలోని రైతులు, ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసి పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల్ని తమ చేతుల్లోకి తీసుకునే వీలున్నది. అదే జరిగితే మరోసారి అక్కడి స్థానికుల( అన్ని మతాల ప్రజల) నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి శాంతిభద్రతలు, రెవెన్యూ (భూయాజమాన్య) చట్టాలు మిగతా రాష్ట్రాల్లోనూ రాష్ట్రాల పరిధిలోని అంశాలే. అయితే, ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదా కూడా తీసేయడంతో ఈ రెండు అధికారాలు కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. గవర్నర్‌ స్థానంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే కీలక అధికారాలుంటాయి. జమ్మూకాశ్మీర్‌కు అసెంబ్లీ, ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉన్నా వారికుండేది పరిమిత అధికారాలే. దాంతో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే అందుకు అనుగుణంగానే అక్కడి పాలనా వ్యవహారాలుంటాయన్నది అర్థమయ్యేదే..

 

(Courtacy Nava Telangana)