బండి సంజయ్‌పై డీఎస్పీ దాడి.. పోరా అని తిట్టిన డీసీపీ

  • తీవ్ర ఉద్రిక్తత మధ్య బాబు అంత్యక్రియలు
  • అంతిమ యాత్రను అడ్డుకున్న పోలీసులు
  • తీవ్ర స్థాయిలో తోపులాట.. వాగ్వాదాలు

కరీంనగర్‌ రణరంగమైంది. ఆర్టీసీ డ్రైవర్‌ బాబు అంత్యక్రియల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 40 నిమిషాలపాటు పోలీసులు, ఆర్టీసీ జేఏసీ, రాజకీయ నాయకుల మధ్య వాగ్వాదం, తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను కొందరు పోలీసులు తీవ్రంగా నెట్టివేశారు. చేతులతోనే కొట్టారు. పోలీసులు శవయాత్రను అడ్డుకుని, పాడెను దారి మళ్లించారు. మృతుడి కుటుంబ సభ్యులు మినహా ఎవరూ శ్మశాన వాటికకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని డ్రైవర్‌ బాబు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు గురువారమే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచే బాబు ఇంటి వద్దకు పెద్దఎత్తున జేఏసీ నాయకులు చేరుకున్నారు.

టీజేఎస్‌ వ్యవస్థాపకుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులు అక్కడికి చేరుకున్నారు. చర్చలు ప్రారంభించే వరకు అంతిమ యాత్ర నిర్వహించేది లేదని తేల్చి చెప్పి ఆందోళన కొనసాగించారు. అయితే, మధ్యాహ్నం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, మరోవైపు, బాబు మరణించి మూడు రోజులు కావడంతో మృతదేహం నుంచి దుర్వాసన ప్రారంభమైంది. దాంతో, బాబు కుటుంబ సభ్యులతో జేఏసీ నాయకులు, ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడి అంతిమ సంస్కరాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంతిమ యాత్ర చేపడతామని పోలీసులకు తెలిపారు.

శాంతియుతంగా డిపో వరకు శవయాత్ర నిర్వహిస్తామని, సహకరించాలని కోరారు. అనంతరం, 3.30 గంటల సమయంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జేఏసీ నాయకులు ముందుండి అంతిమ యాత్రను ప్రారంభించారు. సుమారు 2000 మంది ఇందులో పాల్గొన్నారు. అయితే, కేవలం 300 మీటర్ల దూరం వెళ్లేసరికే పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా రూపొందించుకున్న వ్యూహం ప్రకారం పాడెను మరో మార్గంలో సమీపంలోని శ్మశాన వాటికకు మళ్లించారు.

కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి అనుమతించి నాయకులను, ప్రజలందరినీ నిలువరించారు. దాంతో, అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. శ్మశానం వైపునకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగిస్తూ ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పాత టైర్లు, ఇతర వస్తువులను దహనం చేసి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సుమారు 40 నిమిషాలపాటు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Courtesy Andhrajyothi…