”పాలకుడు ఎప్పుడూ పాలకుడే’ అని అంటాడో అభ్యుదయ రచయిత. ప్రభుత్వంలోని వ్యవస్థలు, సంస్థలన్నీ తనకెప్పుడూ కీర్తనలు, నర్తనలు చేయాలని అమితంగా ఆశిస్తాడు. వ్యవస్థాగత సమస్యలపై స్వతంత్ర మీడియా సైతం తననెప్పుడూ సవాలు చేయొద్దని ఆదేశిస్తాడు. కాదు కూడదని ప్రశ్నిస్తే.. ఏలికలు తమ వద్ద దాచుకున్న బ్రహ్మాస్త్రాలు, పాశుపాతాస్త్రపు పాచికలు ప్రయోగిస్తుంటారని చరిత్ర చెబుతున్న నగ సత్యం. ఇది కేవలం ఏ ఒక్క దేశ పాలకుడి గురించి ప్రత్యేకంగా చెబుతున్న అంశం కాదు. యావత్‌ ప్రపంచం తమను పాలించే నాయకత్వానికి అన్వయించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుత ఈ చర్చలో కొద్దిసేపు భారత్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిద్దాం.
పాకిస్థాన్‌కి సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి ఎంతోకొంత రక్షణగా ఉన్నటువంటి ఆర్టికల్‌ 370, 35ఏ ఎత్తివేత తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ఘటనపై దేశీయ, అంతర్జాతీయ మీడియాలు రెండుగా విడిపోయాయి. కాశ్మీర్‌ అంశంలో మోడీ సర్కారు నిర్ణయంపై దేశీయ మెజారిటీ మీడియా ప్రభుత్వానికి వత్తాసు పలకగా, అంతర్జాతీయ మీడియా మాత్రం వాస్తవాలను ప్రచురించేందుకు సాహసోపేత ప్రయత్నమే చేసింది. అయితే, ఈ వార్తలు వెలువడుతున్న వెంటనే బీబీసీ, న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు, ది గార్డియన్‌ వంటి సంస్థలపై సంఫ్‌ుపరివార్‌ పుత్రులు, మిత్రుల నుంచి పెద్ద ఎత్తున దాడి మొదలైంది. ముఖ్యంగా బీబీసీ వంటి ప్రతిష్టాత్మక మీడియా సంస్థ విడుదల చేసిన ఒక వీడియో (నిర్బంధంలో కాశ్మీర్‌ అంటూ చిత్రీకరించిన వీడియో) ఫేక్‌ అని నేరుగా సామాజిక మాధ్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దాని సైద్ధాంతిక స్వరూప సంస్థలు విపరీత ప్రయత్నం చేయసాగాయి. అయితే, ఈ విషయంపై వెంటనే స్పందించిన బీబీసీ సంస్థ, తాము తమ రిపోర్టర్‌ తీసిన వీడియోకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాశ్మీర్‌ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టు రిపోర్టింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. భారత పార్లమెంట్‌లోనే కాక సోషల్‌ మీడియాలో కూడా బలీయమైన సంఖ్యాబలం కల్గిన సంఫ్‌ుపరివార్‌ చేసిన దాడి కారణంగా ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థ తన విశ్వసనీయతని నిరూపించుకోవాల్సి వచ్చింది. పాలకులను ప్రశ్నించిన తర్వాత సాధారణంగానే ఉత్పన్నమైన పరిణామం అని చాలామంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు చెప్పుకొచ్చారు. కానీ, ఆ సంస్థకి సంబంధించిన ఒక సీనియర్‌ జర్నలిస్టు ఇటీవల తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసిన పోస్టుకి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 