హరియాణా సీఎం కట్టర్‌ వ్యాఖ్యలు

ఆర్టికల్‌ 370ని ఎత్తివేయడంతో కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ చేసిన వ్యాఖ్యలు హేయమైనవని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ నుంచి ఏళ్లుగా శిక్షణ పొందిన కట్టర్‌ బలహీన మనస్తత్వం, భద్రతలేమి, జాలి కలిగించే స్థితికి చేరుకున్నారనేందుకు ఆయన వ్యాఖ్యలే నిదర్శమని ట్విటర్‌లో దుయ్యబట్టారు. హరియాణా ప్రజలకు కూడా ఇక నుంచి కశ్మీర్‌ నుంచి అమ్మాయిలను తెచ్చుకునే అవకాశం ఏర్పడిందని శుక్రవారం ఫతేబాద్‌లో ఓ కార్యక్రమంలో కట్టర్‌ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

కాగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని కట్టర్‌ వివరణ ఇచ్చారు. దేశంలోని ఆడపడుచులంతా మన బిడ్డలేనన్నారు. హరియాణాలో లింగనిష్పత్తి పరంగా అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతూ తానీ మాటలు అన్నానని వివరణ ఇచ్చారు. వక్రీకరించిన వార్తలపై స్పందించడం రాహుల్‌ స్థాయికి తగదని ట్విటర్‌లో పేర్కొన్నారు. వీలైతే తాను ఏమి మాట్లాడాననేది వీడియోలో చూడొచ్చంటూ క్లిప్పింగ్‌ను జత చేశారు. కాగా, కట్టర్‌ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ఆయన మాటలు సంఘ్‌ సిద్ధాంతంలోని డొల్లతనాన్ని బయటపెట్టాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ట్విటర్‌లో విమర్శించారు.

 

(Courtacy Andhrajyothi)