• తక్షణ పూర్తి ప్రక్షాళన జరగాలి: సిబ్బళ్‌
  • పార్టీ తీరుపై కేంద్ర మాజీ మంత్రి 
  • చిదంబరం, కార్తి అసంతృప్తి
  • నాయకత్వ వైఫల్యమే: తారిఖ్‌ అన్వర్‌

న్యూఢిల్లీ : కాంగ్రె్‌సలో కొద్ది నెలల కిందట క్రితం రాజుకుని చల్లారిన అసమ్మతి బిహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ తలెత్తుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 70 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి 19 సీట్లే గెలుచుకోవడంతో పార్టీలో అసమ్మతి ధ్వనులు మరోసారి మొదలయ్యాయి. ఒక్క బిహార్‌ లోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పనితీరు పేలవంగా ఉందనీ, ఉత్తరప్రదేశ్‌లో అన్ని సీట్లలో కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయిందని పార్టీ నేతలు అంటున్నారు.  పార్టీ దుస్థితిపై సీనియర్‌  నేతలు  కపిల్‌ సిబ్బల్‌, చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం వరుసగా పార్టీ నాయకత్వంపై విమర్శలకు దిగడంతో మళ్లీ క్రమంగా పార్టీలో అసమ్మతి భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అసలు దేశంలో ప్రజలు కాంగ్రెస్‌ ను ఒక సమర్థమైన ప్రత్యామ్నాయంగా భావించడం లేదని.. కపిల్‌ సిబ్బల్‌ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి దిగజారుతున్నా, అంతా బాగానే ఉందని నాయకత్వం అనుకొంటోందేమో….. అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ’’పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్‌ ఉండదు. గత ఆరేళ్లుగా చవిచూస్తున్న పరాభవాలను పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడంలేదు.. ఇకముందైనా ఆత్మవిమర్శ చేసుకుంటుందన్న నమ్మకం కూడా నాకు లేదు’’ అని సిబ్బళ్‌ ఘాటుగా దుమ్మెత్తారు. ఎప్పటికీ కాంగ్రె్‌సలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో తన పనితీరుతో కాంగ్రెస్‌ అసంతృప్తిగా ఉందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ’’కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ త్వరలో పరిస్థితిని సమీక్షించి అధికారిక ప్రకటన చేస్తుంది..’’ అని చిదంబరం చెప్పారు. ఆయన కుమారుడు కార్తి చిదంబరం మరో అడుగు ముందుకేశారు. ’’కాంగ్రెస్‌ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. పరస్పరం సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి. అందుకు తగిన సమయమొచ్చింది’’ అని కార్తి వ్యాఖ్యానించారు.

బిహార్‌ రాష్ట్ర నేతలు ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వంపై నిరసన వ్యక్తం చేశారు. నాయకత్వ అంశంపై శాసనసభాపక్షంలో గందరగోళం చెలరేగింది.  సీనియర్‌ నాయకుడు తారిఖ్‌ అన్వర్‌ కూడా కాంగ్రెస్‌ పేలవమైన పనితీరు వల్ల మహాకూటమి అధికారంలోకి రాలేకపోయిందని అంగీకరించారు.  కాంగ్రెస్‌ 19 సీట్లే గెలుచుకోవడంతో ప్రధాన మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌ కూడా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తప్పుబట్టింది. ఈ ఓటమికి రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ కారణమని  ఆర్జేడీ నేత శివానంద తివారీ బాహాటంగానే విమర్శించారు. ఓ పక్క ఎన్నికలు జరుగుతుంటే రాహుల్‌ గాంధీ  సిమ్లాలో పిక్నిక్‌ వెళ్లారని వ్యాఖ్యానించారు.  ఈ దశలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ అస్తిత్వానికి సవాల్‌ కానున్నాయి. బిహార్‌ ఫలితాల  దరిమిలా..  తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ కాంగ్రె్‌సకు ఎన్ని సీట్లిస్తారన్నది సందేహమే.. ఇక బెంగాల్లో తృణమూల్‌- బీజేపీ ముఖాముఖి పోరులో కాంగ్రెస్‌- లెఫ్ట్‌ ఎన్ని సీట్లు గెలుస్తాయో చూడాలి. కాంగ్రెస్‌ కూడా వామపక్ష కేడర్‌ మీదే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక యూపీలో వచ్చేసారి కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకునేది లేదని సమాజ్‌వాదీ పార్టీ తేల్చిచెప్పేసింది.

Courtesy Andhrajyothi