1984 అక్టోబర్‌లో భారత ప్రధాని అయిన ఇందిరా గాంధీ మృత్యవాత పడినప్పుడు వేరే దేశ పర్యటనలో ఉన్న రాజీవ్‌ గాంధీకి ఆ విషయం తెలిసింది. తన తల్లి అంగరక్షకుల దాడిలో చనిపోయిందని బహిర్గతమైంది. ఆ సమయంలో ప్రధాని ఇందిర చావుపై పుకార్లు మాత్రమే వస్తున్నాయని ఆమె ఇంకా మరణించలేదని ఇంకోవైపు వచ్చిన వ్యాఖ్యానాలు దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేయసాగాయి. దాంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే దూరదర్శన్‌ సైతం ఆ దుర్ఘటనని ప్రసారించలేదు. దీంతో అయోమయంలో ఉన్న రాజీవ్‌ గాంధీ తన సహచరులతో ఢిల్లీలోని బీబీసీ బ్యూరో చీఫ్‌కి ఫోన్‌ చేశారు. తన తల్లి ఇందిరా మరణించిదా? ఈ విషయాన్ని బీబీసీలో ప్రసారం చేశారా? అని ప్రశ్నించారు. రాజీవ్‌కి సదరు రిపోర్టర్‌ ప్రధాని ఇందిర మరణించిందని.. ఘటనని కూడా తాము టెలికాస్ట్‌ చేసినట్టు చెప్పడంతో రాజీవ్‌ కుప్పకూలిపోయారట. అటుతర్వాత రాజీవ్‌ ఢిల్లీకి పయనమయ్యారని ఆ పోస్టు సారాంశం. అంటే, ఆ మీడియా సంస్థ పట్ల విశ్వసనీయత.. అప్పటి ప్రధాని కుమారుడు, అనంతరం దేశానికి ప్రధానిగా సేవలు అందించిన రాజీవ్‌కి ఎంతగా ఉందన్నది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

కానీ, నేడు ఆ సంస్థలు మాత్రం పనిగట్టుకొని భారత్‌కి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని అడ్డగోలు వాదనలు ప్రభుత్వం దాని అనుబంధ పరివారం నైతిక దాడి చేస్తున్నాయి. అదే ప్రాశ్చాత్య మీడియా సంస్థలు మోడీ, ఆయన సర్కారు గొప్పగా చెప్పుకునే యోగా, ఆయుర్వేదం గురించి రాస్తే తమ నేత గురించి దేశదేశాలు కీర్తిస్తున్నాయని చెప్పుకున్నది విస్మరించరాని విషయం. టైమ్స్‌ మ్యాగజైన్‌ కూడా 2019 ఎన్నికల ముందు నరేంద్ర మోడీని ”ఇండియాస్‌ డీవైడర్‌ ఇన్‌ చీఫ్‌” (భారత ముఖ్య విభజనకారి) అని రాయడంతో బీజేపీ అగ్గిమీదగుగ్గిలమైంది. టైమ్స్‌ మ్యాగజైన్‌ ఒక ముస్లిం జర్నలిస్టుతో ఈ వార్తా కథనం కావాలని రాయించారని ముప్పేట దాడి చేశారు. ఆ కథ, కథనంలో సదరు జర్నలిస్టు రాసిన అంశాలపై చర్చ జరపకుండా ఈ విషయంపై మతపరంగా దాడి చేసిన ఘనత ఆయన విజ్ఞతకే చెల్లింది. ఎన్నికల అనంతరం అదే సంస్థ మోడీని కీర్తిస్తూ రాస్తే తమ నాయకుడి గొప్పతనం అంటూ బీజేపీ పరివారమంతా కొనియాడింది. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం దాని పరివారం ప్రాశ్చాత్య మీడియాని హిందూ వ్యతిరేకి అంటూ ముద్రలు వేస్తున్నది. అమెరికా ప్రముఖ దినపత్రిక వాషింగ్ట్టన్‌ పోస్టు ప్రధాన కార్యాలయం ముందు హిందూ సంస్థలు ఏకంగా వాషింగ్టన్‌ డీసీ నగరంలో నిరసన కార్యక్రమాన్ని సైతం నిర్వహించాయి. హిందువులకి వ్యతిరేకంగా వాషింగ్‌టన్‌ పోస్టు సంస్థ భయంకర వార్తలు ప్రచురిస్తుందని ప్లకార్డులతో ధర్నా చేయడం అవాంఛనీయం. ఇదే విదేశీ మీడియా