* ఆర్టికల్‌ 370 రూపకల్పనలో పటేల్‌ భాగస్వాములే
* అంబేద్కర్‌ వ్యతిరేకించారనడం అవాస్తవం
* నెహ్రూ ఇమేజ్‌ను మసకబార్చే యత్నం : మాజీ ప్రొఫెసర్‌ రామ్‌ పునియాని
                 న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత సుమారు నెరన్నర రోజులుగా ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్‌మీడియాలోనూ ఆరెస్సెస్‌, బీజేపీ చేస్తున్న ప్రచారమంతా అవాస్తవమేనని ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రొఫెసర్‌ రామ్‌ పునియా అంటున్నారు. గతనెల 5న జమ్మూకాశ్మీర్‌లో నిర్బంధం విధించి ఆర్టికల్‌ 370ని, 35(ఏ)ను మోడీ సర్కారు రద్దు చేయడం వెనుక ఆరెస్సెస్‌ హస్తమున్నదనీ.. ఆ సంస్థ ప్రధాన ఎజెండాలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయానికి పూనుకున్నదని ఆయన ఆరోపించారు. 370 కారణంగా అక్కడ అభివృద్ధి ఆగిపోయిందనీ, అలాగే వేర్పాటువాదం కూడా పెరిగిందని కేంద్రం చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని ఆయన విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆంగ్ల వెబ్‌ న్యూస్‌ ఛానెల్‌ ‘న్యూస్‌క్లిక్‌’లో ఆయన వ్యాసం రాశారు.
రామ్‌ పునియా పేర్కొన్న దాని ప్రకారం.. జమ్మూకాశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న దానికి సమర్థనగా ఈనెల నాలుగో తారీఖున బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ వీడియోను విడుదల చేశారు. 11 నిమిషాలున్న ఆ వీడియో చివర్లో.. ‘దేశ తొలి ప్రధాని నెహ్రూ కాశ్మీర్‌ విషయంలో చారిత్రక తప్పిదం చేశార’నే ప్రధాని మోడీ ప్రసంగంతో అది ముగిసింది. 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసిన సర్దార్‌ వల్లభభారు పటేల్‌ను కాదనీ, నెహ్రూ కాశ్మీర్‌ అంశాన్ని తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆ వీడియోలో ఉంది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం మూలానే అక్కడ సమస్యలు తలెత్తాయని అందులో పేర్కొన్నారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. కాశ్మీర్‌ విషయంలో సర్ధార్‌ పటేల్‌ ముంబైలో 1948, అక్టోబర్‌ 30న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముస్లిం మెజారిటీ అధికంగా ఉన్న కాశ్మీర్‌లోని ప్రజలు పాక్‌కు వెళ్లిపోవాలని కొంతమంది అంటున్నారు. మేము అక్కడికి ఎందుకు వెళ్లామని వాళ్లు అంటున్నారు. దానికి నా సమాధానం ఒక్కటే.. కాశ్మీర్‌ ప్రజలు మమ్మల్ని పిలిచారు కాబట్టే మేమిక్కడ ఉన్నాం. వారు మమ్మల్ని వద్దనుకున్న మరుక్షణం మేం అక్కడ ఉండబోం’ అని పేర్కొన్నారు.
370 అధికరణం హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. వందలాది సమావేశాలు, చర్చల తర్వాత దానిని రూపొందించారు. అది తయారుచేసిన కానిస్టిట్యూషన్‌ అసెంబ్లీ (సీఏ)లో షేక్‌ అబ్దుల్లా, మీర్జా అఫ్జల్‌ బేగ్‌, అంబేద్కర్‌లతో పాటు పటేల్‌ కూడా ఉన్నారు. ఈ ఆర్టికల్‌ను అంబేద్కర్‌ వ్యతిరేకించారనీ, పటేల్‌ దీనిని అంగీకరించలేదని చెప్పడం కంటే అబద్ధం మరొకటి లేదు. సీఏలో దానిని ప్రతిపాదించిన వ్యక్తి పటేలే.
ఆ సమయంలో నెహ్రూ ఇండియాలో లేరు. ఆయన అధికారిక కార్యక్రమం నిమిత్తం యూఎస్‌ పర్యటనలో ఉన్నారు. 1950, ఫిబ్రవరి 25న నెహ్రూకు పటేల్‌ ఓ లేఖ రాశారు. అందులో.. కాశ్మీర్‌ విషయంలో ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది.
ఇక, ఇదే అంశంపై నెహ్రూతో అంబేద్కర్‌ విబేధించారనీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అర్జున్‌ రామ్‌ మెగ్వాల్‌ వంటి వారే గాక బీజేపీ పరివారమంతా చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా నిజం లేదు. ‘కాశ్మీర్‌ను రక్షించడానికి మీరు ఇండియా సాయం అడుగుతున్నారు. వారికి దేశవ్యాప్తంగా సమానత్వ హక్కుల కావాలని కోరుతున్నారు. కానీ కాశ్మీర్‌ మీద భారత్‌కు పూర్తి హక్కులు మాత్రం వద్దంటున్నారు’ అని షేక్‌ అబ్దుల్లాతో అంబేద్కర్‌ వ్యాఖ్యానించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారమంతా బూటకం. దానికి సంబంధించిన అధికారిక రికార్డులు కూడా ఎక్కడా లేవు. అవి భారతీయ జన్‌సంఫ్‌ు (బీజేపీ పూర్వ రూపం) నాయకుడు బాల్రాజ్‌ మదోక్‌ ప్రసంగంలోని వ్యాఖ్యలు.
అభివృద్ధి గురించి తీసుకుంటే.. పలు రంగాలలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కాశ్మీర్‌ ఎంతో మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఆ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కాశ్మీర్‌ అభివృద్ధికి ఆర్టికల్‌ 370 ఏ మాత్రమూ అడ్డంకి కాలేదు. ఇదంతా ఆధునిక భారత నిర్మాతగా పేరొందిన నెహ్రూ ఇమేజ్‌ను మసకబార్చడమే. వారి ప్రధాన లక్ష్యం కూడా అదే. దేశంలో బహుళత్వానికి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి పెద్దపీట వేసిన వ్యక్తిని టార్గెట్‌ చేసి దానికి వ్యతిరేకంగా ఉన్న ఆరెస్సెస్‌ భావజాలాన్ని దేశంలో నెలకొల్పేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని రామ్‌ పునియాని పేర్కొన్నారు.

Courtesy Nava telangana…