కాశ్మీర్‌ను జైలుగా మార్చారు

ప్రభుత్వం చెబుతున్నట్లు అక్కడ ప్రశాంతంగా లేదు
అన్యాయం చేశారని మోడీ సర్కార్‌పై కాశ్మీరీల ఆక్రోశం
ప్రముఖ ఆర్థిక వేత్త జీన్‌ డ్రెజ్‌, ఐద్వా నేత మొమునా మొల్లా, కవితా కృష్ణన్‌ 
కాశ్మీర్‌ లోయను ఐదు రోజుల పాటు సందర్శించిన బృందం
కాశ్మీర్‌ పర్యటన డాక్యుమెంటరీని ప్రదర్శించొద్దని ప్రెస్‌క్లబ్‌ హుకుం

ఆపిల్‌ తోటలు, కుంకుమ పువ్వు తోటలతో ఆహ్లాదకరంగా ఉండే యావత్‌ కాశ్మీర్‌ను జైలుగా మార్చారని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్‌ డ్రెజ్‌ పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు, అక్కడ ప్రశాంత వాతావరణం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. జమ్ముకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35(ఏ) రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రముఖ ఆర్థిక వేత్త జీన్‌ డ్రైజ్‌, ఐద్వానాయకురాలు మొమునా మొల్లా, ఎఐపిడబ్ల్యుఎ నాయకురాలు కవితా కృష్ణన్‌, ఎన్‌ఎపిఎం నేత విమల్‌ భారుల బృందం కాశ్మీర్‌లో ఐదు రోజులపాటు (ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకు) పర్యటించింది. కాశ్మీర్‌ పర్యటనలో తమ దృష్టికి వచ్చిన అంశాలను బుధవారం నాడిక్కడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.

ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ మాట్లాడుతూ వాస్తవానికి ఆర్టికల్‌ 370 జమ్మూ కాశ్మీర్‌ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు ఉపయోగపడిం దనిó, అక్కడి ప్రజల్లో పేదరికాన్ని తగ్గించిందని చెప్పారు. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో రైతాంగ ఉద్యమం జరిగి రైతులకు భూములు దక్కాయని, దానివల్లే ఆర్థిక అసమానతలు తగ్గాయని అన్నారు. అక్కడి ప్రజల్లో ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు లేవని అన్నారు. ఆర్టికల్‌ 370, 35(ఎ) ద్వారా ఇతర ప్రాంతాల పెట్టుబడిదారీ శక్తులు అక్కడ భూముల కొనుగోలు చేయలేకపోతున్నాయని, సొంత భూము లుండటంతో అక్కడివారంతా ఆర్థికంగా ఎంతో కొంత స్థిరపడగలిగారని అన్నారు. మత కోణం, ఉగ్రవాద నిర్మూలన కోణం చూపించి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామిక వ్యవస్థలను, విధానాలను పరిహసించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాశ్మీర్‌లో ఇబ్బందికర వాతావరణంపై దృష్టి సారించాలని కోరారు. తమ పర్యటనలో కొన్ని ఎటిఎం, మెడికల్‌ షాపులే నడుస్తూ కనిపించాయని అన్నారు. స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయా లు, బ్యాంకులు, పెట్రోల్‌ బంకులు, కిరాణా షాపులు సైతం మూసివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి రెండు మూడు రోజులు నిత్యావసర వస్తువులు అందకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు చెప్పారని, అందుకు వీడియో ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ప్రజానీకం నుంచి తీవ్రమైన ప్రతిఘటన తొందరలోనే మొదలవుతుం దని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అక్కడి ప్రజలంతా భయాందోళనల మధ్య జీవనాన్ని కొన సాగిస్తున్నారని అన్నారు.

వీడియో ప్రదర్శనకు ప్రెస్‌ క్లబ్‌ యాజమాన్యం అనుమతి నిరాకరణ
ఐదు రోజుల పర్యటనపై ఆ బృందం అక్కడి పరిస్థితులపై ఒక వీడియోను సైతం తయారు చేశారు. అక్కడి పరిస్థితిని, కాశ్మీర్‌ ప్రజానీకం ఆందోళనలను వీడియో డాక్యుమెంటరీ ద్వారా వివరించేందుకు బృందం సభ్యులు ప్రయత్నించారు. అయితే వీడియో ప్రదర్శించేందుకు ప్రెస్‌క్లబ్‌ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. అంతే కాకుండా ప్రెస్‌క్లబ్‌ యాజమాన్యం ఓవరాక్షన్‌ చేసింది. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ఆర్థిక వేత్త జీన్‌ డ్రెజ్‌ మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌లో కాకపోతే మరెక్కడ ఆ వీడియో ప్రదర్శనకు అవకాశం వుంటుందని ప్రశ్నించారు. మరే ఇతర ప్రెస్‌క్లబ్‌, యూనివర్శిటీల్లో ప్రదర్శించ నివ్వరని తమకు తెలుసునని అన్నారు. ఇదివరకు ఎప్పుడూ లేని నిబంధనని తమ ప్రెస్‌మీట్‌కి పెట్టడం ఏంటని కాశ్మీర్‌ పర్యటన బృందం నాయకురాలు మొబునా మొల్లా ప్రెస్‌క్లబ్‌ యాజమాన్యాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. వీడియోలు ప్రదర్శిస్తే భద్రతాపరంగా తమకు ఇబ్బందులు ఏర్పడుతాయని అందుచేతనే తాము అనుమతించడం లేదని క్లబ్‌ ప్రతినిధులు చెప్పారు. దీంతో ఆ వీడియోలను తరువాత సామాజిక మాధ్యమాల్లో పెడతామని అక్కడున్న జర్నలిస్టులకు చెప్పి, కేవలం పర్యటనకు సంబంధిం చిన సమాచారాన్ని మీడియాకు అందించారు.

