జిల్లా సరిహద్దులన్నీ మూసివేత
ఐసోలేషన్‌ కేంద్రాలకు 60మంది అనుమానితులు

ఇండోనేషియన్లు సహా స్థానికుడికీ కరోనా పాజిటివ్‌రావడంతో జిల్లా అధికారయంత్రాంగం రెడ్‌జోన్‌గా ప్రకటించి మరింత అప్రమత్తం అయింది. కరీంనగర్‌ నగరంలోని కలెక్టరేట్‌, ముకరంపుర ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు దిగ్బంధించగా, వైద్యసిబ్బంది మంగళవారం ఉదయం నుంచే ఇంటింటినీ జల్లెడపడుతున్నారు. అనుమానితుల శాంపిళ్లు సేకరిస్తూ 60మందిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లా సరిహద్దులన్నీ మూసివేసి చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఒక్క జగిత్యాల రూటులోనే 6 చెక్‌పోస్టులు పెట్టారు. అత్యవసర సేవల సరుకుల వాహనాలు తప్ప ఎవరినీ అనుమతించడం లేదు. కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ వై.సునిల్‌రావు, కమిషనర్‌ క్రాంతి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వారికి అవసరమైన కూరగాయలు, సరుకులు ఇంటింటికి పంపిణీ చేశారు. నగరంలో పది చోట్ల కూరగాయల అమ్మకానికి అనుమతులు ఇచ్చామనీ, పూర్తిగా బంద్‌ ఉంటాయన్న వదంతులు నమ్మవద్దనీ కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘన, నిత్యావసర సరుకుల కొరత, ధరల పెంపు, లా అండ్‌ ఆర్డర్‌ సమస్య, వైద్య అవసరాల కోసం హెల్ప్‌లైన్‌ 0878-2234732 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. జిల్లా దుకాణదారులు శానిటైజర్లు, మాస్క్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకమ్మితే చర్యలు తప్పవనీ హెచ్చరించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా డీపీఆర్‌ఓ దశరథం కరోనా జాగ్రత్తలపై పాడిన పాట సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఇంకోవైపు జిల్లాలోని పలు గ్రామాల్లో స్వీయనిర్బంధాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారులనూ మూసివేస్తున్నారు.

సహనం కోల్పోయిన పోలీసులు..
ఎంతచెబుతున్నా వినకుండా గణేష్‌నగర్‌, వినాయకనగర్‌, కాశ్మీర్‌గడ్డలకు చెందిన యువకులు సోమవారం అర్ధరాత్రి బైక్‌లపై ముగ్గురేసి తిరుగుతుండటంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. జిల్లాలో రెడ్‌అలర్ట్‌తో బయటికి వస్తున్న వాహనదారులను నియంత్రిస్తూ వారికి నచ్చచెబుతున్నా వినకపోవడంతో వారు సహనం కోల్పోయారు. అత్యవసరం అయితే తప్ప ఎవరినీ బయటకు అనుమతించడంలేదు.

కరోనా కట్టడికి రూ.50లక్షల ఎంపీ నిధులు
కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కరోనా అరికట్టేందుకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులనుంచి రూ.50లక్షల చెక్కును ఎంపీ బండి సంజరు జిల్లా కలెక్టర్‌కు అందించారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు చేస్తున్న సేవలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ నిధులు అందించినట్టు తెలిపారు. ప్రజలందరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వాధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు.

Courtesy Nava Telangana