– యూటీగా అవతరించిన లడఖ్‌లో నిరసనలు
– కాశ్మీర్‌ విచ్ఛేదనాన్ని ఎన్నడూ కోరలేదు : కార్గిల్‌వాసులు
న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా అవతరించిన మొదటి రోజునే లడఖ్‌లోని కార్గిల్‌ ప్రజలు ‘బ్లాక్‌ డే’ గా పాటించారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన మోడీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కార్గిల్‌లో ప్రజలు నల్లజెండాలు చేబూని పెద్దమొత్తంలో రోడ్లపైకి వచ్చారు. జమ్మూ కాశ్మీర్‌ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా మిగిలిపోతుందనీ, తమ రాష్ట్ర హత్యపట్లా దు:ఖించేందుకు వారిని అనుమతించడం లేదంటూ ఆగ్రహించారు. గురువారంనాటికి లడఖ్‌ బంద్‌ మూడో రోజుకు చేరింది. మార్కెట్లు తెరవలేదు. ప్రజా రవాణా స్తంభించింది. లడఖ్‌లో కార్గిల్‌, లేV్‌ా రెండు జిల్లాలు. ఈ రెండు జిల్లాలు రెండు కండ్లలాంటివనీ, ఒక కంటి కోసం.. మరో కంటిలో పొడవడం న్యాయమేనా? అని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. లేV్‌ాలోని కొన్ని వర్గాలు లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడటాన్ని స్వాగతించినప్పటికీ.. తమ తెగలకు రక్షణ కల్పించకపోవడం, ఆరవ షెడ్యూల్‌లో కలుపకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్గిల్‌ పేరును ‘దేశభక్తి’ కోసమే తెరపైకి తెచ్చే పాలకవర్గాలు.. ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను స్వీకరించకుండానే, వారి మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విచ్ఛేదనగావించి లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. వారికంటూ రాజకీయ అధికారం లేకుండా(శాసన సభ లేని కేంద్రపాలిత ప్రాంతం) చేశారు.
‘మా హక్కులను కాలరాసి, మమ్మల్ని విడగొట్టి యూటీగా ఏర్పాటు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యచేయడమే. కార్గిల్‌ ప్రజలు ఎన్నడూ జమ్మూ కాశ్మీర్‌ విచ్ఛేదనాన్ని, రాష్ట్ర తిరోగమనాన్ని కోరలేద’ని సామాజిక కార్యకర్త సాజద్‌ హుస్సేన్‌ అన్నారు. అన్ని మతాలు, రాజకీయ పార్టీల సభ్యులున్న కార్గిల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఈ నిర్ణయాన్ని నిరసించింది. ‘ఆర్టికల్‌ 35ఏ అభివృద్ధికి అడ్డుగోడ అంటూ సర్కారు దుష్ప్రచారం చేసింది. అదే తమ జీవనోపాధికి పునాదిగా ఉండేది. మా అభిప్రాయాలను స్వీకరించకుండానే ఈ నిర్ణయాన్ని మాపై రుద్దింది. కానీ, మా డిమాండ్లను సర్కారు వినేవరకూ పోరాటం చేస్తామ’ని జేఏసీ కార్యదర్శి నాసిర్‌ మున్షి తెలిపారు. ‘కేంద్ర సర్కారు నిర్ణయం చట్ట విరుద్ధం. మాకు ఎలాంటి అధికారం లేకుండా చేశార’ని కార్గిల్‌ కొండిపాంత అభివృద్ధి మండలి మాజీ చైర్‌పర్సన్‌ అస్గర్‌ అలీ ఆక్రోశించారు.
శ్రీనగర్‌లో శుక్రవారం మళ్లీ ఆంక్షలు : 89వ రోజుకు చేరిన బంద్‌
జమ్మూ కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని శ్రీనగర్‌లో సర్కారు శుక్రవారం మళ్లీ ఆంక్షలు విధించింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విడగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు జరిగే అవకాశముండటంతో వాటిని అణచివేసేందుకు లోయలోని పలు ప్రాంతాల్లో బలగాలను మోహరింపజేసింది. కాగా, శుక్రవారం నమాజులో భాగంగా ప్రజలు పెద్దమొత్తంలో ఒకచోట కలిసే అవకాశముండటంతో కేంద్ర సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగితే.. వాటిని అడ్డుకునేందుకే సెక్యూరిటీ ఫోర్స్‌ను ముఖ్యంగా ఓల్డ్‌ సిటీలోని ఐదు పోలీసు స్టేషన్‌లు, సౌరా పోలీసు స్టేషన్‌ పరిధిలో మోహరింపజేసినట్టు ఓ అధికారి తెలిపారు. వీటితోపాటు లోయలో సున్నితమైన మరికొన్ని ప్రాంతాల్లోనూ బలగాలను దించినట్టు వివరించారు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో మొదలైన బంద్‌ శుక్రవారంనాటికి 89వ రోజుకు చేరింది. ఈ భయాందోళనల పరిస్థితుల నడుమే 10వ, 12వ తరగతి విద్యార్థుల బోర్డు ఎగ్జామ్‌లు జరుగుతుండగా.. తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల బయట ఆందోళనగా పిల్లల కోసం ఎదురుచూశారు.

Courtesy Navatelangana…