సంస్థలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల హననం గురించి రాసినప్పుడు పొడిగిన పరివారమంతా నేడు కాశ్మీర్‌లో జరుగుతున్న దాడిపై రాస్తే మాత్రం తమ అస్తిత్వం గుర్తు తెచ్చుకోవడం సంకుచితత్వం తప్ప మరొకటి కాదు. కానీ, అదే సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ ధోవల్‌ మాత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలోని విదేశీ మీడియా ప్రతినిధులకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన అసలు దేశీయ జర్నలిస్టులను అసలే కలవడం లేదు. భారత పాత్రికేయులు కలిసేందుకు ప్రయత్నించినా సమయం ఇవ్వడం లేదని ఢిల్లీలోని రిపోర్టర్‌లు వ్యాఖ్యానించు కుంటున్నారు. కానీ, విదేశీ జర్నలిస్టులను మాత్రం ఆయనే స్వయంగా కలిసేందుకు యత్నిస్తున్నారని తెలిసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సైతం ఫారిన్‌ జర్నలిస్టులను కలుసుకునేందుకు తహతహలాడుతున్నారట. రష్యా, చైనా, పాకిస్థాన్‌ లేదా భారత్‌కి సంబంధించిన విషయంలో ప్రాశ్చాత్య మీడియా నిస్పష్టంగా రాసినప్పుడు సదరు ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందంటే ఆ సర్కారు ఏదో దాస్తుందని మనం స్పష్టంగా అనుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ గొడవ జరుగుతున్న అస్సాంలో విదేశీ జర్నలిస్టులు రిపోర్టింగ్‌ చేయాలంటే.. సుమారు రెండు వారాల ముందే భారత విదేశాంగ శాఖ, హౌంశాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మోడీ సర్కారు నిబంధనలు పెట్టింది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించాలంటే, ఎనిమిది వారాలు ముందస్తు పర్మిషన్‌ తీసుకోవాలని మెలికలు పెడుతోంది. ఈ రెండు కారణాలతో మే 2018 నుంచి కేవలం రెండు విదేశీ సంస్థల ప్రతినిధులు మాత్రమే అస్సాం, కాశ్మీర్‌ని అనుమతి తీసుకొని పర్యటించినట్టు కేంద్రం వెల్లడిస్తున్నది. కాశ్మీర్‌, అస్సాంలో జరుగుతున్న పరిణామాలతో ప్రధాని మోడీ తన ప్రభుత్వానికి ప్రాశ్చాత్య మీడియా ఎంతమాత్రం చెడ్డపేరు తీసుకురావద్దని కోరుకుంటున్నారు. భారతీయ మీడియా ఏదయినా ప్రశ్నిస్తే.. దేశ వ్యతిరేక ముద్ర వేయడం సంఫ్‌ుపరివారానికి సులువుగా ఉంది. కానీ, వీదేశీ మీడియా సంస్థలు ప్రశ్నించడం, వాస్తవాలను యావత్‌ ప్రపంచానికి చెప్పడాన్ని బీజేపీ సర్కారు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌ చేసే ఏ పనికైనా ప్రపంచం మద్దతిచ్చే వాతావరణం నెలకొనాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. భజన చేస్తే భారత్‌ అనుకూలమని అనడం.. ప్రశ్నిస్తే పగవాడని అనడం బీజేపీ వేగంగా నేర్చుకొని ప్రమాదకరంగా పాటిస్తున్న పరిస్థితికి ప్రజలే ప్రతిస్పందించాలి. చలనశీల ప్రజాస్వామ్యంలో ప్రజలే దాని పరిరక్షకులన్న విషయం ప్రస్తుత పాలకులు సైతం గ్రహించాలి.

సాగర్‌ వనపర్తి
సెల్‌: 9494041258.