కుమారుడి మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బావ కుటుంబం బలవన్మరణం!
సత్యనారాయణరెడ్డి షాపులో సూసైడ్‌నోట్‌  
గుమస్తాకు ఎరువుల షాపు ఇవ్వాలని కొంత ఆస్తిని తండ్రికి, మిగతాది టీటీడీకి ఇవ్వాలని లేఖ
సూసైడ్‌నోట్‌పై అనుమానాలు

కరీంనగర్‌ క్రైం : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి బావ, కరీంనగర్‌ వాస్తవ్యుడైన ఎరువుల వ్యాపారి నారెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆయన భార్య రాధ, కూతురు వినయశ్రీ మృతి ఘటన అనూహ్య మలుపు తిరిగింది. కరీంనగర్‌ శివారులోని అల్గునూర్‌ కాకతీయ కాల్వలో బయటపడిన కారులో ముగ్గురి మృతదేహాలు లభించడంతో ఈ ఘటనను ప్రమాదంగానే భావించారు. అయితే, ఈ కుటుంబం ఆత్మహ త్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో సత్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న సాయి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్‌ షాపులో సత్యనారాయణ రెడ్డి రాసినట్లుగా ఓ సూసైడ్‌నోట్‌ పోలీసులకు లభ్యమైంది.

ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణ రెడ్డి కుమారుడు శ్రీనివా్‌సరెడ్డి అలియాస్‌ చిన్నూ మృతిచెందా డు. ‘చిన్నూ లేకుండా మేం ఉండలేం. ఇన్నాళ్లుగా మేం శవాలుగానే బతుకుతున్నాం. అందుకే చిన్నూ వద్దకే వెళ్లిపోతున్నాం’ అని సూసైడ్‌నోట్‌లో రాసి ఉన్నట్లు తెలిసింది. తమ ఎరువుల దుకాణాన్ని కుటుంబానికి నమ్మకంగా పనిచేస్తున్న గుమాస్తా నర్సింగ్‌కు ఇవ్వాలని నోట్‌లో సత్యనారాయణరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయశ్రీ కనిపించకుండా పోయిన 21 రోజుల తర్వాత కాల్వలోని కారులో మృతదేహాలుగా లభ్యమయ్యారు.

ఈ 21 రోజుల పాటు షాపును గుమాస్తా నర్సింగే నిర్వహించాడు. ఇన్ని రోజుల్లో డైరీ అయనకు కనిపించలేదా? అని అనుమానిస్తున్నారు. నిర్ధారణకు లేఖను పోలీసులు హాండ్‌రైటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఎఫ్‌ఎ్‌సఎల్‌ పరీక్షలకు పంపించారు. కాగా, షాపు పోనూ ఆస్తిలో కొంతభాగాన్ని తన తండ్రికి ఇవ్వాలని మిగతా ఆస్తినంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) స్వాధీనం చేయాలని సత్యనారాయణ రెడ్డి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

ఆస్తిపరుడైన సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. సత్యనారాయణ రెడ్డి వ్యాపారి. భార్య రాధ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కుమార్తె వినయశ్రీ వైద్య విద్య అభ్యసిస్తోంది. కరీంనగర్‌ జిల్లా బ్యాంక్‌ కాలనీలో ఈ కుటుంబం ఉంటోంది. ఈ కుటుంబం జనవరి 27న కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరి కనిపించకుండా పోయారు.

వెళ్లేముందు గుమస్తాకు 2లక్షలు
కారు కెనాల్‌లో పడి సత్యనారాయణ రెడ్డి కుటుంబం జలసమాధి అయిన ఘటనకు ఒక రోజు ముందు అంటే జనవరి 26న మధ్యాహ్నం గుమాస్తా నర్సింగ్‌.. సత్యనారాయణరెడ్డి ఇంటికెళ్లి కారులో వంటగ్యాస్‌ స్టౌ, కుక్కర్‌, బట్టలు సర్దివచ్చాడు. అంతకుముందు రోజు గుమాస్తాకు షాపులోనే సత్యనారాయణ రెడ్డి రూ.2 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును నర్సింగ్‌ తర్వాత సత్యనారాయణరెడ్డి బంధువులకు అప్పగించినట్లు తెలుస్తోంది. సత్యనారాయణరెడ్డి కుటుంబానికి గుమాస్తా నర్సింగ్‌ నమ్మకంగా పనిచేశాడని సత్యనారాయణరెడ్డి బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.

Courtesy Andhrajyothi