– జమ్మూకాశ్మీర్‌లో విద్యార్థులులేక బడులు, కాలేజీలు వెలవెల
– విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్రప్రభావం: విశ్లేషకులు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, ఆంక్షల నేపథ్యంలో తిరిగి 66 రోజుల అనంతరం కాలేజీలు ప్రారంభమయ్యాయి. అయితే జమ్మూకాశ్మీర్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా విఫలమవుతున్నది. బుధవారం కాలేజీలు ప్రారంభించినప్పటికీ విద్యార్థులు రాకపోవడంతో అవి వెలవెలబోయాయి. పాఠశాలల పరిస్థితి కూడా ఇలానే ఉన్నది. ఈనెల 3న పాఠశాలలు, 9న కాలేజీలను పున:ప్రారంభించనున్నట్టు కాశ్మీర్‌ డివిజనల్‌ కమిషనర్‌ బషీర్‌ఖాన్‌ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కాలేజీలకు సిబ్బంది తప్ప, విద్యార్థులు రాలేదని అధికారులు తెలిపారు. విద్యార్థులు రావడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సంబంధిత అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో పూర్తిస్థాయిలో సమాచార వ్యవస్థను పునరుద్దరించకపోవడం, భద్రతా కారణాల వల్ల కుటుంబ సభ్యులు తమ పిల్లలను పాఠశాలలకు, కాలేజీలకు పంపడంలేదు. అలాగే పలు కాలేజీలు, బడులలో ఇప్పటికీ భద్రతాబలగాలు ఉండటంతో వచ్చిన కొద్దిమంది విద్యార్థులు తిరిగి ఇంటిదారి పడుతున్నారు. దీనికి తోడు ఆంక్షల కారణంగా రెండు నెలల నుంచి జమ్మూకాశ్మీర్‌లో జనజీవనం స్థంభించింది. ప్రజలు ఇప్పటికీ భయం గుప్పిట్లో బతుకులీడుస్తున్నారు. నగరాల్లో సైతం ప్రభుత్వ వాహనాల కదలికలు లేవు. తక్కువ మొత్తంలో ప్రయివేటు వాహనాలు పలుచోట్ల తిరుగుతున్నాయి. అయితే తాజా పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపే అవకాశమున్నదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీనగర్‌కు చెందిన రుబాన్‌ అనే విద్యార్థి మాట్లాడుతూ..ఇక్కడ పరిస్థితులు ఏం బాగులేవు. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. రవాణా సౌకర్యాలు లేవు. ఈ కారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపించడానికి భయపడుతున్నార’ని వివరించాడు. చాలామంది విద్యార్థుల నుంచి ఇదే అభిప్రాయం రావడం తాజా పరిస్థితికి అద్దంపడుతున్నది.

‘కిష్ట్వార్‌’లోనే 100 పైగా కాశ్మీరీల అరెస్టు
జమ్మూకాశ్మీర్‌లోని ‘కిష్ట్వార్‌’ ప్రాంతంలోనే 100 మందికి పైగా పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా అదుపులోకి తీసుకున్న వారిని ఎక్కడ ఉంచారో బాధితకుటుంబాలకు సైతం సమాచారం లేకపోవడం గమనార్హం. ఏ నేరానికి అరెస్టు చేశారని వారి కుంటుంబీకులు సంబంధిత అధికారులను అడిగినా వారినుంచి సమాధానం రాలేదనీ స్థానికులు వాపోతున్నారు. అయితే అరెస్టయిన వారిని స్థానిక ఆర్మీ స్థావరంలో ఉంచినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్ట్వార్‌లో కొద్ది రోజుల క్రితం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ నుంచి పలువురు ఉగ్రవాదులు తుపాకులు, బుల్లెట్లు దొంగిలించారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి కార్డన్‌ సెర్చ్‌ పేరిట భద్రతా బలగాలు సోదాలు నిర్వహించి పలువురు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు స్థానికులే సహకరించి ఉంటారనీ పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు చెబుతున్న దాన్ని కట్టుకథ అంటూ స్థానికులు ఖండించడం గమనార్హం.

Courtesy Navatelangana