కాశ్మీరీలంతా ఆగ్రహంతో ఉన్నారు- మొమునా మొల్లా, ఐద్వా
తమ ప్రాంతానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్యాయం చేశారని కాశ్మీరీలంతా ఆగ్రహంగా ఉన్నారని ఐద్వా నాయకురాలు మొమునా మొల్లా పేర్కొన్నారు. అన్యాయంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, 35(ఏ)లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో అక్కడి ప్రజానీకం నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు మోడీ సర్కార్‌ యావత్‌ కాశ్మీర్‌ను జైలుగా మార్చిందని విమర్శించారు. బిజెపి సర్కార్‌ రాజకీయ లబ్ది కోసం కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించారని మండిపడ్డారు. జాతీయ మీడియా కూడా జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు సవ్యంగా ఉన్నాయని చెప్పడం సరికాదని దారుణమన్నారు. కేవలం శ్రీనగర్‌లోని ఎక్కడో ఒక చిన్న ప్రాంతంలో కొంతమేరకు సాధారణ పరిస్థితులు ఉంటే, దాన్ని జాతీయ కార్పొరేట్‌ మీడియా తమ ఛానళ్ళలో చూపిస్తూ, కాశ్మీర్‌ అంతా సవ్యంగా ఉందని అనడం దారుణమన్నారు. కాశ్మీర్‌ విషయంలో కార్పొరేట్‌ మీడియా ప్రభుత్వానికి వంతపాడుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని ఎత్తివేసిన తరువాత అక్కడి ప్రజానీకంలో భయం, ఆగ్రహం వెల్లువెత్తుతున్నాయని అన్నారు. వారి ఆక్రోశాన్ని అణచివేసేందుకే కేంద్రం అక్కడ కర్య్ఫూ విధించిందని వివరించారు. కానీ సర్కార్‌ మాత్రం కర్ఫ్యూ విధించడం లేదని చెప్పడం దారుణమన్నారు.

చిన్నారులను సైతం జైల్లో పెట్టారు : కవితా కృష్ణన్‌, ఎఐపిడబ్ల్యుఎ
కాశ్మీర్‌లో చిన్నారులను సైతం జైల్లో పెడుతున్నారని ఎఐపిడబ్ల్యుఎ నాయకురాలు కవితా కృష్ణన్‌ విమర్శించారు. కార్పొరేట్‌ మీడియా చెప్పిన దానికంటే ఎక్కువ సంఖ్యలో కాశ్మీర్‌లో భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఒక్కో కాశ్మీరీ కోసం సుమారు నలుగురు సిఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారని, పోలీసులు, బలగాలు లేని ఒక్క గల్లీ కూడా లేదని చెప్పారు. ఎంతోమంది యువకులు పెల్లెట్‌ గాయాలతో బాధపడుతున్నా రని అన్నారు. తమ పర్యటనలో 10 మందికిపైగా పెల్లెట్‌ గన్‌ గాయాలైన యువకులతో మాట్లాడా మన్నారు. కర్య్ఫూ సమయంలో ఇంటి తలుపులు, కిటికిలు తీసినా పోలీసు బలగాలు పెల్లెట్‌ గన్స్‌తో కాలుస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారన్నారు. ఎన్‌ఎపిఎం నేత విమల్‌భారు మాట్లాడుతూ ఆర్టికల్‌ 370, 35ఎ ఎత్తివేతను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాశ్మీర్‌కి సంబంధించి ఏ నిర్ణయమైనా అక్కడి ప్రజానీకంతో మాట్లాడిన తరువాతే తీసుకోవాలన్నారు. ఆ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌, టెలిఫోన్‌, సెల్‌ఫోన్‌లపై నిషేధం ఎత్తివేయాలన్నారు. పాత్రికేయులు, ఆందోళనకారులకు స్వేచ్ఛ కల్పించాలని అన్నారు.

(Courtacy Prajashakti)

Leave a Reply