సుశృత – దేవర్ష్ ల స్మారక స్మృతివనం దగ్గర KNPS ఆధ్వర్యంలో

జులై 17 (కారంచేడు )నుండి ఆగస్టు 6 (చుండూరు ) వరకు  వాడవాడలో  దళిత మృతవీరులను  స్మరించుకుందాం . అనే పిలుపును కులనిర్మూలనా  పోరాట సమితి (KNPS ) గత 20 సంవత్సరాలుగానిరంతరాయంగా  పాటిస్తున్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 2019 జూలై 17న గూడూర్ (జనగామ జిల్లా)లో సుశృత -దేవర్ష్  ల సమాధి దగ్గర కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభను నిర్వహించడం జరిగింది.

అయితే  పాలకుర్తి సీ.ఐ రమేష్, ఎస్.ఐ సతీష్ లు దళిత మృతవీరుల సంస్మరణ సభ జరుపనీయరాదని, 5నెలలుగా కొనసాగుతున్న పోరాట దీక్షలను భగ్నం చేయాలని గత మూడురోజులుగా దళిత బాధితురాలు  కందిక కోమల,వారి కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేస్తూ, బూతులు తిడుతూ శిబిరాన్ని ఎత్తివేసి ఇక్కడి నుండి మీరు వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జులై 17 ఉదయంకూడా సీ.ఐ రమేష్ శిభిరం దగ్గరికి వచ్చి కోమలను, ఆమె తల్లి మరియు కొడుకులను బూతులు తిడుతూ,దౌర్జన్యం చేసి సాయంత్రం వరకు ఖాళీ చేసి  వెళ్లాలని హుకుం జారీచేశాడు. సుశృత- దేవర్ష్ ల త్యాగాన్ని ఎత్తిపడుతూ జరుపతలపెట్టిన, కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభను  ఎట్టి పరిస్థితుల్లోనూ జరపాలని పట్టుదలతో ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 5గంటలకు సుశృత-దేవర్ష్ లకు నివాళి అర్పించటంతో  సభ ప్రారంభం అయ్యింది. సభ మొదలయిన కొద్దిసేపటి తర్వాత నుండి పాలకుర్తి ఎస్.ఐ సతీష్ బాధితులయిన  ప్రమోద్, చరణ్ లకు ఫోన్ చేస్తూ సభను ఆపి, శిబిరాన్ని ఖాళీ చేయాలని బెదిరించడం మొదలు బెట్టాడు. సభలో ఉన్న రఘునాథ్ (హైకోర్టు అడ్వకేట్) ఎస్.ఐతో ఫోన్ లో మాట్లాడి,మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించాడు. అన్నదే తడువుగా హుటాహుటిన తరలివచ్చిన సీ.ఐ,ఎస్.ఐలు వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా బాధితులు 5నెలలుగా ఉంటున్నారని, ఇది చట్టవ్యతిరేకమని, ఇక్కడనుండి తక్షణమే ఖాళీ చేయాలని మళ్లీ పాతకథనే చెప్పారు. ఈస్థలం యజమానులు కాకుండా పోలీసులు నేరుగా జోక్యం చేసుకోవటానికి చట్టబద్ధమైన అర్హత లేదని అడ్వకేట్ రఘునాథ్ చెప్పడంతో, మేము పోలీసులమని మేము చెప్పిందే వినాలని వారు దురుసుగా వ్యవహరించారు. పోలీసులైనా ఎవ్వరైనా అందరికి ఒకే చట్టం వర్తిస్తుందని, మీరేమంటున్నారో ఎందుకు ఖాళీ చేయమంటున్నారో రిటన్ గా ఒక నోటీసు ద్వారా తెలియజేయాలి గాని మీ ఇష్టారాజ్యంగా దౌర్జన్యానికి దిగటానికి వీలులేదని చెప్పటం జరిగింది. ఇక్కడ మాచర్ల రమేష్(హంతకుడు) ఇంటిముందు సుశృత -దేవర్ష్ ల సమాధి పెట్టడానికి కారణం సుశృత బ్రతికి ఉన్నపుడు ఒక అంటరాని దళితురాలు మా కోడలుగా మా ఊల్లోకు రావద్దని, మా ఇంట్లోకు రావద్దని, మా కొడుకుతో కాపురం చేయొద్దని ఆంక్షలు విధించారు. సుశృత, దేవర్ష్ లు బ్రతికి ఉంటే రాజయ్య, రాజమ్మ ఆస్తికి వారసులవుతారని, కట్టుకున్న భర్త, కన్నతండ్రి రమేష్ ద్వారానే చంపించి వారిని ఎక్కడో ఘట్కేసర్ దగ్గర కాల్చి బూడిద చేశారు. సుశృత బ్రతికి ఉన్నపుడు ఊరికి రానియ్యలేదు. ఇంట్లోకి రానియ్యలేదు.ఊరుకు దూరంగా హైద్రాబాద్ లో బ్రతుకుతుంటే అదికూడా సహించకుండా హతమార్చారు.   తన కాపురానికి అడ్డుపడుతున్న పుల్లయ్య (సర్పంచ్)పై చర్యలు తీసుకోమంటే, తీసుకోకుండా చట్టవిరుద్ధంగా నిందితుల కొమ్ముకాసిన పోలీసులు, ఇప్పుడు కూడా నిందితుల తరపున,బాధితులపై దౌర్జన్యానికి దిగటం మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటమే అవుతుంది తప్ప వేరుకాదని KNPS రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య స్పష్టం చేయటం జరిగింది.

ఎక్కడైతే సుశృత కూర్చుని తన భర్త కోసం వారం రోజులు మౌన పోరాటం చేసిందో. అక్కడే,ఆ రాజయ్య,రాజమ్మ ఇంటిముందరనే కందిక కోమల(తల్లి) బంధువులు,గూడూరు ప్రజలు సమాధి కట్టాలని నిర్ణయించుకొని అక్కడ కట్టారు. ఆసమాధిని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య(గూడూరు వాసి), డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో నివాళి అర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, MP పసునూరి దయాకర్, MLA తాటికొండ రాజయ్య తదితర ప్రజాప్రతినిధులు వచ్చి నివాళి అర్పించారు. వారందరు వచ్చి నివాళులు అర్పించడం ఇల్లీగల్ కానపుడు, ఇప్పుడెట్లా ఇల్లీగల్ అవుతుందని ప్రశ్నించడంతో చేసేదేమిలేక పోలీసులు  వెనుదిరిగారు. ఆ తరువాత సంస్మరణ సభ కొనసాగించడం జరిగింది.

ఆసభకు  KNPS ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ కొమ్ము సురేందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ CLC రాష్ట్ర ఉపాధ్యక్షులు V. రఘునాథ్ వచ్చి మాట్లాడారు. వక్తలుగా KNPS రాష్ట్ర ప్రధానకార్యదర్శి బూరం  అభినవ్, బాధితురాలు కందిక కోమల, కులనిర్మూలన ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ గడ్డం సదానందం, హైకోర్టు అడ్వకేట్ లింగం, ట్రైబల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ సింగ్, భారతీయ విద్యార్ధి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గురిమిళ్ల రాజు, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మార్వాడి సుదర్శన్, KNPS మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ బండారి నర్సప్ప, KNPS రాష్ట్ర అధ్యక్షులు బండారి లక్ష్మయ్య మొదలైనవారు పాల్గొని ప్రసంగించారు.

 

 

 

కులనిర్మూలనా పోరాట సమితి

KNPS – తెలంగాణ