– ఈ సంస్థల మోసాలు రూ.10,000 కోట్ల పైమాటే!
– కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ కేసుతో వెలుగులోకి ‘సర్దుబాట్లు..’
– దాదాపు రూ.1000 కోట్లు మళ్లించిందని ఆరోపణలు
– ఆ వార్తలు నిజం కాదంటున్న కేఎస్‌బీఎల్‌ సంస్థ
– అప్రమత్తమైన సెబీ..ఆందోళనలో రిటైల్‌ ఇన్వెష్టర్లు

వాణిజ్య విభాగం
హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ”కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌” (కేఎస్‌బీఎల్‌) సంస్థపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించడం సంచలనంగా మారింది. దాదాపు రూ.1000 కోట్ల విలువైన క్లయింట్ల షేర్లను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల మధ్య కేఎస్‌బీఎల్‌పై సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. క్లయింట్ల షేర్లను దుర్వినియోగం చేయడం, తనఖా పెట్టడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎన్‌ఎస్‌ఈ తన ప్రాథమిక నివేదికను సెబీకి అందజేసింది. ఆగస్టు 19న ఈ తనిఖీ చేపట్టి.. నివేదికనిచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే గత శుక్రవారం సెబీ 12 పేజీల మధ్యంతర నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. తాజా నిషేధపు ఉత్తర్వుల ప్రకారం కార్వీ కొత్త క్లయింట్లను చేర్చుకోవడమే కాదు.. ప్రస్తుత క్లయింట్ల ఆర్డర్లను ఎగ్జిక్యూట్‌ చేయడానికి వీలు లేకుండా పోయింది. సెక్యూరిటీలకు చెందిన పూర్తి మొత్తం చెల్లించిన మీదటే సంబంధిత షేర్ల యజమానికి కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌( బీఎస్‌ఈ) డీపీ ఖాతా నుంచి సెక్యూరిటీలను బదిలీ చేయాలి. కేఎస్‌బీఎల్‌ తన క్లయింట్ల నిధులు, షేర్లను దుర్వినియోగం చేసినందుకు గాను సంబంధిత నిబంధనల ప్రకారం.. డిపాజిటరీలు, స్టాక్‌ఎక్స్ఛేంజీలు తగిన క్రమశిక్షణా చర్యలను చేపట్టాలని సెబీ ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ సెగ్మెంట్‌లో దేశీయ బ్రొకరేజీ సంస్థ ఒకటి ఇంతటి భారీ అవకతవకలకు దిగడం ఇదే తొలిసారని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. కేఎస్‌బీఎల్‌ సంస్థ తన క్లయింట్ల స్టాక్స్‌ను పూచీకత్తుగా ఉంచి వాటికి నిధులను సమీకరించడంతో పాటు వాటిని తమ సొంత వ్యాపారాలకు మళ్లించినట్టుగా కూడా తీవ్ర అరోపణలు వస్తున్నాయి. కేఎస్‌బీఎల్‌ సంస్థ దాదాపు 2,44,000 మంది కస్టమర్లతో దేశంలోని టాప్‌10 బ్రోకరేజీ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
పక్షం రోజుల్లోపు బకాయిలు చెల్లించేస్తాం..
కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థపై సెబీ నిషేధం నేపథ్యంలో కార్వీ గ్రూపు చైర్మెన్‌ సి.పార్థసారథి మొదటిసారిగా మీడియాకు వివరణనిచ్చారు. వివిధ కథనాలలో వస్తున్నట్టుగా తమ సంస్థ వందలు, వేల కోట్లలో క్లయింట్లకు బకాయిలు లేదని ఆయన అన్నారు. క్లయింటులకు చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.25-30 కోట్ల లోపే ఉంటుందని ఆయన తెలిపారు. బకాయిలు ఉన్న క్లయింట్ల సంఖ్య కూడా 180 నుంచి 150 మధ్య ఉండే అవకాశం ఉందని వివరించారు. వీరందరికీ పక్షం రోజులు లేదా అంతకంటే ముందే బకాయిసొమ్మును తిరిగి చెల్లించేస్తామని తెలిపారు. కేఎస్‌బీఎల్‌ సంస్థ రూ.1000 కోట్ల విలువైన బ్రోకింగ్‌ సొమ్మును తన స్థిరాస్తి రంగ సంస్థకు మళ్లించినట్టుగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. కేఎస్‌బీఎల్‌ సంస్థ మొత్తం కార్వీ సంస్థలకు హోల్డింగ్‌ సంస్థగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ, సెబీ తమ లావాదేవీలను తప్పుగా అర్థం చేసుకొని ఉంటాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తాము స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థకు త్వరలోనే వెల్లడి చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. సంస్థలో జరుగుతున్న పరిణామాలకు క్లయింట్లు చింతించాల్సిన అవసరం లేదని. సంస్థ మూలాలు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. కార్వీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఈ నేపథ్యంలో కేఎస్‌బీఎల్‌ సంస్థ ఎన్‌సీఎల్‌టీని అశ్రయించి లిక్విడేషన్‌కు పోనుందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అలా చేయాల్సిన అవసరం కంపెనీ లేదని ఆయన అన్నారు. అయినా ప్రస్తుతం ఉన్న చట్టం అలా చేసేందుకు కంపెనీని అనుమతించదని కూడా ఆయన తెలిపారు.
36 సంస్థల లావాదేవీలపైనా నజర్‌..
కేఎస్‌బీఎల్‌ క్లయింట్ల స్టాక్స్‌ను దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అప్రమత్తమైంది. కార్వీ మాదిరిగానే దేశంలో ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలుగా వెలుగొందుతున్న దాదాపు మరో మూడు డజన్ల సంస్థల లావాదేవీలపైనా సెబీ దృష్టి సారించింది. ఆయా సంస్థల్లో కొన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టుగా ఇప్పటికే సమాచారం అందుతున్నప్పటికీ.. వాటిని వెలుగులోకి తెచ్చేలా ఆధారాల కోసం సెబీ తన వేటను మొదలు పెట్టినట్టుగా సమాచారం. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు దాదాపు రూ.10,000 కోట్ల విలువైన క్లయింట్ల నిధులను ఆయా సంస్థలు దుర్వినియోగం చేసి.. తమ సొంత అవసరాలకు నిధులను మళ్లించినట్టుగా సెబీ దృష్టికి వచ్చింది. కేఎస్‌బీఎల్‌ కేసు నేతృత్వంలో త్వరలోనే సెబీ ఈ సంస్థల తప్పుల చిట్టాలను కూడా విచారణ జరిపి.. వివరాలను బహిర్గతం చేసి కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. సెబీ విచారణ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పాటు బ్రోకరేజీ సంస్థల్లో నిధులను ఉంచిన వినియోగదారులలో కూడా కొత్త గుబులు మొదలైంది.

Courtesy Navatelangana…