కాశ్మీర్‌ లోయలో దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరైనా భూములతో సహా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌తో కార్పొరేట్‌ భూ రాబందులు సందర కాశ్మీరాన్ని కారుమబ్బుల్లా కమ్ముకోవడానికి తెర లేచింది. సంఘపరివారం కాశ్మీర్‌ ఎజెండా వెనుక దాగున్న కార్పొరేట్‌ ప్రయోజనాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. భూతల స్వర్గంగా ఖ్యాతిగాంచిన సుందర కాశ్మీరంపై ఇన్నేళ్లూ సంఘపరివారం చేసిన విష ప్రచారం ఇంతా అంతా కాదు. 370వ అధికరణం, అసెంబ్లీకి ప్రత్యేక హౌదాలను సాకుగా చూపుతూ విషం చిమ్మింది. వాటిని రద్దు చేస్తే కానీ, దేశంలో పూర్తిగా అంతర్భాగం కాదని 70ఏండ్లుగా చెప్పిందే చెప్పింది. తమ చెప్పుచేతుల్లో నడిచే పార్టీ పార్లమెంటులో పూర్తి మెజార్టీ సాధించగానే అన్నంత పని చేసి, పూర్తి స్థాయిలో అంతర్భాగం అయిపోయిందని ప్రకటించింది. నరేంద్రమోడీ నేతత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏడాది క్రితం ఈ పని చేయడానికి ముందు, చేసిన తరువాత కూడా కాశ్మీరం భారతదేశంలో భాగమే! మరి కొత్తగా ఏం తేడా వచ్చింది? సంఘ పరివారీయులు ఏండ్ల తరబడి కాశ్మీర్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి దశాబ్దాల తరబడి దేశ ప్రజల్లో విద్వేషాన్ని నూరిపోశారు? ఇంతకాలం అర్ధం కాని వారికి కూడా ఇప్పుడు అర్ధమయ్యే రోజు వచ్చింది!

కాశ్మీర్‌కు స్వయంప్రత్తిపత్తి, ప్రత్యేక హౌదాలకు పూచీపడిన 370, 35(1) అధికరణాలు ఉన్నంతకాలం అక్కడి భూమిని స్థానికేతరులు కొనడానికి వీలులేదు. ఏడాది క్రితం వాటిని రద్దు చేసినప్పటికీ కార్పొరేట్ల కలలు నెరవెరడానికి అనేక చిన్నా, చితక చట్టాలు అడ్డంకిగా నిలిచాయి. దీనికోసమే మోడీ ప్రభుత్వం ఏకంగా 26 చట్టాలను మార్చివేసింది. జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ (కేంద్ర చట్టాల వర్తింపు) పేరిట కొత్త చట్టాన్ని ఎవరినీ సంప్రదించకుండా, నామ మాత్రపు చర్చ లేకుండా హడావిడిగా, ఏకపక్షంగా అమలులోకి తీసుకు వచ్చింది. అంబానీలు, ఆదానీలకు కాశ్మీర్‌లోని ప్రకతి సంపదను సొంతం చేసుకునే వీలు కల్పించింది. కరోనా కష్టకాలంలో దేశ సంపదను ఒకవైపు దోచిపెడు తూనే, జమ్మూ, కాశ్మీర్‌లోని భూ యాజమాన్య చట్టలను మోడీ పరివారం చెత్తబుట్టలోకి విసిరింది. ఈ చర్యతో సుందర కాశ్మీరాన్ని కబళించాలన్న కార్పొరేట్ల చిరకాల స్వప్నం నెరవేరింది.

ఏ విధంగా చూసినా కాశ్మీర్‌ భారత యూనియన్‌లో విలీనం కావడానికి ముందు అంగీకరించిన షరతులను భారత ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇది కాశ్మీరీయుల్లో అపనమ్మకానికి దారితీసింది. దానిలోంచి వేర్పాటువాదం, ఉగ్రవాదం పుట్టుకొచ్చింది. వాటిని అణచివేసే పేరిట కేంద్రం మరిన్ని అధికారాలను చేజిక్కించుకుంటూ వచ్చింది. ఇదంతా చరిత్ర! ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇంకా ముందుకు పోయింది. 370 అధికరణాన్ని, ప్రత్యేకహౌదాను రద్దు చేసింది. మున్సిపాల్టీలు నిర్ణయించే ఆస్తిపన్నును కూడా కేంద్రమే విధిస్తోంది. నిజానికి కాశ్మీర్‌లో ఆనాటి షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వం పేదలందరికి భూమిని పంచడంతో పాటు, అవి అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి అనేక చట్టాలను రూపొందించింది. ఇప్పుడు ఆ చట్టాలన్నింటిని మోడీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసింది. ఏకపక్షంగా భూ చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ పరచిన మోడీ ప్రభుత్వం అంతటితో ఆగకుండా కాశ్మీర్‌ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులపై దాడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఘోరం! బాధతో వచ్చే మూలుగును కూడా భరించలేని తనం!! తరతరాలుగా నమ్ముకున్న నేలతల్లి దూరం అయితే, సొంత గడ్డ మీద కాశ్మీరీయులు పరాయివారుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ దుర్మార్గాన్ని ప్రతిఘటించడానికి సిద్ధపడుతున్న కాశ్మీరీయులకు అండగా దేశ ప్రజలు నిలవాల్సిన సమయమిది!

Courtesy Nava Telangana