———————చల్లపల్లి స్వరూపరాణి

కారంచేడు దళిత ఉద్యమం కేవలం పురుషులదే కాదు… కుల భూస్వామ్యం సాగించిన ఆగడాలను అడ్డగించిన సహజ దిక్కారులు దళిత మహిళలది కూడా… సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, కమ్మ బ్రాహ్మడు, కుల, ధన, అధికార అహంకారంతో విర్రవీగే ఒక పెత్తందారీ కులానికి ఐకాన్ అయిన ఎన్టీ రామారావునే నుంచోబెట్టి కడిగేసిన సాహసం కారంచేడు దళిత స్త్రీలది…
ఆ పల్లెలో మగవాళ్ళు ఒడుపుగా కర్ర తిప్పి సాము చేస్తే వాన నీరు నేలమీద పడేది కాదని అంటారు. ఆడవాళ్ళు కూడా సాహసంలో, తెగువలో ఎవరికీ తక్కువ కాదు. కారంచేడు మాల, మాదిగ, ఎరుకల కులాలు ఒకే చోట నివసించేవారు. ఆడవాళ్ళు బైట పనులకు, బహిర్భూమికి వెళ్ళినప్పుడు మదమెక్కిన భూకామందుల కుర్రాళ్ళు వారిని దుర్భాషలాడుతూ లైంగిక వేధింపులకు పాలపడడం మాదిగ పల్లెపై కమ్మల దాడికి ముఖ్యమైన కారణం. దీనికితోడు మాల, మాదిగ యువకులు చదువుకుని కమ్మ వారి దురహంకారాన్ని ప్రశ్నించడం కూడా తోడయ్యింది. ఒక కమ్మ యువకుడు వెంకటేశ్వరరావు ఎరుకల వారి ఇంటికెళ్ళి మరీ ఆడపిల్లలతో పరాచకాలాడినప్పుడు వారికి మాదిగ పల్లె అండగా నిలిచింది. అదే క్రమంలో మాల, మాదిగలు మంచినీళ్ళు ముంచుకునే చెరువులో కమ్మ కులస్తులు గేదెలను తోలడం, వారిని మున్నంగి సువార్త అడ్డగించడం దాడికి తక్షణ కారణం.
కారంచేడు మాదిగ పల్లెపై కమ్మ భూస్వాముల క్రూరమైన దాడిలో మగవాళ్ళని నరికిపడేసి అడ్డం వచ్చిన ఆడవాళ్ళమీద అసభ్యకరంగా బూతులు తిట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కొంతమంది స్త్రీలు బట్టలు ఉతుక్కోడానికి కాలవకి వెళ్ళగా వారి మీద కొందరు కమ్మ వాళ్ళు వారిమీద పడ్డారు, ఇళ్ళల్లో పనిచేసుకుంటున్న వారిమీద మరికొందరు పడ్డారు. వారిని ప్రతిఘటించిన సులోచన(మృతుడు దుడ్డు రమేష్ భార్య) వంటివారిని తీవ్రంగా కర్రలతో కొట్టడంతో వారికి స్పృహ తప్పింది. దాడికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుడు దుడ్డు వందనం తల్లి ఆలీసమ్మ సాక్ష్యం చెప్పిందనే అక్కసుతో ఆమెని అప్పటికప్పుడే ముసలామె అని కూడా చూడకుండా క్రూరంగా హతమార్చారు. చెరువు దగ్గర కమ్మ కుల పెత్తనాన్ని నిర్భయంగా నిలదీసిన మున్నంగి సువార్తతో బాటు దాడి తర్వాత చీరాల కేంద్రంగా జరిగిన పోరాటంలో కూడా దుడ్డు వీరమ్మ, తేళ్ళ అచ్చమ్మ (మృతుడు తేళ్ళ ముత్తయ్య భార్య), సులోచన మొదలైన దళిత స్త్రీలు వీరోచితంగా పాల్గొన్నారు. క్షతగాత్రులై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాదితులను పరమర్సించడానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సందర్శించాడు. అప్పుడు ‘దుడ్డు వీరమ్మ’ అనే స్త్రీ ఎన్టీ రామారావుకి ఎదురుగా నిలబడి ‘నువ్వు ముఖ్యమంత్రి అయినాక కారంచేడులో పతి కమ్మోడు తానొక ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు’ అని ఆయన బాదితులకోసం తీసుకొచ్చిన బత్తాయి పండ్ల బుట్టని విసిరిగొట్టింది. ఆమె చేసిన ఈ పనికి నోటమాట రాని ముఖ్యమంత్రి వెనుదిరిగి వెళ్ళడం చరిత్ర. బహుశా, స్త్రీవాద ఉద్యమంలో ఉద్దండులు అనుకునే స్త్రీలెవరూ ఇటువంటి సాహసం చేసి ఉండరు.
ఈరోజు చట్ట సభల్లో ప్రవేశించినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా నోరు మెదపని దళిత స్త్రీలు ఉన్నారు. గట్టిగా మాట్లాడితే ‘అలగా స్త్రీ’ అనుకుంటారని ఇతరులు చేసే అవమానాలకు ఎగిసి వచ్చే కసిని గుండెల్లోకి దిగమింగుకుని కళ్ళల్లో నీళ్ళు లోపలకు అదిమిపెట్టుకునే మధ్య తరగతి మనస్తత్వానికి అలవాటుపడే దళిత స్త్రీలు పెరిగిపోతున్నారు. అటువంటిది 1985లో గుండె నిబ్బరం తప్ప సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలైన దళిత శ్రామిక స్త్రీలు రాష్ట్ర ముఖ్యమంత్రినీ, ఆయన బంధువులనూ చెత్త పరక కింద జమకట్టడం, వాళ్ళేం చేస్తారో అనే భయం లేకుండా నిలదీయడం విస్మయం కలిగిస్తుంది. చావుకి భయపడని వారి ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకం. నిజానికి బాబాసాహెబ్ ఆశించిన స్త్రీ చైతన్యం అదే! కారంచేడు దళిత పోరాట యోధులకు జేజేలు… వారికి అన్యాయంపై తిరగబడడం ఉగ్గుపాలతో నేర్పి, తాము సైతం కులస్వామ్యానికి ఎదురు నిలిచిన మట్టి పిడికిళ్ళు కారంచేడు దళిత స్త్రీలకు ఉద్యమాభివందనాలు…

* బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉషా ఎస్. డ్యానీ గారి పక్కన ఉన్న వ్యక్తి దుడ్డు ఆలీసమ్మ, ఆరెంజ్ కలర్ చీర ధరించిన వ్యక్తి మున్నంగి సువార్తమ్మ, తెల్లచీర కట్టుకున్న స్త్రీ తేళ్ళ అచ్చమ్మ, పింక్ కలర్ చీరలో ఉన్న స్త్రీ సులోచన. నెత్తుటి కధ మొదలైంది ఈ చెరువు దగ్గరే …

చల్లపల్లి స్వరూపరాణి