కటకటాల్లోకి నలుగురు నిందితులు
కన్నడనాట కలకలం రేపిన కేసు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కర్ణాటకలో వలపు వల.. హనీట్రాప్‌ వ్యవహారం అనుకున్నదాని కంటే చాలా పెద్దదేనని తేలింది. కొందరు యువకులు, మహిళలు కలిసి ధనవంతులకు ఎరవేసి డబ్బు గుంజేందుకు చేసిన ప్రయత్నాలు చివరికి బెడిసికొట్టాయి. ఆ కేసును బెంగళూరు సీసీబీ పోలీసులు దర్యాప్తుచేసి.. కీలక వివరాలను గుర్తించారు. ఈ కేసులో శుక్రవారం బెంగళూరుకు చెందిన రఘు, మంజునాథ్‌, పుష్ప, పుష్పమ్మను అరెస్టుచేశారు. రఘు తల్లి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లో చాలా వివరాలున్నాయి. అందులోని వీడియోల ఆధారంగా.. కొందరు ఎమ్మెల్యేలు వీరి వలలో పడినట్లు తేలింది. 20 మంది ఎమ్మెల్యేలు, మరో పదిమంది మాజీమంత్రుల నుంచి నిందితులు ఇప్పటికే రూ.కోట్ల నగదు వసూలుచేశారనే విషయం కూడా బయటపడింది. నేరానికి సూత్రధారులు రఘు, పుష్ప అని గుర్తించినా.. వీరివెనుక పెద్ద తలలున్నాయని అనుమానిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ భాస్కరరావు వెల్లడించారు.

కొందరు బుల్లితెర నాయికలు, రూపదర్శినులు వీరి పథకంలో భాగంగా మంత్రులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లేవారు. వారినుంచి చరవాణి నంబర్లు తీసుకుని, తరచు చాట్‌ చేసేవారు. చివరికి.. వారిని ముగ్గులోకి దించి, ముందుగా అమర్చుకున్న రహస్య కెమెరాల్లో వారి రాసలీలలు రికార్డుచేసేవారు. వాటిని అడ్డుపెట్టుకుని 2015 నుంచి వీరు తమ నేరాలను కొనసాగిస్తున్నారని గుర్తించినట్లు భాస్కరరావు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల వెలుగుచూసిన ‘హనీట్రాప్‌’ ఘటన కన్నా ఇది పెద్దదని ఆయన చెప్పారు. తొలుత ఈ కేసులో రాఘవేంద్ర అలియాస్‌ రాఖీసింగ్‌ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అనుమానించినా… చివరకు ఓ జాతీయపార్టీకి చెందిన సీనియరు నాయకుడు దీని వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అమ్మాయిలంటే వ్యామోహం ఉన్నవారిని, శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని వీరు వలపు వలను విసిరి, తమ పనులను చక్కబెట్టుకున్నారని భాస్కరరావు వివరించారు. బాధితులు ఎవరనే వివరాలను రహస్యంగా ఉంచారు.

Courtesy Eenadu…